నిప్పులు కక్కుతున్న టీఆర్ఎస్ విప్పులు!

  • Published By: sreehari ,Published On : January 2, 2020 / 12:03 PM IST
నిప్పులు కక్కుతున్న టీఆర్ఎస్ విప్పులు!

ఏడాది క్రితం రెండోసారి అధికార పగ్గాలు దక్కించుకున్న టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం శాసనసభ, శాసనమండలిలో నేతల సమన్వయం కోసం చీఫ్ విప్, విప్‌లను నియమించింది. ఇది ప్రతి ప్రభుత్వంలో జరిగే తంతే కదా అంటారా? ఇప్పుడు చెప్పడానికి కొన్ని కారణాలున్నాయి.

ఉభయ సభల్లో ఓ చీఫ్ విప్‌తో పాటు పలువురు నేతలకు విప్‌లుగా అవకాశం దక్కింది. పదవులు దక్కిన వారిలో మెజారిటీ నేతలు ఈ పదవి కేవలం ప్రొటోకాల్‌కే పరిమితం అవుతోందని ఆవేదన చెందుతున్నారట. అసెంబ్లీ ఆవరణలో కార్యాలయాలు కేటాయించినా వాటికి పెద్దగా రావడం లేదు. కార్యాలయాలను ప్రారంభించి మమ అనిపించారు కొందరు.

మంత్రి పదవి దక్కలేదని :
చీఫ్ విప్ పదవి దక్కిన దాస్యం వినయ్ భాస్కర్ తనకు రెండో విడత ప్రభుత్వంలో మంత్రి పదవి ఖాయం అనుకున్నారట. సామాజిక సమీకరణలు కూడా కలసి వస్తాయన్న లెక్కలేసేసుకున్నారు. ఉద్యమ సమయం నుంచి పార్టీలో ఉండడమే తనకు ప్రధానంగా కలసివచ్చే అంశమని భావించారు. కానీ, ఆశించిన పదవి దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారని పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. దీంతో నియోజకవర్గానికే పరిమితం అవుతున్నారని అంటున్నారు. గంప గోవర్ధన్, గొంగిడి సునీతలు కూడా ఈసారి మంత్రివర్గంలో స్థానంపై భారీగా ఆశలు పెట్టుకున్నా లాభం లేకపోయింది. ఎలాంటి ప్రమోషన్ లేకుండా మరోసారి విప్‌లతోనే సరిపెట్టుకోవలసి వచ్చింది.

విప్‌లతో సరిపెట్టుకోవాలా? :
ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించినా పార్టీ గుర్తించడం లేదని గంప గోవర్ధన్ తెగ ఫీలైపోతున్నారట. దీంతో పార్టీ కార్యక్రమాలకు కూడా అంటీ ముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. గ్రేటర్ పరిధిలో అవకాశం దక్కించుకున్న అరికెపూడి గాంధీ సైతం తన సామాజికవర్గాన్ని దృష్టిలో ఉంచుకొని కేబినెట్‌లో బెర్త్ ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ను కోరినా ఫలితం దక్కలేదట. వీరిందరికీ కూడా విప్‌ పదవిపై పెద్దగా ఆసక్తి లేదట.

ఏదో ఇచ్చారు కాబట్టి ఉంటున్నామని, చెబుతున్నారట. అసలు మంత్రి పదవులు దక్కుతాయనుకుంటే ఈ విప్‌లతో సరిపెట్టడం ఏంటని అనుచరుల దగ్గర గగ్గోలు పెడుతున్నారని అంటున్నారు. శాసనమండలిలో కూడా ఒక్కరిద్దరు మంత్రి పదవులపై ఆశలు పెంచుకున్నారట. కానీ విప్‌ పదవి రావడంతో ఏదో ఒకటి దక్కిందిలే అనుకొంటూ సైలెంట్ అయ్యారని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.