టీ-బీజేపీ పీఠంపై గద్వాల్ జేజెమ్మకు గంపెడు ఆశలు!

  • Published By: sreehari ,Published On : February 5, 2020 / 12:30 PM IST
టీ-బీజేపీ పీఠంపై గద్వాల్ జేజెమ్మకు గంపెడు ఆశలు!

కాంగ్రెస్‌ పార్టీలో మంత్రిగా పని చేసి, గద్వాలలో తన ఆధిపత్యాన్ని చలాయించిన డీకే అరుణ.. ఇప్పుడు కమలం పార్టీలో కీలక స్థానం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్‌లో ఒక వెలుగు వెలిగిన ఆమె.. లోక్‌సభ ఎన్నికల ముందు బీజేపీలో చేరారు. ఇప్పుడు ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పీఠం కోసం పోటీ పడుతున్నారు.

ఒక్క చాన్స్ ఇస్తే.. పార్టీని ముందుండి నడిపిస్తానని పార్టీ ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారట. వన్‌ చాన్స్‌ ప్లీజ్ అంటూ జాతీయ నేతల చుట్టూ తిరుగుతున్నారట. ఒకసారి అవకాశం ఇస్తే.. తన సత్తా ఏంటో చూపిస్తానంటూ హైకమాండ్‌ను ఒప్పించే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారని చెబుతున్నారు. 

గద్వాల్ జేజమ్మగా పేరున్న డీకే అరుణ పుట్టినిల్లు.. మెట్టినిల్లు రాజకీయ నేపథ్యం ఉన్నవే. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అరుణ.. ఉమ్మడి రాష్ట్రంలో దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కేబినెట్‌లో మంత్రిగా పని చేశారు. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా పేరొందారు అరుణ.

ఏదైనా అనుకుంటే సాధించేవరకు వెనక్కు తగ్గడం ఆమెకు తెలియదు. ముక్కుసూటితనం ఆమె నైజం. అలాంటిది ఇప్పుడు బీజేపీ అధ్యక్ష పీఠం ఎలాగైనా సాధించాలనే పట్టుదలతో ఉన్నారామె. ఇందుకోసం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారంట. తనను పార్టీలోకి తీసుకొచ్చిన ముఖ్యనేత రామ్‌మాధవ్‌తో నిత్యం టచ్‌లో ఉంటూ మంత్రాంగం నడిపిస్తున్నారట. 

అవకాశమిస్తే సత్తా చూపిస్తా :
గతంలో డిల్లీ వెళ్లిన డీకే అరుణ.. మద్యపానానికి వ్యతిరేకంగా తాను చేపట్టిన దీక్షకు వచ్చిన స్పందనను జాతీయ నేతలకు వివరించారట. మరోసారి మున్సిపల్ ఎన్నికల్లో మహబూబ్ నగర్‌లో వచ్చిన ఫలితాలు జాతీయ నేతలకు వివరించారు. తనకు ఒక అవకాశం ఇస్తే సత్తా ఏంటో చూపిస్తానని చెప్పారట.

అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిన బీజేపీ.. ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాలు గెలిచింది. దీంతో పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చింది. కానీ, దానిని ఉపయోగించుకోవడంలో మాత్రం విఫలమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ దారుణంగా ఓడినప్పటికీ డీకే అరుణ మాత్రం మొదట చేరారు. ఆ తర్వాతే ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున వలసలు మొదలయ్యాయి. ఈ విషయాన్నే అరుణ అనుచరులు గొప్పగా చెబుతున్నారు. 

ఇదే బీజీపీ కలిసి వస్తుందా? :
ఒక్కసారి పార్టీ బాధ్యతలు అప్పగిస్తే కాంగ్రెస్‌లో ఉన్న అనేక మంది నాయకులు బీజేపీలో చేరతారని పార్టీ ముఖ్య నేతలతో పాటు అధిష్టానం వద్ద లాబీయింగ్‌ జోరుగా సాగిస్తున్నారట. మరోవైపు తెలంగాణలో ఉన్న ప్రధాన సామాజికవర్గం అంతా అరుణ వెనుక ఉంటారని లెక్కలేస్తున్నారు.

ఇది బీజేపీకి కలసి వస్తుందని అరుణ అనుచరులు చెబుతున్నారు. తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు తన శాయశక్తుల కృషి చేస్తానని ఆమె అంటున్నారు. మరి కొద్ది రోజుల్లోనే ఈ వ్యవహారం ఒక కొలిక్కి వస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చూడాలి అరుణ ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో? చూడాలి.