రాజుల జిల్లా.. టీడీపీ ఖిల్లా

  • Published By: vamsi ,Published On : March 7, 2019 / 07:17 AM IST
రాజుల జిల్లా.. టీడీపీ ఖిల్లా

తన రాజకీయ చాణక్యమో.. లేక స్వార్థ ప్రయోజనం కోసమోగాని.. శతాబ్ధాల శత్రుత్వాన్ని క్షణ కాలంలో మిత్రుత్వంగా మార్చేశారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు. వందల ఏళ్లుగా కత్తులు దూసుకున్న ఆగర్భ శత్రువలను సైతం ఒకే గొడుగు కిందకు తీసుకుని వచ్చారు. కారణాలు ఏవైనా ఈ పరిస్థితి మాత్రం ఆ జిల్లాలో సరికొత్త రాజకీయానికి తెరలేపినట్లైంది. వారి అనుచరగణంలోనూ స్నేహపూరిత వాతావరణం నెలకొనడంతో ఆ జిల్లా ఇప్పుడు సరికొత్తగా కనిపిస్తోంది. ఒకప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వైరమున్న రాజులు, సంస్థానాదీశులు, జమీందార్లు.. ఇప్పుడు ఒకే జెండా కిందకు చేరి చేతులు కలిపారు. జిల్లాలోని నాలుగు ప్రధాన సంస్థానాలు ఒకేపార్టీలో చేరడం.. వచ్చే ఎన్నికల్లో వీరంతా ఒకేపార్టీ గుర్తుపై పోటీ చేస్తుండటంతో విజయనగరం జిల్లాలో సరికొత్త రాజకీయ ముఖచిత్రానికి తెరలేచింది.
రాజుల ఖిల్లాగా పేరొందిన విజయనగరం జిల్లాలో సంస్థానాల పరంగానూ, రాజకీయంగానూ వైరమున్న సంస్థానాదీశులంతా ఇప్పుడు ఒకే కోటలోకి అడుగుపెట్టారు. సంస్థానాదీశులంతా సైకిలెక్కి సవారీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో ఆవిష్క్రతమవుతున్న ఈ సరికొత్త రాజకీయ ముఖచిత్రాన్ని చూసినవారంతా.. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే సామెతను గుర్తు చేసుకుంటున్నారు. విజయనగరం పూసపాటి రాజులతో పాటు బొబ్బిలి రంగారావు జమిందార్లు, కురుపాం, మేరంగి జమిందార్లు నేటి ప్రజాస్వామ్య వ్యవస్థలోనూ రాజకీయ పదవుల్ని అధిరోహించి.. తమ ఉనికిని కొనసాగిస్తున్నారు. ఇలా జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లోనూ నాటి రాజులు, జమీందార్ల ఉనికి కొనసాగుతుంది.
ఈ క్రమంలో రాజకీయాల్లో విజయనగరం పూసపాటి మహరాజులది ప్రత్యేక స్థానం ఏర్పడింది. విజయనగరం సంస్థానానికి చివరి పట్టాభిషిక్తుడైన నాటి పీవీజీ రాజు నుంచి ఆయన చిన్న కుమారుడు ప్రస్తుత ఎంపీ పూసపాటి అశోక్ గజపతిరాజు వరకు రాజకీయాల్లో తమదైన ముద్రను కొనసాగిస్తూ వస్తున్నారు. నాడు రాజులగానూ.. నేడు రాజకీయాల్లోనూ ఏమాత్రం తగ్గకుండా ప్రత్యేకతను చాటుతున్నారు. విజయనగరం సంస్థానం చరిత్రలోకి వెళితే.. విజయనగరం కేంద్రంగా సుమారు 1600 సంవత్సరంలో పూసపాటి వంశీయుల ప్రాభవం ప్రారంభమైంది. అటు తూర్పుగోదావరి జిల్లా నుంచి ఇటు ఒడిశాలోని నాటి కళింగ ప్రాంతం వరకు వీరి సంస్థానం విస్తరించి ఉండేది. ఒక విధంగా చెప్పాలంటే, అప్పట్లో దేశంలో పేరుమోసిన సంస్థానాల్లో విజయనగరానికి ప్రత్యేక స్థానం ఉండేది. విజయనగరం రాజుల మూలాలు ఇప్పటి వారణాసి వరకు విస్తరించి ఉన్నాయంటే వీరి హవా ఎలా సాగిందో చెప్పవచ్చు. 
1757 జనవరిలో బొబ్బిలి రాజులతో వీరు చేసిన యుద్ధాన్నే బొబ్బిలి యుద్ధంగా చెప్పుకుంటుంటారు. అప్పటి నుంచి విజయనగరం సంస్థానం వివిధ వలస పాలకుల దాడులకు తట్టుకుంటూ నేటి వరకూ తన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తోంది. ఈ సంస్థానానికి చివరి పట్టాభిషిక్తుడు డాక్టర్ పీవీజీ రాజు. ఈయన కుమారులే మాజీ మంత్రి ఆనంద గజపతిరాజు, నేటి ఎంపి అశోక్ గజపతిరాజు. సోషలిస్టు, ప్రజా సోషలిస్టు, డెమొక్రసీ, కాంగ్రెస్ పార్టీలలో పీవీజీ రాజు ప్రముఖ పాత్ర వహించారు. నాలుగుసార్లు ఎంపీగా, కేంద్ర మంత్రిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య, విద్యాశాఖల మంత్రిగా పదవులను నిర్వహించారు. 
పీవీజీ రాజు పెద్ద కుమారుడైన ఆనంద గజపతిరాజు కూడా ఎంపీగా, ఎన్టీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. చిన్న కుమారుడు అశోక్ గజపతిరాజు 1978లో సోషలిస్టు పార్టీ నుంచి విధాన సభకు ఎన్నికై ఆ తర్వాత 1982లో టీడీపీలో చేరి, నేటి వరకు అదే పార్టీలో కొనసాగుతూ ఓటమి ఎరుగని నేతగా ఉన్నారు. అనేక పదవులను అనుభవించిన అశోక్ గజపతిరాజు.. ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. సుమారు 400 ఏళ్ల చరిత్ర ఉన్న విజయనగరం సంస్థానం నాటి నుంచి నేటి వరకు తన ఉనికిని కాపాడుకుంటూ రాష్ట్రంలో ప్రత్యేకతను చాటుకుంటున్నారు. 
జిల్లాలో రెండవ అతిపెద్ద జమిందారీ కుటుంబం బొబ్బిలి రాజులు. శౌర్యప్రతాపాల గడ్డగా పేరున్న బొబ్బిలి గురించి తెలియని తెలుగువారుండరు. విజయనగరం రాజులకు, బొబ్బిలి రాజులకు మధ్య జరిగిన యుద్ధం బొబ్బిలి యుద్ధంగా చరిత్రలోనే ప్రసిద్ధికెక్కింది. విజయనగరం రాజుల ఆధిపత్యం సహించలేని నాటి బొబ్బిలి రాజులు ఆత్మాభిమానాన్ని చంపుకోలేక నాడు తిరుగుబావుటా ఎగురవేశారు. ప్రెంచి దొరల సహకారంతో విజయనగరం రాజులు బొబ్బిలిపై దండెత్తినా.. బొబ్బిలి వీరులు వీరోచితంగా చేసిన పోరాటం ఇప్పటికీ.. జానపద కథల రూపంలో తెలుగునాట వినిపిస్తూనే ఉంటుంది. నాటి బొబ్బిలి సంస్థానం చారిత్రక గురుతులే కాదు.. సంస్థానాదీశుల వారుసులు కూడా ఇప్పటికీ ఇక్కడ తమ ప్రాభవాన్ని కొనసాగిస్తున్నారు. బొబ్బిలి సంస్థాన రాజైన రావు శ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు 1932లో జస్టిస్ పార్టీ నుంచి మద్రాస్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎన్నికై 1937వరకు మద్రాస్ ప్రెసిడెన్సీకి ముఖ్యమంత్రిగా పనిచేశారు. 
ఈయన కుమారుడైన ఎస్.ఆర్.కె.రంగారావు కూడా 1967లో శాసనసభకు ఎన్నికయ్యారు. ఈయన పెద్ద కుమారుడే సుజయ కృష్ణ రంగారావు.. నేడు రాష్ట్ర భూగర్భ గనుల శాఖా మంత్రిగా పనిచేస్తున్నారు. ఈయనకు ఇద్దరు సోదరులుండగా, చిన్న సోదరుడు బేబీనాయన కూడా రాజకీయాల్లోనే కొనసాగుతూ, అన్నకు అండగా ఉంటున్నారు. ఈయన గతంలో బొబ్బిలి మున్సిపల్ ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి విజయనగరం ఎంపీగా అశోక్ గజపతిరాజుపై పోటీ చేసి ఓటమి చెందారు. ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా పనిచేస్తున్న రంగారావు బొబ్బిలి నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై.. ఈ ప్రాంతంలో మకుటం లేని మహరాజుగా చెలామణి అవుతున్నారు.
జిల్లాలో కురుపాం, మేరంగి జమీందార్లు కూడా నేడు ప్రత్యక్ష రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. వివిధ పదవులను అనుభవిస్తూ ఈ ప్రాంతంలో తమ ఆధిపత్యాన్ని చాటుకుంటున్నారు. కురుపాం సంస్థాన జమిందారైన వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ సుమారు 42 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేసి వివిధ పదవులను అనుభవించారు. తాజాగా టీడీపీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో కేంద్రమంత్రిగా, వివిధ పార్లమెంటరీ కమిటీలో సభ్యుడుగా, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా పనిచేసిన అనుభవం ఉంది. కిశోర్ చంద్రదేవ్ తాతగారైన వైరిచర్ల వీరభద్రరాజు ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్, మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యులుగా పనిచేశారు. నాటి ఒడిశా రాష్ట్రంలో మూలాలు ఉన్న వైరిచర్ల కుటుంబీకులు.. కురుపాం కేంద్రంగా గిరిజన ప్రాంతంలో జమిందార్లుగా పాలన సాగించారు. 
ఇక మేరంగి ప్రాంత జమిందార్లుగా పిలిచే శత్రుచర్ల కుటుంబీకులకు ఈ ప్రాంతంలో తిరుగులేదు. నాటి జమిందారీ వ్యవస్థ నుంచి నేటి ప్రజాస్వామ్య పాలన వరకు శత్రుచర్ల వంశానికి ప్రత్యేక స్థానం ఉంది. శత్రుచర్ల విజయరామరాజు ప్రత్యక్ష రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో విజయరామరాజు ఎన్నో పదవులను చేపట్టి, ఈ ప్రాంతంలో తిరుగులేని నాయకుడిగా చలామణి అవుతున్నారు. ప్రస్తుతం టీడీపీలో ఎమ్మెల్సీగా ఉన్న ఈయనకు ఈ ప్రాంతంలో మంచి పట్టు ఉంది. ఈయన సోదరుడు శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు కూడా గతంలో ఎమ్మెల్యేగా పని చేయగా, ప్రస్తుతం ఈయన కోడలు పాముల పుష్ప శ్రీవాణి కురుపాం ఎమ్మెల్యేగా ఉన్నారు. తరతరాలుగా విజయనగరం జిల్లా అంతా రాజులు, జమిందార్ల పాలనలోనే నడుస్తోంది.
నాటి రాచరిక వ్యవస్థ నుంచి నేటి రాజకీయ వ్యవస్థ వరకు జిల్లాను పలువురు రాజవంశీకులు, జమిందార్లు పాలిస్తూ ఉండటంతో ఈ ప్రాంతంలో వారికి ఎదురొడ్డి నిలిచినవారు చాలా తక్కువ మందే ఉన్నారు. ముఖ్యంగా బీసీ సామాజిక వర్గాల నుంచి రాజులు, జమిందార్లపై పోటీ చేసి గెలిపొందిన సందర్భాలు చాలా తక్కువ. విజయనగరం శాసన సభా నియోజకవర్గంలో 1978 నుంచి 2014 వరకు అశోక్ గజపతిరాజుకు ఎదురులేకుండా పోయింది. అయితే, 2004 ఎన్నికల్లో మాత్రం ఆయన ఓటమి చవిచూశారు. ప్రస్తుత వైసీపీ నేత, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి ఆ ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేసి విజయనగరం రాజుగారిపై విజయం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించారు. బొబ్బిలిలో 2004 ఎన్నికల్లో బొబ్బిలి రాజ వంశీకుడు సుజయ కృష్ణ రంగారావు తొలిసారి పోటీ చేసి విజయం సాధించారు. ఇక అప్పట్నంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వచ్చారు. అంతకు ముందు ఎమ్మెల్యేలుగా పనిచేసిన బీసీ నేతలు.. రాజుల హవాతో కనుమరుగయ్యే పరిస్థితిలు తలెత్తాయి. 
అలాగే, కురుపాం, మేరంగి జమిందార్ల హవా కూడా ఇప్పటికీ కొనసాగుతోంది. 2009 పునర్విభజనలో అప్పటి వరకు ఉన్న నాగూరు నియోజకవర్గం రద్దై, కొత్తగా కురుపాం ఏర్పాటైంది. 1967 నుంచి శత్రుచర్ల కుటుంబీకులే నాగూరు నుంచి పలుమార్లు ఎన్నికయ్యారు. 1967 నుంచి జరిగిన ఎన్నికల్లో శత్రుచర్ల విజయరామరాజు నాగూరు, పార్వతీపురం, పాతపట్నం స్థానాల నుంచి ఆరుసార్లు శాసన సభకు, పార్వతీపురం ఎంపీ స్థానం నుంచి మూడుసార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. 2004లో వైఎస్ కేబినెట్‌లో, ఆ తర్వాత రోశయ్య, కిరణ్ కుమార్ మంత్రివర్గంలోనూ పనిచేశారు. పునర్విభజనలో రద్దయిన పార్వతీపురం లోక్ సభ, అరకు ఎంపీ స్థానాల నుంచి కురుపాం జమిందారైన వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ నాలుగు సార్లు ఎన్నికయ్యారు. చరణ్ సింగ్, మన్మోహన్ సింగ్ కేబినెట్‌లో కిశోర్ చంద్రదేవ్ పనిచేశారు. 
వాస్తవానికి జిల్లాలోని సంస్థానాల గత చరిత్ర తిరగేస్తే.. ఎన్నో వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. ముఖ్యంగా ప్రజాస్వామ్య వ్యవస్థకు ముందు ఉన్న ఈ సంస్థానాలన్నీ నిరంతరం గొడవలు పడుతూనే ఉండేవి. ఒక సంస్థానం అంటే మరో సంస్థానానికి పడేది కాదు. విజయనగరం, బొబ్బిలి సంస్థానాలకూ, కురుపాం, మేరంగి సంస్థానాలకూ మధ్య నిత్యం గొడవలు ఉండేవి. ఇతర చిన్న చిన్న సంస్థానాల పరిస్థితీ అంతే. నాటి రాచరిక వ్యవస్థ నుంచి నేటి రాజకీయ వ్యవస్థ వరకు ఈ సంస్థానాలన్నింటిదీ ఇదే పరిస్థితి. 2014 ఎన్నికల తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు జిల్లా రాజకీయ ముఖచిత్రంపై కొత్తకొత్త ఆవిష్కరణలకు నాంది పలికాయి. సమైక్యాంధ్రా ఉద్యమ దెబ్బతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తుడిచి పెట్టుకుపోవడం, ఒకే పార్టీలో ఉన్న నేతల మధ్య పెరిగిన వైరం వెరసి.. ఒక్కో రాజ కుటుంబం క్రమంగా సైకిల్ ఎక్కడం మొదలెట్టాయి. 
2014 ఎన్నికల వరకు కూడా విజయనగరం, బొబ్బిలి సంస్థానాదీశుల మధ్య రాజకీయ వైరం కొనసాగేది.  బొబ్బిలి రాజు, రాష్ట్ర భూగర్భ గనుల శాఖా మంత్రి సుజయ కృష్ణ రంగారావు కుటుంబం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండేది. కాంగ్రెస్ నుంచి ఈయన రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే, 2014 ఎన్నికలకు ముందు ఈయన వైసీపీలో చేరి, ఆ పార్టీ గుర్తుపై గెలుపొందారు. తర్వాత వైసీపీ సీనియర్ నేత బొత్స కుటుంబంతో రాజకీయ వైరం కారణంగా ఆ పార్టీని వీడి టీడీపీలో చేరిపోయిపోయారు. నాడు బొబ్బిలి రాజులు టీడీపీలో చేరడం ఒక సంచలనంగానే చెప్పాలి. నాటి రాచరిక వ్యవస్థ నుంచి నేటి రాజకీయ వ్యవస్థ వరకు సుదీర్ఘకాలం పాటు వైరం నడిచిన ఈ రెండు సంస్థానాలను టీడీపీ ఒక్కటి చేయడం నిజంగా ఓ చరిత్ర. అంతకంటే ఓ సాహసమనే చెప్పాలి. బొబ్బిలి రాజులు టీడీపీలో చేరే ముందు మర్యాద పూర్వకంగా విజయనగరం సంస్థానాదీశులు అశోక్ గజపతిరాజును కలవడం ఒక చారిత్రక ఘట్టంగా చెప్పుకున్నారు. తరతరాల వీరి వైరం.. సైకిల్ సవారీతో సమసిపోయినట్లయింది. భోగాపురం ఎయిర్ పోర్టు శంకుస్థాపన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఈ రెండు సంస్థానాల మధ్య నాటి వైరాన్ని ప్రస్తావిస్తూ.. అటువంటి రాజులను  ఏకం చేసిన ఘనత టీడీపీదేనని సగర్వంగా ప్రకటించుకున్నారు. 
మరో ముఖ్యమైన చినమేరంగి సంస్థానం రాజులకు కూడా జిల్లాలో మంచి రాజకీయ నేపథ్యం ఉంది. ఈ సంస్థానానికి చెందిన శత్రుచర్ల కుటుంబం కూడా మొదట్నుంచీ కాంగ్రెస్‌లోనే ఉంది. ముఖ్యంగా శత్రుచర్ల విజయరామరాజు కాంగ్రెస్ పార్టీలో పలు పదవులను అనుభవించారు. మూడుసార్లు ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈయన.. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవులను చేపట్టారు. అయితే, 2014 ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీంతో చేసేది లేక చివరికి ఈయన కూడా టీడీపీలో చేరిపోయారు. ప్రస్తుతం ఆ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పాటు పనిచేసిన ఈ మేరంగి జమిందారు చివరికి సైకిలెక్కి.. అశోక్ గజపతిరాజుతో చేతులు కలిపారు. 
తాజాగా మరో సంస్థానాదీశుడు కురుపాం జమిందారు కూడా అశోక్ గజపతిరాజుతో చేతులు కలిపి తెలుగుదేశం జెండా కిందకు చేరారు. కురుపాం సంస్థాన జమిందారైన వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ సుమారు 42 ఏళ్ల పాటు కాంగ్రెస్‌లో పనిచేసి, వివిధ పదవులను అనుభవించారు. కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ కూడా అయిన కిషోర్‌.. సైకిలెక్కి ఇటు విజయనగరం రాజు అశోక్ గజపతిరాజుతోనూ, అటు తన దీర్ఘకాలిక రాజకీయ శత్రువైన శత్రుచర్ల విజయరామరాజుతోనూ చేతులు కలిపారు. కరుడుగట్టిన కాంగ్రెస్ వాదైన కిశోర్ చంద్రదేవ్ కూడా ఇలా పార్టీ మారి సైకిలెక్కడం రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి తెరతీసినట్లయింది. సమైకాంధ్రా ఉద్యమం ఫలితంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తన ఉనికి కోల్పోవడంతో చేసేది లేక కాకలు తీరిన నేతలు సైతం ఇప్పుడు సైకిలెక్కడం సరికొత్త రాజకీయానికి తెరలేచినట్లయింది. రాజుల జిల్లా అయిన విజయనగరం.. ఇప్పుడు టీడీపీ ఖిల్లాగా మారిపోయిందనే చర్చ జరుగుతోంది.