టీకాంగ్రెస్ నేతల్లో సమన్వయలోపం.. ఇదే టీఆర్ఎస్‌కు కలిసొచ్చిందా?

  • Published By: sreehari ,Published On : July 7, 2020 / 10:06 PM IST
టీకాంగ్రెస్ నేతల్లో సమన్వయలోపం.. ఇదే టీఆర్ఎస్‌కు కలిసొచ్చిందా?

తెలంగాణ కాంగ్రెస్‌ పరిస్థితి చిత్రవిచిత్రంగా తయారవుతోంది. వరుసగా అన్ని ఎన్నికల్లోనూ ఓటమి పాలవుతూ వచ్చిన పార్టీకి మధ్యలో లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం కాస్తా సానుకూల ఫలితాలు వచ్చినా.. పార్టీలో మాత్రం పూర్తి స్థాయి జోష్‌ కనిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టి ప్రజల్లో పట్టు పెంచుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంది.

కరోనా కాలంలోనూ ప్రజా సమస్యలపై పోరాడేందుకు ఆరాటపడుతోంది. కరోనా కట్టడిలో టీఆర్ఎస్‌ ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్‌ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ముందు నుంచి జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా ఆరోపణలు చేస్తున్నారు.

రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్‌ జోరు పెంచింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు చాలా మంది టీఆర్ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. కొందరు ముఖ్య నేతలు కూడా కండువా మార్చేశారు. కాంగ్రెస్‌ బలహీనపడుతూ వచ్చింది. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం కొంత మేరకు ప్రభావం చూపించినట్టుగా కనిపించింది. దీంతో పార్టీలో కొత్త ఉత్సాహం వస్తుందని అందరూ భావించారు.

కార్యకర్తల్లో కూడా జోష్‌ కనిపించింది. కానీ, ఆ తర్వాత ప్రభుత్వాన్ని నిలదీసేందుకు వచ్చిన అవకాశాలను కాంగ్రెస్‌ పార్టీ జారవిడుచుకుంది. నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం టీఆర్ఎస్‌కు కలసి వచ్చింది. ఒక నాయకుడు ఏదైనా కార్యక్రమం చేపడదామని అంటే.. మిగిలిన నేతలు వద్దనడం.. లాంటి కారణాలతో కాంగ్రెస్‌ బండి ముందుకు సాగలేదు.

పార్టీ చీఫ్‌గా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఐదేళ్లు పూర్తి చేసుకున్నారు. పార్టీ పరంగా ఏదైనా కార్యక్రమాలు చేపట్టేందుకు ఉత్తమ్‌ ఇచ్చే పిలుపును కొందరు నేతలు పట్టించుకోవడం లేదంటున్నారు. సీనియర్‌ నాయకులు కొందరు అసలు పార్టీ గురించి పట్టించుకోవడం లేదు.

ఉన్న కొద్ది మంది మీడియా సమావేశాలకే పరిమితమైపోతున్నారని కార్యకర్తలు అనుకుంటున్నారు. అప్పుడప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా కార్యక్రమాలకు పిలుపునిచ్చినా.. పెద్దగా నేతలకు కలసి రావడం లేదని బాధపడుతున్నారు. పార్టీలో మార్పులుంటాయని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. అది కూడా వాయిదాలు పడుతూ వస్తోంది. దీనివల్ల నాయకులు కూడా పెద్ద ఆసక్తి చూపించడం లేదంటున్నారు.

కరోనా కాలంలో విద్యుత్‌ బిల్లుల అంశాన్నే తీసుకుంటే.. వేడి ఉన్నప్పుడే ఆందోళనలు చేస్తే ప్రయోజనం ఉంటుంది. బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నప్పుడే ఆందోళనలు చేసి ఉండాల్సిందని కార్యకర్తలు అంటున్నారు. అప్పుడు వదిలేసి ఇప్పుడు నింపాదిగా కార్యక్రమాలు చేపట్టింది. అలాగే సాగునీటి ప్రాజెక్టుల గురించి కరోనా కాలంలో నిరసన ప్రదర్శనలు చేసింది.

కానీ, ఆ ప్రాజెక్టులేవీ ఇప్పటి కావు. ప్రారంభించినప్పుడే చేయాల్సిన ఆందోళనలు ఇప్పుడు చేయడం వల్ల ఆశించిన మైలేజీ రావడం లేదని కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. ఏదైనా చేయాల్సిన టైమ్‌లోనే చేయాలని, అప్పుడే దాని ప్రభావం ఉంటుందని అంటున్నారు. లేట్‌గా స్పందిస్తే ఇలానే ఉంటుందని కాంగ్రెస్‌ కార్యకర్తలే పెదవి విరుస్తున్నారు.