Telangana Leaders: ఢిల్లీకి క్యూ కట్టిన తెలంగాణ నేతలు.. హస్తిన పరిణామాలపై తెలంగాణ పాలిటిక్స్ లో ఉత్కంఠ

తెలంగాణ రాజకీయం అంతా ఢిల్లీ చుట్టూనే తిరుగుతోంది. మరో ఐదు నెలల్లో ఎన్నికలు జరగనుండటంతో... జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ రాజకీయం అంతా ఢిల్లీకే షిఫ్ట్ అయింది.

Telangana Leaders: ఢిల్లీకి క్యూ కట్టిన తెలంగాణ నేతలు.. హస్తిన పరిణామాలపై తెలంగాణ పాలిటిక్స్ లో ఉత్కంఠ

Telangana Congress Leaders

Telangana Leaders in Delhi: తెలంగాణ పాలిటిక్స్ దేశ రాజధాని ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ ముఖ్య నేతలంతా హస్తిన బాట పడుతున్నారు. హస్తం పార్టీలో చేరేందుకు సిద్ధమైన ఖమ్మం(Khammam) మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy), మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) అనుచరులను వెంటబెట్టుకుని ఢిల్లీకి రాగా… బీజేపీ ముఖ్య నేతలు ఈటల రాజేందర్ (Etala Rajender), కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (Komatireddy Raj Gopal Reddy) తమ పార్టీ హైకమాండ్‌తో చర్చల కోసం రెండు రోజుల నుంచి ఢిల్లీలోనే ఉన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) తెలంగాణ పర్యటనకు వచ్చినా ఆ ఇద్దరు నేతలు ఢిల్లీలోనే ఉండిపోవడంతో ఏం జరుగుతుందా? అనే ఉత్కంఠ పెరిగిపోతోంది.

దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ రాజకీయం హీట్‌ పుట్టిస్తోంది. చేరికల కోసం కాంగ్రెస్.. అంతర్గత చికిత్సపై బీజేపీ దృష్టిపెట్టడంతో ముఖ్య నేతలంతా హస్తిన బాట పట్టారు. బీజేపీ ముఖ్య నేతలు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రెండు రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు. అధిష్టానంపై అలకతో ఉన్న ఈ ఇద్దరు ముఖ్య నేతలు కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నారనే వార్తలు కాషాయ పార్టీలో కలకలం సృష్టించాయి. మరో ఐదు నెలల్లో ఎన్నికలు జరగనుండగా, కాంగ్రెస్ స్పీడ్ పెంచేయడంతో కమలం పార్టీ కూడా రాష్ట్ర పార్టీ వ్యవహారాలపై ఫోకస్ పెట్టింది. కర్ణాటక ఎన్నికల అనంతరం రాష్ట్రంలో పార్టీ కాస్త స్లో అయ్యిందనే అభిప్రాయం పెరిగిపోతోంది.

క్యాడర్‌లో ఈ విషయంపై గందరగోళాన్ని తొలగించాలని ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు. వీరి సూచనలపై చర్చించేందుకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని ఆఘమేఘాల మీద ఢిల్లీకి పిలిపించింది కమలం పార్టీ అగ్రనాయకత్వం. శనివారం ఢిల్లీకి వచ్చిన కిషన్‌రెడ్డి ఆదివారం మళ్లీ రాష్ట్రానికి వచ్చేసినా.. ఈటల, కోమటిరెడ్డి మాత్రం ఢిల్లీలోనే ఉండిపోయారు. దీంతో హస్తినలో ఏం జరుగుతోందనే విషయమై ఆసక్తి నెలకొంది.

Also Read: జేపీ నడ్డా ధరణి పోర్టల్ రద్దు చేస్తామన్నారు.. బండి సంజయ్ చేయబోమన్నారు

మరోవైపు కాంగ్రెస్‌లో హుషారు కనిపిస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నాయకుడు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. భవిష్యత్ కార్యచరణపై చర్చించేందుకు పార్టీ అగ్రనేత రాహుల్‌ను కలిసేందుకు ఈ ఇద్దరు నేతలు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో కలిసి ఢిల్లీకి వచ్చారు. వాస్తవానికి 25వ తేదీ ఆదివారమే ఈ ఇద్దరు రాహుల్‌తో భేటీ కావాల్సివుంది. కానీ, రాహుల్ అపాయింట్‌మెంట్ లభించకపోవడంతో సోమవారానికి వాయిదా పడింది. సోమవారం ఉదయం పొంగులేటి జూపల్లితోపాటు ముఖ్య నేతలు అంతా రాహుల్‌తో సమావేశమై.. చేరిక తేదీ ఖరారు చేయనున్నారు.

వచ్చే నెల మొదటి వారంలో పొంగులేటి, జూపల్లి చేరిక ఉంటుందని కాంగ్రెస్ వర్గాల సమాచారం. సీఎల్పీ నాయకుడు మల్లు భట్టివిక్రమార్క చేపడతున్న పీపుల్స్ మార్చ్ పాదయాత్ర వచ్చేనెలలో ముగియనుంది. ఖమ్మంలో భట్టి పాదయాత్ర ముగింపు కార్యక్రమం నిర్వహించి ఆ సమయంలోనే పొంగులేటి, జూపల్లి అధికారికంగా చేరేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సభకు అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీలను ఆహ్వానించనున్నారు. ఇప్పుడు పొంగులేటి, జూపల్లి ఢిల్లీ వెళ్లడానికి కూడా ఇదే కారణమని చెబుతున్నారు.

Also Read: సొంత పార్టీ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిపై ఎమ్మెల్యే జోగురామన్న ఫైర్.. ఇలాచేస్తే బాగుండదని వార్నింగ్

ఇలా రెండు పార్టీల నేతలు ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. కర్ణాటక విజయంతో జోష్‌పై ఉన్న కాంగ్రెస్ తెలంగాణలో కొత్తగా చేరికలపై దృష్టి పెట్టింది. పొంగులేటి, జూపల్లిని చేరిక ఖాయమవడంతో.. వారి మార్గంలోనే మరికొందరు పార్టీలోకి వస్తారని ప్రచారం చేస్తోంది. ఇది అధికార బీఆర్‌ఎస్‌తోపాటు బీజేపీని గందరగోళానికి గురిచేస్తోంది. ఇప్పటికే బీఆర్‌ఎస్ నేత శ్రీధర్‌రావు కాంగ్రెస్‌లో చేరగా, సిట్టింగ్ ఎమ్మెల్సీ దామోదరరెడ్డి కూడా చేతిని అందుకుంటారని చెబుతున్నారు. ఈటల, రాజగోపాల్‌తో కూడా చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. అయితే కాంగ్రెస్ స్పీడ్‌కు బ్రేక్ వేసేందుకు బీజేపీ కూడా భారీ ప్లాన్ రచిస్తోంది.

Also Read: తెలంగాణలో లులు గ్రూప్ రూ.3,500 కోట్ల పెట్టుబడులు

మరోవైపు బీఆర్‌ఎస్ కూడా ఎన్నికల వ్యూహంలో భాగంగా ఢిల్లీ యాత్రలకు శ్రీకారం చుడుతోంది. రాష్ట్ర మంత్రి కేటీఆర్ సుదీర్ఘ కాలం తర్వాత ఢిల్లీ వచ్చి కేంద్ర నిధుల కోసం వినతిపత్రాలు ఇచ్చివెళ్లారు. ఇలా కేటీఆర్ ఢిల్లీకి రావడం వెనుక రాజకీయం ఉందని ప్రచారం జరుగుతోంది. ఎన్నికల సమయంలో బీజేపీని ఇరుక పెట్టేందుకు వ్యూహాత్మకంగా ఢిల్లీ టూర్ వేశారని అంటున్నారు.

Also Read: తామే ప్రత్యామ్నాయం అని కాంగ్రెస్ అనుకుంటే కాదు.. ప్రజలు అనుకోవాలి

మొత్తానికి తెలంగాణ రాజకీయం అంతా ఢిల్లీ చుట్టూనే తిరుగుతోంది. మరో ఐదు నెలల్లో ఎన్నికలు జరగనుండటంతో… జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ రాజకీయం అంతా ఢిల్లీకే షిఫ్ట్ అయింది. బీఆర్‌ఎస్ కూడా ఆ పార్టీలకు దీటుగా వ్యూహాలు రచిస్తుండటంతో తెలంగాణ పాలిటిక్స్ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.