రాజధానిని తరలిస్తారా : జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఏపీ రాజధాని నిర్మాణంపై సందేహాలు ముసురుకున్న వేళ... జగన్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి నిర్మాణంపై... ఆరుగురు పట్టణాభివృద్ధి రంగ నిపుణులతో

  • Published By: veegamteam ,Published On : September 14, 2019 / 02:07 AM IST
రాజధానిని తరలిస్తారా : జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఏపీ రాజధాని నిర్మాణంపై సందేహాలు ముసురుకున్న వేళ… జగన్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి నిర్మాణంపై… ఆరుగురు పట్టణాభివృద్ధి రంగ నిపుణులతో

ఏపీ రాజధాని నిర్మాణంపై సందేహాలు ముసురుకున్న వేళ… జగన్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి నిర్మాణంపై… ఆరుగురు పట్టణాభివృద్ధి రంగ నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసింది. దీనిపై ఎన్నో అనుమానాలు నెలకొనగా.. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసమే కమిటీ ఏర్పాటు చేశామమని సర్కార్ చెబుతోంది. ఇంతకీ.. ఇది.. రాజధానిని తరలించే వ్యూహమా? లేదంటే.. అమరావతిని పరుగులు పెట్టించడంలో భాగమా అన్నది చర్చనీయాంశంగా మారింది.

అమరావతి వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌లో పెను దుమారాన్ని సృష్టిస్తోంది. వైసీపీ ప్రభుత్వం అమరావతి నుంచి రాజధానిని తరలించే ప్రయత్నం చేస్తోందంటూ ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. రాజధానిని అక్కడే కొనసాగించాలంటూ పోరాటం చేస్తున్నాయి. ఈ క్రమంలో అమరావతిపై జగన్ ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. ఆరుగురు సభ్యులతో కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ జీఎన్ రావు కన్వీనర్‌గా వ్యవహరించే ఈ కమిటీలో… ప్రొఫెసర్ మహావీర్, అంజలీ మోహన్, శివానందస్వామి, కేటీ రవీంద్రన్, డాక్టర్ అరుణాచలం సభ్యులుగా ఉంటారు. వీరంతా పట్టణాభివృద్ది రంగంలో నిపుణులే. రాజధాని అమరావతితో పాటు రాష్ట్రాభివృద్ధికి పలు సూచనలు, సలహాలు కూడా ఇవ్వనుంది. ఈ కమిటీ ఆరు వారాల్లో నివేదిక ఇవ్వనుంది.   

ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక రాజధాని నిర్మాణాన్ని నిలిపివేశారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. అదే సమయంలో మున్సిపల్‌ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు రాజకీయ రగడకు కారణమయ్యాయి. అమరావతి నిర్మాణానికి ఖర్చు ఎక్కువ అవుతుందని… వరదలు వస్తే మునిగిపోయే ప్రమాదం ఉందన్నారు. ఈ వ్యాఖ్యలు పెను దుమారాన్ని సృష్టించాయి. జగన్ ప్రభుత్వం రాజధానిని అమరావతి నుంచి తరలించాలనే ప్రయత్నం చేస్తోందంటూ ప్రతిపక్ష టీడీపీ ఆరోపించింది. దీంతోపాటు అమరావతి కోసం భూములిచ్చిన రైతుల్లో కూడా గందరగోళం నెలకొంది. వారిలో కొందరు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకొన్నారు. పవన్ కళ్యాణ్ కూడా అమరావతిలో పర్యటించి వారికి భరోసా ఇచ్చారు.

తాజాగా ప్యారిస్ లాంటి రాజధాని అవసరమా అని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి కూడా ప్రశ్నించారు. ఇటీవల సింగపూర్‌లో పర్యటించిన బుగ్గన… రాజధాని నిర్మాణానికి నిధులు లేవని చెప్పుకొచ్చారు. ఈ పరిణాల నేపధ్యంలో రాజధాని నిర్మాణంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం అధ్యయన కమిటీ వేయడంతో… అమరావతి భవిష్యత్‌పై ఆసక్తి నెలకొంది. గతంలో చంద్రబాబు ప్రభుత్వం రూపొందించిన అమరావతి మాస్టర్ ప్లాన్‌ను జగన్ ప్రభుత్వం అమలు చేయదన్నది జగమెరిగిన సత్యం. అయితే, రాజధాని విషయంలో జగన్ విజన్ ఎలా ఉంటుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిపుణుల కమిటీ ఇచ్చే నివేదికను బట్టి అమరావతి నిర్మాణంపై నిర్ణయం తీసుకొనే అవకాశముంది. ఇంతవరకు జరిగిన నిర్మాణాలను ఏం చేయబోతున్నారు? మధ్యలో ఆగిన నిర్మాణాల పరిస్థితేంటన్న విషయంపై నిపుణుల కమిటీ నివేదికలో తమ అభిప్రాయం తెలపనుంది.

రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసమే ఈ కమిటీ వేశామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. 13 జిల్లాలు అభివృద్ధి చెందాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. అయితే.. ప్రభుత్వ నిర్ణయంపై ఎన్నో అనుమానాలు రాజుకుంటున్నాయి. రాజధానిని తరలించే వ్యూహంలో భాగంగానే కమిటీని నియమించారా? లేదంటే… జగన్‌ విజన్‌తో అమరావతిని పరుగులు పెట్టిస్తారా అన్నది ఆసక్తిగా మారింది.