ఈయన రూటే సెపరేట్.. జగ్గు భాయ్ పాలి‘ట్రిక్స్’

  • Published By: sreehari ,Published On : July 7, 2020 / 05:47 PM IST
ఈయన రూటే సెపరేట్.. జగ్గు భాయ్ పాలి‘ట్రిక్స్’

అందరి నేతలది ఒక దారి అయితే… కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి రూట్ మాత్రం సెపరేట్.. తనదైన స్టయిల్‌లో వ్యవహరించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఒకప్పటిలా జగ్గు భాయ్ పరిస్థితులు లేవంటున్నారు. ఇప్పుడు జగ్గారెడ్డికి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయని అంటున్నారు. సంగారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తన నియోజకవర్గంలో కొన్ని ఏళ్లు తిరుగులేని నేతగా ఎదిగారు. ఉన్నట్టు ఏమైందో ఏమో తెలియదు.. ఆయన నియోజకవర్గానికి, ప్రజలకు, తన గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలకు దూరంగా ఉంటున్నారు. ఏకంగా హైదరాబాద్‌లోనే మకాం పెట్టేశారు. ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కార్యకర్తల్లో నిరాశ.. ఆందోళన :
గత అసెంబ్లీ ఎన్నికల్లో అభిమాన నేత కోసం ఎంతో కష్టపడి పనిచేశామని, కానీ, తమను పట్టించుకోకుండా ఆయన హైదరాబాద్‌లో మకాం పెట్టడంపై కార్యకర్తల్లో నిరాశ ఆవహిచింది. ఎన్నికల సమయంలో ఇంటింటికి తిరిగి జగ్గారెడ్డిని గెలిపించాలని ఓట్లడిగిన వారంతా గగ్గోలు పెడుతున్నారు. ఆ ఓట్లు వేసిన వారు ఎదురుపడి ఎక్కడ జగ్గారెడ్డి అంటే సమాధానం చెప్పలేకపోతున్నామంటూ కార్యకర్తలు మదన పడుతున్నారు. నియోజక వర్గ ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కార్యకర్తలంతా ఒక్కొక్కరూ జగ్గారెడ్డికి దూరమవుతున్నారట. ప్రధాన అనుచరుడు రామకృష్ణారెడ్డి కొన్నాళ్ళ క్రితం తన అనుచరులతో మంత్రి హరీశ్‌రావు సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరిపోయారు. ఆ తర్వాత కొన్నాళ్లకు సదాశివపేట, సంగారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లు ఇదే బాట పట్టడం వారిలో ఆందోళన కలిగిస్తోంది.

జగ్గారెడ్డికి ప్రధాన అనుచరుడిగా మొదటి నుంచి వెన్నుంటి నడిచిన లాల్ సాబ్ గడ్డకు చెందిన మైనార్టీ నేత షాబీర్ పాషా ఇటీవలే హరీశ్‌రావు సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇలా ఒక్కొక్కరూ జగ్గారెడ్డికి దూరమవుతూ వస్తున్నారు. ఒకానొక సందర్భంలో జగ్గారెడ్డి కూడా టీఆర్ఎస్‌లోకి వెళ్లిపోతారనే ప్రచారం కూడా జరిగింది. జనానికి, కేడర్‌కు దూరమైపోతూ హైదరాబాద్‌లో కూర్చుని ప్రకటనలిస్తున్న జగ్గారెడ్డి వ్యవహారశైలిపై చర్చ నడుస్తోంది.

జగ్గా రెడ్డి వ్యవహార శైలితో అయోమయంలో క్యాడర్ :
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యేగా జగ్గారెడ్డి మాత్రమే ఉన్నారు. ఆయన అధికార పార్టీని ఒకవైపు తిడుతూ ఒకసారి పొగుడుతూ మరోసారి ప్రకటనలు ఇస్తుండడంతో కార్యకర్తలంతా కన్‌ఫ్యూజ్‌ అవుతున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు రాబట్టే ఆలోచన చేయడంలేదని ప్రజలు సైతం అనుకుంటున్నారు. ప్రభుత్వంతో పోరాడి నిధులు తెస్తా.. జిల్లా కేంద్రాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతా అని మాటలు చెప్పిన జగ్గా రెడ్డి.. అసలు నియోజకవర్గంలో కనిపించడమే మానేసారని అనుకుంటున్నారు.

జిల్లా మంత్రి హరీశ్‌రావును జడ్పీ హాలులో సన్మానించి, నీకు నాకూ వ్యక్తిగత శత్రుత్వం లేదు… ఇకపై నా నియోజకవర్గ అభివృద్ధి కోసం నిన్ను కలుస్తా అని చెప్పి అందరినీ ఆశ్చర్య పరిచారు జగ్గారెడ్డి. ఆ తర్వాత కొద్దిరోజులకే మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీశ్‌పై విమర్శలు గుప్పించి ఇరకాటంలో పడ్డారు. అటు ఇటు కాని తన వ్యవహారశైలితో అటు క్యాడర్‌కు, ఇటు జనానికి అర్థం కాక దూరమైపోతున్నారు జగ్గూభాయ్‌.