జాతీయ స్థాయి పదవుల కోసం తెలంగాణ బీజేపీ సీనియర్ల లాబీయింగ్

  • Edited By: naveen , September 2, 2020 / 01:00 PM IST
జాతీయ స్థాయి పదవుల కోసం తెలంగాణ బీజేపీ సీనియర్ల లాబీయింగ్

బీజేపీ ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉంది. దీంతో జాతీయ స్థాయి పదవుల కోసం రాష్ట్రంలోని సీనియర్ నేతలు లాబీయింగ్ మొదలు పెట్టారు అంట. రాష్ట్ర కమిటీ నియామకాలు పూర్తయిపోయాయి. ఇక్కడ పదవులు దక్కిన వారు… అక్కడ ట్రై చేసుకుంటున్నారు. ఢిల్లీ స్థాయిలో పార్టీ పదవులు దక్కితే జాతీయ నేతల దృష్టి పడవచ్చని తద్వారా భవిష్యత్ బాగుంటుందని సన్నిహితుల వద్ద చెప్పుకుంటున్నారని టాక్‌. అందుకే ఇప్పుడు బీజేపీలోని రాష్ట్ర సీనియర్లు అంతా ఢిల్లీకే ప్రాధాన్యం ఇస్తున్నారని అంటున్నారు. అంతేకాకుండా ఆ పార్టీ ఈ పార్టీ అంటూ తేడా లేకుండా అన్ని పార్టీల నుంచి వచ్చిన నేతలు జాతీయ పార్టీలో పని చేయడానికే ఉవ్విళ్లూతున్నారు. ముందు నుంచి పార్టీలో పని చేసిన వారికంటే కొత్తగా వచ్చిన నేతలతో పోటీ ఎక్కువ ఉంది అంట.
https://10tv.in/kapilavayi-dileep-kumar-back-to-field/
ఆశావహుల్లో లక్ష్మణ్, మురళీధర్ రావు:
ఆశావహులు ఎక్కువ కావడంతో లిస్ట్ చాంతాడంత అయ్యిందని చెప్పుకుంటున్నారు. బీజేపీ తాజా మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్.. జాతీయ స్థాయిలో ప్రధాన కార్యదర్శి లేదా ఆఫీస్ బేరర్ పోస్ట్ ఆశిస్తుండగా.. మురళీధర్‌రావు తన పదవి రెన్యూవల్ అవుతుందని ఆశాభావంతో ఉన్నారు. ఒకవేళ ఆయనకు జాతీయ కమిటీలో చోటు దక్కపోతే తొందరలోనే రాజ్యసభలో చోటు దక్కుతుందని బీజేపీ నేతల్లో ప్రచారం సాగుతోంది. గతంలో సైతం రాష్ట్ర నుంచి మురళీధర్‌రావు ఒక్కరికే జాతీయ కమిటీలో చోటు దక్కింది.

పదవుల కోసం డీకే అరుణ, వివేక్, మోత్కుపల్లి ప్రయత్నాలు:
ఇటీవల బీజేపీలో చేరిన డీకే అరుణ, మాజీ ఎంపీలు వివేక్, జితేందర్‌రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు జాతీయ కమిటీలో చోటు కోసం తమ తమ ప్రయత్నాలు సాగిస్తున్నారనే ప్రచారం బీజేపీ శ్రేణుల్లో సాగుతోంది. పార్టీలో సీనియర్ నేతలు నేరుగా డిల్లీ నేతలతో లాబీయింగ్ చేస్తున్నారని టాక్‌. మరికొంత మంది తమ గాడ్‌ఫాదర్స్ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. తమను పార్టీలోకి తీసుకున్న వారు సైతం ఇప్పుడు పదవులు కోల్పోయి తమతో పాటు పదవి కోసం పోటీ పడుతుడంతో ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని స్థితిలో మరికొందరు ఉన్నారు.

తెలంగాణ నుంచి చాన్స్ ఎవరికి?
రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సైతం ఆశావహుల లిస్ట్ డిల్లీకి పంపినట్లు సమాచారం. జాతీయ కమిటీలో రాష్ట్రం నుంచి కేవలం మురళీధర్ రావు ఒక్కరే ప్రధాన కార్యదర్శిగా ఉన్నారే తప్ప ఇతర ఆఫీస్ బేరర్ పదవుల్లో ఎవరికీ చాన్స్‌ దక్కలేదు. ఆశావహుల జాబితా పెద్దగా ఉన్న నేపథ్యంలో ఎంత మందికి చోటు దక్కుతుందోనని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. జాతీయ కమిటీలో చోటు అంటే అన్ని రాష్ట్రాల నుంచి పోటీ ఉంటుంది. మరి తెలంగాణ నుంచి ఎవరికి దక్కుతుందో చాన్స్‌.