ముస్లింల మిలియన్ మార్చ్..భారీగా ట్రాఫిక్ జాం..

  • Published By: madhu ,Published On : January 5, 2020 / 04:40 AM IST
ముస్లింల మిలియన్ మార్చ్..భారీగా ట్రాఫిక్ జాం..

పౌర చట్టం, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా నిరసనకారులు హైదరాబాద్‌లో కదం తొక్కారు. ఈ ర్యాలీ తెలంగాణ ఉద్యమంలో నిర్వహించిన మిలియన్ మార్చ్‌ని తలపించింది.  ముస్లిం షబ్బాన్, జమాతే ఇస్లామీ, జామియతే ఉలేమా, ఎంబీటీ, తెహ్రీక్, అమెలే హదీస్, జమాతే ఇస్లామీ, తామిరేమిల్లత్‌తో పాటు పలు ప్రజా, దళిత, విద్యార్థి సంఘాలు, సామాజిక కార్యకర్తలు, మహిళా సంఘాల నేతలు, స్వచ్చం సంస్థలతో కూడిన 48 సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ర్యాలీకి పిలుపునిచ్చింది.

 

లక్షలాదిగా ముస్లింలు, నిరసనకారులు మిలియన్ మార్చ్‌కు తరలివచ్చారు. ఇందిరాపార్కు వద్ద ఇసుక వేస్తే రాలనంత జనం ఉన్నారు. పార్కు పరిసర ప్రాంతాలు జనసంద్రాన్ని తలపించాయి. ఓ చేతిలో జాతీయ జెండా, మరో చేతిలో సీఏఏ, ఎన్నార్సీ వ్యతిరేక ప్ల కార్డులు పట్టుకుని కదం తొక్కారు. ఎన్టీఆర్ స్టేడియం, ధర్నా చౌక్, లోయర్ ట్యాంక్ బండ్, కట్టమైసమ్మ దేవాలయం, ఆర్టీసీ క్రాస్ రోడ్డు తదితర ప్రాంతాలు జనాలతో నిండిపోయాయి. అసలే రద్దీ ప్రాంతాలు కావడంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయాయి.

మధ్యాహ్నం 3 గంటలకు తెలుగు తల్లి ఫ్లై ఓవర్, లోయర్ ట్యాంక్ బండ్ కిక్కిరిసిపోయింది. అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొనడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జనాలతో రోడ్లన్నీ జనసంద్రంగా మారడంతో వాహనాలు ఇరుక్కపోయాయి.

ముందుకు వెళ్లలేక, వెనక్కి పోలేక నరకయాతన పడ్డారు. మరికొన్ని వాహనాలను ట్రాఫిక్ మళ్లించారు. దీంతో ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించి పోయింది. భారీ సంఖ్యలో జనాలు పాల్గొన్నా..ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకపోవడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. 

Read More : TikTok top 10 viral Videos : అదరక్ ఇలాయిచీ మార్‌కే