సీఎం జగన్‌కు నాని సవాల్.. చంద్రబాబుని ఓడిస్తానన్న ఎంపీపై ప్రశంసలు

  • Published By: veegamteam ,Published On : February 19, 2020 / 06:20 AM IST
సీఎం జగన్‌కు నాని సవాల్.. చంద్రబాబుని ఓడిస్తానన్న ఎంపీపై ప్రశంసలు

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ)లకు వ్యతిరేకంగా విజయవాడలో మంగళవారం(ఫిబ్రవరి 18,2020) భారీ సభ జరిగింది. ఈ సభలో టీడీపీ నేతలు కేశినేని నాని, జలీల్ ఖాన్ తో పాటు హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు. ఈ సభలో కేంద, రాష్ట్ర ప్రభుత్వాలపై ఎంపీ కేశినేని నాని ఫైర్ అయ్యారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపైన ప్రశంసల వర్షం కురిపించారు. ఒవైసీ ఆరేళ్లుగా చూస్తున్నా.. దేశంలో పార్లమెంటేరియన్ అంటే ఇలా ఉండాలనిపించేలా వ్యవహరిస్తున్నారు అటూ కేశినేని నాని కొనియాడారు.

నా తల్లి పౌరసత్వాన్ని ఎలా నిరూపించుకోవాలి:
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై నాని విరుచుకుపడ్డారు. ఒక మతం పట్ల వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. సీఏఏ, ఎన్ఆర్సీ అందులో భాగమే అన్నారు. కులం, మతం ఆధారంగా ప్రజలను, దేశాన్ని విభజించే హక్కు ప్రధాని మోడీ, అమిత్ షాకు ఎవరిచ్చారని నిలదీశారు. నేను భారతీయున్ని అని రుజువు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదన్నారు. తన తల్లి పౌరసత్వాన్ని తాను ఎలా నిరూపించుకోవాలని కేశినేని నాని ప్రశ్నించారు. ఎన్ఆర్సీ, సీఏఏను వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కేశినేని నాని డిమాండ్ చేశారు. 22మంది వైసీసీ ఎంపీలు, టీడీపీకి చెందిన ఇద్దరు ఎంపీలు సీఏఏకు అనుకూలంగా ఓటేశారని చెప్పిన నాని.. తాను మాత్రం వ్యతిరేకించి బయటికి వచ్చానని తెలిపారు.

జగన్ కు టీడీపీ ఎంపీల మద్దతు:
ఈ క్రమంలో సీఎం జగన్ ను ఇరుకున పెట్టేలా కేశినేని నాని మాట్లాడారు. సీఎం జగన్ కు సవాల్ విసిరారు. కేరళ తరహాలోనే సీఏఏ, ఎన్ఆర్సీకు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టాలని జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కేశినేని నాని. ఇందుకు టీడీపీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు కూడా మద్దతు పలుకుతారని చెప్పారు. మూడు రాజధానుల బిల్లుకు బదులు సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా తీర్మానం చేస్తే తామేంతో సంతోషించేవాళ్లమన్నారు. సీఏఏను సవాల్ చేస్తూ జగన్ ప్రభుత్వం కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలన్నారు కేశినేని నాని.

చంద్రబాబుని ఇరుకునపడేశారా?
సభలో ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. నాని తీరు చంద్రబాబుని ఇరుకునపడేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జగన్ ను ఇరుకునపెట్టాలని కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు చంద్రబాబుకి కొత్త తలనొప్పి తెచ్చాయని తమ్ముళ్లు కూడా అనుకుంటున్నారు. ఒకవేళ అసెంబ్లీలో సీఏఏ, ఎన్ఆర్సీలను వ్యతిరేకిస్తూ జగన్ ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెడితే అందుకు టీడీపీ సభ్యులు తప్పనిసరిగా మద్దతు తెలపాల్సి ఉంది. అదే కనుక జరిగితే.. పార్లమెంటులో సీఏఏకు మద్దతు తెలిపి, అసెంబ్లీలో సీఏఏ వ్యతిరేక తీర్మానానికి మద్దతు తెలిపితే టీడీపీ విమర్శల పాలు కావాల్సి ఉంటుంది. పైగా, చంద్రబాబుని ఓడించేందుకు ఏపీకి కూడా వెళ్తామంటూ ఎన్నికల ప్రచారంలో తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఒవైసీపై.. టీడీపీ ఎంపీ కేశినేని నాని ప్రశంసలు కురిపించడం ఏంటని తమ్ముళ్లు మండిపడుతున్నారు.

మతం ఆధారంగా చట్టమా?
ఇదే సభలో టీడీపీ నేతలతో కలిసి వేదిక పంచుకున్న అసదుద్దీన్ ఒవైసీ.. ఎప్పుడూ లేని విధంగా మతం ఆధారంగా చట్టం చేశారని మండిపడ్డారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) తెచ్చిందని ఆరోపించారు. ముస్లింలను ఉద్దేశపూర్వకంగా దూరం పెట్టే విధంగా చట్టం తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఏఏ ఆజాద్ హిందూస్తాన్ కు వ్యతిరేకం అన్నారు. దేశాన్ని ప్రేమించే వారు ఎవరైనా.. సీఏఏని వ్యతిరేకించాలన్నారు. ఈ సభలో టీడీపీ నేతలు ఎంపీ కేశినేని నాని, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ పాల్గొన్నారు. అధికార పార్టీకి చెందిన వైసీపీ నేతలు మాత్రం ఈ సభకు దూరంగా ఉన్నారు.

జగన్, చంద్రబాబు చేతులు కలపాలి:
ఏపీ సీఎం జగన్ సీఏఏని వ్యతిరేకించాలని అసద్ పిలుపునిచ్చారు. అలాగే ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు సైతం సీఏఏని వ్యతిరేకించాలని, తమ పోరాటంలో కలిసిరావాలని కోరారు. టీడీపీ నేత జలీల్ ఖాన్ పై ఒవైసీ ప్రశంసలు కురిపించారు. జలీల్ ఖాన్ లా ధైర్యంగా చంద్రబాబుతో పాటు అందరూ ముందుకు రావాలని, సీఏఏని వ్యతిరేకించాలని కోరారు. ఇది కేవలం ముస్లింల సమస్య మాత్రమే కాదన్న ఒవైసీ.. ప్రతి ఒక్కరు సీఏఏని వ్యతిరేకించాలన్నారు.

1

Read More>> 19 ఏళ్లలో రూ.17 కోట్లు దానం : భర్త ఆశయం నెరవేస్తున్నసాధారణ గృహిణి