నిన్న పేకాట శిబిరం, నేడు రూ.80లక్షల నగదు వ్యవహారం.. వివాదాల్లో కూరుకుపోతున్న వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి

  • Published By: naveen ,Published On : September 21, 2020 / 03:29 PM IST
నిన్న పేకాట శిబిరం, నేడు రూ.80లక్షల నగదు వ్యవహారం.. వివాదాల్లో కూరుకుపోతున్న వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి

ఏపీ రాజధాని అమరావతి పరిధిలో ఉన్న తాడికొండ నియోజకవర్గం ఇప్పుడు సంచలనంగా మారింది. అక్కడ నుంచి గత ఎన్నికల్లో గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి చుట్టూ వివాదాలు రాజుకుంటున్నాయి. టీడీపీ గెలుస్తుందనుకున్న ఈ నియోజకవర్గంలో హైదరాబాద్‌లో డాక్టర్ వృత్తిలో ఉన్న ఉండవల్లి శ్రీదేవి పోటీ చేసిన మొదటి సారే విజయం సాధించడం సంచలనమే. గెలిచిన తర్వాత నుంచి ఆమె అనేక వివాదాలను ఎదుర్కొన్నారు. గతేడాది వినాయకచవితి పందిళ్లలోకి ఆమెను రానివ్వకపోవటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఉద్దేశపూర్వకంగానే తనను పందిట్లోకి రానివ్వకుండా అడ్డుకున్నారని ఆమె ఆరోపించారు.

సొంత పార్టీ ఎంపీతో విభేదాలు:
రాజధాని ప్రాంతంలో కుల వివక్ష ఉందని శ్రీదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా. ఆ తర్వాత ఆమె ఎస్సీ కాదంటూ కొంతమంది ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆమె జాయింట్ కలెక్టర్ ఎదుట విచారణకు హాజరై తనపై కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇప్పుడు సొంత పార్టీలోని నేతలతో సైతం ఆమెకు విభేదాలు మొదలయ్యాయి. బాపట్ల ఎంపీ నందిగం సురేష్ సొంత ప్రాంతం రాజధానిలో ఉండటంతో ఆయన పెత్తనం చలాయించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీనిని ఆమె బహిరంగంగానే వ్యతిరేకించారు.

పేకాట శిబిరం నిర్వహించే వ్యక్తి ఎమ్మెల్యే అనుచరుడా?
ఈ పరిస్థితుల్లో శ్రీదేవి, సురేశ్‌ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి విభేదాలు చేరుకున్నాయి. ఆ తర్వాత పార్టీ పెద్దల మధ్యవర్తిత్వంతో ఇద్దరి మధ్య కొంత సఖ్యత కుదిరింది. గత కొంతకాలంగా అంతా బాగానే ఉందని భావిస్తున్న సమయంలో కొద్ది రోజుల క్రితం పెదకాకాని సమీపంలోని ఐజేఎం అపార్ట్‌మెంట్‌లో కొంతమంది పేకాట శిబిరం నిర్వహిస్తున్న విషయం పోలీసులకు తెలిసింది. వెంటనే పెద్ద ఎత్తున పోలీసులు పేకాట శిబిరంపై దాడి చేసి, 30 మంది వరకూ అరెస్ట్ చేశారు. శిబిరం నిర్వహిస్తున్న వ్యక్తి ఎమ్మెల్యే అనుచరుడు సురేశ్‌ అనే ప్రచారం జరిగింది.

ఎమ్మెల్యే అండదండలతోనే పేకాట శిబిరం?
ఎమ్మెల్యే అండదండలతోనే శిబిరం నడుస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీనిపై డీజీపీకి సైతం ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయం ఇలా ఉండగానే పేకాట శిబిరం నిర్వహించారని ఆరోపణలు ఎదుర్కొన్న రమణారెడ్డి, సందీప్, సురేశ్‌లను వైసీపీ నుంచి బహిష్కరించారు. ఇలా వరుస పెట్టి వివాదాల్లో ఇరుక్కొని ఇబ్బందులు పడుతున్న ఆమెకు తాజాగా మరో షాక్‌ తగిలింది.

ఎమ్మెల్యే శ్రీదేవితో తనకు రూ.80లక్షలు ఇప్పించాలని సీఎంను కోరిన రవి:
ఎమ్మెల్యే శ్రీదేవి తన దగ్గర కోటి నలభై లక్షల రూపాయల నగదు తీసుకొని 60 లక్షల రూపాయలు వెనక్కు ఇచ్చారని, మిగిలిన 80 లక్షల రూపాయలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారంటూ మేకల రవి అనే వ్యక్తి ఓ సెల్ఫీ వీడియో తీశారు. అది కాస్తా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తన డబ్బులు తనకు ఇప్పించాలంటూ ఆ వీడియోలో రవి ఏకంగా ముఖ్యమంత్రినే కోరాడు. ఈ వీడియో వివాదాస్పదం కావటంతో మండల పార్టీ నేతలు మేకల రవిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేకి డబ్బులిచ్చేంత స్థోమత రవికి లేదని, పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన కొంతమంది రవితో ఇలా చేయిస్తున్నారని అంటున్నారు.

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్:
ఎమ్మెల్యే శ్రీదేవి చుట్టూ వివాదాలు ముసురుకుంటూనే ఉన్నాయి. ఈ వివాదాలను ప్రస్తావిస్తూ ప్రతిపక్షాల నేతలు ఆమెను ఇరకాటంలో పెడుతున్నాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీదేవి తన పదవికి రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్ చేసింది. కాకపోతే ఆమె మాత్రం ఇవన్నీ తనపై కక్ష సాధించేందుకు జరుగుతున్న కుట్రలుగా పేర్కొంటున్నారు. ఈ విషయంలో ఎవరినీ విడిచిపెట్టేది లేదని వార్నింగ్‌ ఇస్తున్నారు. మరి ఈ వివాదాల నుంచి ఆమె ఎలా బయటపడతారో చూడాలంటున్నారు జనాలు.