ఆ సీటే కావాలి : టి.కాంగ్రెస్‌లో ఆ ఎంపీ సీటు హాట్ కేక్

  • Published By: madhu ,Published On : February 9, 2019 / 01:47 PM IST
ఆ సీటే కావాలి : టి.కాంగ్రెస్‌లో ఆ ఎంపీ సీటు హాట్ కేక్

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడు అంద‌రి చూపు ఆ ఎంపీ సీటు పైనే…. లోకల్‌.. నాన్‌లోకల్‌ అనే తేడా లేకుండా ఆ సీటు కోసం పోటీ పడుతున్నారు. ఆ ఎంపీ సీటు కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఇంతకీ ఎందుకు అందరూ ఆ ఎంపీ సీటుపైనే ఆశలు పెట్టుకున్నారు. అంతగా కాంగ్రెస్‌ నేతలను అట్రాక్ట్‌ చేస్తున్న ఆ పార్లమెంట్‌ నియోజకవర్గం ఏది?
తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో పార్లమెంట్ ఎన్నిక‌ల వేడి మొద‌లైంది. టికెట్లు దక్కించుకునేందుకు నియోజ‌క‌వ‌ర్గాల వారిగా నాయ‌కులు లాబియింగ్ షురూ చేశారు.  గ‌తంలో ఎంపీలుగా ప‌ని చేసిన వారు.. ఓడిన వారు..తాజాగా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యం పొందిన వారు..పార్లమెంట్ ఎన్నిక‌ల్లో పోటీచేసి త‌మ అదృష్టాన్ని ప‌రిక్షించుకునేందుకు తహ‌త‌హ లాడుతున్నారు. మెజారిటీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు టికెట్ డిమాండ్ భారీగా ఉన్నప్పటికీ.. తెలంగాణ‌లో ఆ ఒక్క ఎంపీ టికెట్‌కు మాత్రం కాంగ్రెస్‌లో భారీ డిమాండ్ ఉంది.

* హాట్‌ కేక్‌గా ఖమ్మం పార్లమెంట్‌ సీటు
* ఖమ్మం సీటు సేఫ్‌ ప్లేస్‌ అంటున్న నేతలు 
* మధిర, కొత్తగూడెం, పాలేరు సీట్లు గెలిచిన కాంగ్రెస్ 
* సత్తుపల్లి, అశ్వారావు పేటలో గెలిచిన టీడీపీ 
* ఖమ్మం అసెంబ్లీకి మాత్రమే పరిమితమైన టీఆర్‌ఎస్ 

తెలంగాణ‌లో మొత్తం 17 లోక్ స‌భ సీట్లుండ‌గా.. ఖ‌మ్మం పార్లమెంట్ సీటు మాత్రం హ‌స్తం పార్టీలో హ‌ట్ కేక్‌లా మారింది. ఇప్పుడు పార్టీలో అంద‌రి చూపు ఖ‌మ్మం పార్లమెంట్ పైనే… ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రాజ‌కీయ ప‌రిస్థితుల్లో ఖ‌మ్మం సీటు ఒక్కటే సేఫ్ ప్లేస్ అని నేత‌లు భావిస్తున్నారట. అందుకే ఆ సీటుకు అంత‌లా డిమాండ్  పెరిగింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఖ‌మ్మం పార్లమెంట్ ప‌రిధిలో కాంగ్రెస్ మ‌ధిర .. కొత్తగూడెం .. పాలేరు సీట్లు గెల‌వ‌గా ..మిత్రప‌క్షంగా ఉన్న టీడీపీ స‌త్తుప‌ల్లి .. అశ్వారావు పేట అసెంబ్లీ సీట్లు గెలిచింది….. టీఆర్ఎస్ కేవ‌లం ఖ‌మ్మం అసెంబ్లీకి మాత్రమే పరిమితమైంది. దీనికితోడు.. కమ్మ సామాజిక వ‌ర్గం ఓట‌ర్లు.. టీడీపీ ప్రభావం ఎక్కువ‌గా ఉండ‌టంతో.. హ‌స్తం నేత‌లు సేఫ్ జోన్‌గా భావిస్తున్నారట. అందుకే ఎలాగోలా.. ఖ‌మ్మం ఎంపీ టికెట్ సాధిస్తేచాలు..విజ‌యానికి స‌గం చేరువ‌లో ఉన్నట్లే అని నేతలు నమ్ముతున్నారు. 

* తనకే టికెట్‌ ఇస్తారన్న భావనలో రేణుకా చౌదరి 
* సీటు గ్యారంటీ అన్న ధీమాలో పొంగులేటి 
* ఖమ్మం టికెట్‌ పై ఆశలు పెట్టుకున్న వీహెచ్‌ 
* ఖమ్మం టికెట్‌ ఆశిస్తున్న గ్రానైట్‌ రవి 
* టికెట్‌ కోసం లాబీయింగ్‌ చేస్తున్న రవి 

గ‌తంలో ఎంపీగా, కేంద్ర మంత్రిగా ప‌నిచేసిన రేణుకా చౌద‌రి.. ఇప్పుడు మ‌ళ్ళీ టికెట్ ద‌క్కించుకునే ప్రయ‌త్నాల్లో ఉన్నారు. అంతేకాదు.. తన‌కే హైక‌మాండ్ టికెట్  ఇస్తుంద‌న్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే రేణుక నాన్ లోక‌ల్ అని.. సీటు త‌న‌కే ఇవ్వాలంటున్నారు పొంగులేటి సుధాక‌ర్ రెడ్డి. ఏళ్ల త‌ర‌బ‌డి ఈ సీటుపై ఆశ‌లు పెట్టుకున్న పొంగులేటి.. ఈసారి సీటు గ్యారంటి అన్న ధీమాలో ఉన్నారు. ఇదిలావుంటే.. ఇదే సీటుపై మ‌న‌సు పారేసుకున్నారు ఏఐసీసీ కార్యద‌ర్శి వి హ‌నుమంత్‌రావు. గాంధీ ఫ్యామిలికి న‌మ్మిన బంటున‌ని.. త‌నకు టికెట్ ఇస్తే.. త‌ప్పక గెలిచి.. రాహుల్ గాంధీకి కానుక‌గా ఇస్తానంటున్నారు వీహెచ్. ఇక మ‌రోనేత గ్రానైట్ ర‌వి ఖ‌మ్మం సీటుపై ఆశ‌లు పెట్టుకున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వ‌రంగ‌ల్ ఈస్ట్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిన రవిచంద్ర లోక‌ల్ కోటాలో.. టికెట్ కోసం లాబియింగ్ చేస్తున్నారు. 

ఇక వీరంతా ఒక ఎత్తైతే ఈ రేసులో కొత్తగా మాజీ ఎంపీ విజయశాంతి పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలకు ప్రచార బాధ్యతలను భుజానికెత్తుకున్న రాములమ్మ.. ఈ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారట. అందుకు ఖమ్మం లోక్‌సభ సీటు అయితే మంచిదన్న భావనలో రాములమ్మ ఉందట. ఖ‌మ్మం లోక్‌సభ సీటుపై కాంగ్రెస్‌ నేత‌లు భారీగానే ఆశ‌లు పెట్టుకున్నారు. ఎలాగైనా సీటు ద‌క్కించుకునేందుకు ఎవ‌రికి వారు లాబింగ్ ను ముమ్మరం చేసుకుంటున్నారు. ఈ పోటీలో సీనియ‌ర్ , జూనియ‌ర్.. లోకల్-  నాన్ లోక‌ల్.. అన్న తేడా లేకుండా.. ఉద్దండులు సైతం పోటీకి సై అంటున్నారు. దీంతో సీటు ఎవ‌రికి ద‌క్కుతుంద‌న్న ఉత్కంఠ నెల‌కొంది. మ‌రి ఖమ్మం సీటును అధిష్టానం ఎవరికి కట్టబెడుతుందో చూడాలి.