Telangana : కాంగ్రెస్‌లో భారీ చేరికల ప్లాన్.. ఇంతకీ చేరుతున్నది ఎవరెవరు? ముహూర్తం ఎప్పుడు?

అనూహ్యంగా పుంజుకుని ప్రధాన పోటీదారుగా అవతరించిన హస్తం పార్టీలో చేరేందుకు సీనియర్ నేతలు ఆసక్తి చూపుతున్నారు... Telangana Congress

Telangana : కాంగ్రెస్‌లో భారీ చేరికల ప్లాన్.. ఇంతకీ చేరుతున్నది ఎవరెవరు? ముహూర్తం ఎప్పుడు?

Telangana Congress (Photo : Google)

Telangana Congress : రండి బాబూ రండి, వెంటనే వచ్చి మీ సీటు రిజర్వ్ చేసుకోండి.. అంటూ ఇతర పార్టీల్లోని నేతలకు వల విసురుతోంది కాంగ్రెస్. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించడం, మరోవైపు బీజేపీ కసరత్తు చేస్తుండటంతో.. రెండు పార్టీల నేతలపై ఫోకస్ పెట్టారు హస్తం నేతలు. వచ్చే ఎన్నికల్లో గెలవడం తధ్యం అనే ప్రకటన చేస్తూ బీఆర్ఎస్, బీజేపీలో అసమ్మతులకు, అసంతృప్తులకు గాలం వేస్తోంది. ఇప్పటికే చాలామందిని గ్రిప్ లోకి తెచ్చుకున్న కాంగ్రెస్.. రాష్ట్ర రాజకీయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా భారీ చేరికల కార్యక్రమానికి ముహూర్తం ఫిక్స్ చేసింది. ఇంతకీ కాంగ్రెస్ లో చేరుతున్నది ఎవరు? ముహూర్తం ఎప్పుడు?

ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ జోరు పెంచుతోంది. కొత్త నేతల చేరికపై వేగంగా పావులు కదుపుతోంది. ఈ నెల 16న హైదరాబాద్ లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు జరగనున్నందున చేరికలన్నీ ఒకేసారి చేపట్టి ఎన్నికల ముఖచిత్రాన్నే మార్చేయాలని ప్లాన్ చేస్తోంది హస్తం పార్టీ. అగ్రనేత సోనియా గాంధీ హైదరాబాద్ వస్తున్నారు. 17న భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్న కాంగ్రెస్.. సోనియాతో పాటు ప్రముఖ నాయకులందరి సమక్షంలో బీఆర్ఎస్, బీజేపీలో ఉన్న ఎమ్మెల్యేలు, మాజీమంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునేలా అడుగులు వేస్తోంది.

కొంతకాలంగా కాంగ్రెస్ నూతనోత్సాహంతో పని చేస్తోంది. అనూహ్యంగా పుంజుకుని ప్రధాన పోటీదారుగా అవతరించిన హస్తం పార్టీలో చేరేందుకు సీనియర్ నేతలు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్ లో టికెట్లు దక్కని నేతలు తీవ్ర అసంతృప్తితో కాంగ్రెస్ పంచన చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇలా బీఆర్ఎస్ బలైమైన నేతలే టచ్ లోకి రావడంతో వారితో సంప్రదింపులు జరిపిన పార్టీ సోనియా సమక్షంలో పార్టీలో చేరేలా స్కెచ్ వేస్తోంది.

Also Read..Azharuddin: జూబ్లీహిల్స్ టిక్కెట్ కోసం అజరుద్దీన్‌ గట్టి ప్రయత్నాలు.. విష్ణు పరిస్థితి ఏంటి?

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరే వారిలో సిట్టింగ్ ఎమ్మెల్యేలలో మైనంపల్లి హన్మంతరావు, రేఖా నాయక్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మల్కాజ్ గిరి బీఆర్ఎస్ సీటు దక్కించుకున్న హన్మంతరావు మంత్రి హరీశ్ రావుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో గులాబీ పార్టీ నుంచి బయటకు రావాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారు. ఇక ఖానాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ ను తప్పించి ఆమె స్థానంలో మరొకరికి టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్. దాంతో రేఖా నాయక్ భర్త శ్యామ్ నాయక్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తన పదవీ కాలం పూర్తయ్యాకే కాంగ్రెస్ లో చేరతానని చెబుతున్న రేఖా నాయక్.. సోనియా గాంధీ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకునేలా ప్లాన్ చేస్తోంది కాంగ్రెస్.

ఈ ఇద్దరి రూట్ లోనే బీఆర్ఎస్ లో మరో ప్రముక అసంతృప్త నేత తుమ్మల నాగేశ్వరరావు కూడా సోనియా సమక్షంలోనే కాంగ్రెస్ లో చేరనున్నారు. పాలేరు బీఆర్ఎస్ టికెట్ దక్కపోవడంతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు తుమ్మల. ఇప్పటికే తుమ్మలతో కాంగ్రెస్ ముఖ్య నాయకులు సంప్రదింపులు జరిపారు. ఇక, నల్లగొండ జిల్లాకు చెందిన వేముల వీరేశం కూడా హస్తం కండువా కప్పుకోవడానికి రెడీ అవుతున్నట్లు చెబుతున్నారు.

మరోవైపు బీజేపీ నుంచి కూడా కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి కాంగ్రెస్ పంచన చేరనున్నట్లు తెలుస్తోంది. ఏనుగు రవీందర్ రెడ్డి ఇంకా బీజేపీలో ఉండగా, యెన్నం శ్రీనివాస్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేసింది బీజేపీ.

Also Read..YS Sharmila: షర్మిల కన్నా తుమ్మలనే బెస్ట్ అప్షన్.. తెలంగాణ కాంగ్రెస్ లో మారిపోతున్న సమీకరణాలు!

బీఆర్ఎస్, బీజేపీ సంబంధాలపై వ్యాఖ్యలు చేసిన యెన్నం.. కమలం పెద్దల ఆగ్రహానికి గురయ్యారు. ఈ విధంగా వ్యాఖ్యలు చేసిన జిట్టా బాలకృష్ణారెడ్డి సైతం బీజేపీకి దూరం అయ్యారు. ఈ ముగ్గురు నేతలతో కాంగ్రెస్ సంప్రదింపులు జరుపుతుండగా.. సోనియా సమక్షంలో చేరికకు రెడీ అయినట్లు చెబుతున్నారు.

మరోవైపు నిజామాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీమంత్రి మండవ వెంకటేశ్వరరావు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఉన్న మండవ.. కొన్నాళ్లుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇదే అదనుగా భావించిన కాంగ్రెస్ నాయకత్వం ఆయనుతోనూ చర్చించి ఈ నెల 17న కాంగ్రెస్ లో చేరేలా ప్లాన్ చేస్తోంది. మొత్తానికి ఈ నెల 17న రాష్ట్ర కాంగ్రెస్ కు కొత్త రూపు వచ్చేలా ప్రయత్నం చేస్తోంది హైకమాండ్.