జగన్ ఎవరిని కరుణిస్తారో, పదవిని ఆశిస్తున్న విశాఖ జిల్లా నేతలు

  • Published By: naveen ,Published On : September 24, 2020 / 04:55 PM IST
జగన్ ఎవరిని కరుణిస్తారో, పదవిని ఆశిస్తున్న విశాఖ జిల్లా నేతలు

అధికార పార్టీలో ఉన్న నేతలకు పదవులు దక్కించుకోవాలనే తాపత్రయం కామన్‌గానే ఉంటుంది. అందులోనూ మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా ఉన్న వారికి వాటి మీద మరింత ధ్యాస ఎక్కువగా ఉండడం కూడా సహజమే. అలాంటి వారి జాబితా విశాఖ జిల్లాలో చాంతాడంత ఉంది. పలువురు మాజీ మంత్రులు కూడా ఈ జాబితాలో ఉండటం విశేషం. ఒకరా ఇద్దరా.. మళ్ల విజయప్రసాద్, దాడి వీరభద్రరావు, తైనాల విజయ్‌కుమార్, తిప్పల గురుమూర్తిరెడ్డి, కుంభా రవిబాబు, పిన్ని౦టి వరలక్ష్మి, ద్రోణంరాజు శ్రీనివాస్, ఎస్ఎ రెహమాన్, మత్స్యరాస బాలరాజు, పసుపులేటి బాలరాజు, చింతలపూడి వెంకట రామయ్య, అల్లు భానుమతి, పంచకర్ల రమేశ్‌బాబు, మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణ రాజు ఉన్నారు.

పదవులు ఆశిస్తున్న వారు జిల్లాలో ఎక్కువే:
ఇప్పటి వరకూ చెప్పుకున్న లిస్టులోని నేతలందరికీ ఆయా నియోజకవర్గాల్లో బలగం ఉంది. సామాజికవర్గాల పరంగా కూడా బలమైన శక్తి ఉన్నవారే. ఎన్నికల్లో టికెట్లు ఆశించి భంగపడిన వారు చాలామంది కాగా, ఎన్నికల తర్వాత ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వారు కూడా కొందరున్నారు. ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడి పని చేశామని, పార్టీ అధికారంలోకి వచ్చినందున, ఏదో ఒక రోజు పదవి రాకపోతుందా అని ఎదురు చూస్తున్నారు వారంతా. మరికొందరు వలస వచ్చిన నేతలు ఇతర పార్టీల నుంచి వదులుకుని వచ్చినందున ఏదో ఒక పదవి ఇచ్చి గౌరవించకపోతారా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ, అధిష్టానం మాత్రం వీరిపై కరుణ చూపించడం లేదంట.

కుమారుడికి ఏదో ఒక పదవి ఇవ్వాలంటున్న దాడి:
మళ్ల విజయ్‌ప్రసాద్ కాంగ్రెస్ హయాంలో విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పని చేశారు. గత ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి ఓడిపోయారు. ఇప్పుడు ఏదో ఒక నామినేటెడ్ పోస్టు ఇవ్వకపోతారా ఎని ఎదురుచూస్తున్నారు. ఇక దాడి వీరభద్రరావు టీడీపీలో ఓ వెలుగు వెలిగారు. వైసీపీలోకి వచ్చి ఆ తర్వాత బయటకు వెళ్లి మళ్లీ తిరిగొచ్చారు. ఆయన కుమారుడు దాడి రత్నాకర్ 2014 ఎన్నికల్లో విశాఖ పశ్చిమం నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు.

ఈసారి ఎన్నికల్లో దాడి కుటుంబ అనకాపల్లి నుంచి, గుడివాడ అమర్నాథ్‌ విజయం కోసం పని చేసింది. తన కుమారుడు దాడి రత్నాకర్‌ను రాజకీయంగా కుదురుకోనివ్వాలని చూస్తున్నారు వీరభద్రరావు. తనకు ఏ పదవి వద్దు కానీ కుమారుడి గురించి అలోచించాలని అధిష్టానం పెద్దల వద్ద చెబుతున్నారని టాక్.

కూతురికి ఏదో ఒక పోస్టు ఇస్తారనే ఆశతో బాలరాజు:
ఇక డాక్టర్ కుంభా రవిబాబు ఏజెన్సీలోని గిరిజన ప్రాంతాల్లో మంచి పట్టున్న నాయకుడు. గత ఎన్నికల్లో అరకు టికెట్ అశించారు. అధిష్టానం ఏజన్సీలో వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం పని చేయాలని ఆదేశించింది. ఆయన కూడా ఏదైనా నామినేటెడ్ పదవి ఇవ్వకపోతారా అని చూస్తున్నారు. మాజీ మంత్రి పసుపులేటి బాలరాజుది ఒక కథ.

కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పని చేసిన ఆయన.. జనసేనలోకి వెళ్లి.. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో వైసీపీలోకి చేరారు. ఆయన కుమార్తెకు జడ్పీ చైర్మన్ పదవిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం కూడా సాగింది. కానీ ఆ ఎన్నికలు ఆగిపోవడంతో ప్రభుత్వం ఏదైనా నామినేటెడ్ పోస్టు ఇస్తుందనే ఆశతో ఎదురు చూస్తున్నారు.

యాదవ సామాజికవర్గానికి చెందిన నేతగా పదవి ఆశిస్తున్న వరలక్ష్మి:
విశాఖ ఉత్తరం మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్‌కుమార్ అంటే దివంగత వైఎస్సార్‌కు అత్యంత ఆప్తుడు. ఆ సాన్నిహిత్యంతోనే వైసీపీలో చేరారు. ఎన్నికల ముందు వరకు వైసీపీలో ఉన్న ఆయన సడన్‌గా టీడీపీలో చేరారు. టీడీపీ ఘోర పరాజయంతో జగన్ సీఎం కాగానే మళ్లీ వైసీపీలోకి వచ్చేశారు. పార్టీతో ఉన్న అనుబంధంతో ఏదైనా పదవి రాకపోతుందా అని ఎదురుచూస్తున్నారట.

టీడీపీ తరఫున అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న వరలక్షి ఆ తర్వాత వైసీపీలో చేరారు. నగరంలో బలమైన యాదవ సామాజికవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తనకు ఏదో ఒక మంచి పదవి ఇస్తారని ఆశిస్తున్నారు.

ప్రాధాన్యం కలిగిన పోస్టు ఇస్తారనే ఆశలో వెంకట్రామయ్య:
ఎస్ఏ రెహమాన్ కూడా గతంలో విశాఖ-1 నుంచి ఎమ్మెల్యేగా పని చేసిన వారే. టీడీపీ నుంచి ప్రజారాజ్యం, ఆ తర్వాత వైసీపీ, మళ్లీ టీడీపీ, మళ్లీ వైసీపీ… ఇదీ ఆయన ప్రయాణం. ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. మైనార్టీల్లో తనకు బలమున్నందున జగన్ కరుణించి పదవిస్తారని ఆశగా ఎదురుచూస్తున్నారట.

ఇటీవలే వైసీపీ తీర్థం పుచ్చుకున్న పంచకర్ల రమేశ్‌బాబు కూడా ఇదే వరసలో ఉన్నారు. చింతలపూడి వెంకట్రామయ్య గతంలో ప్రజారాజ్యం తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత జనసేనలో చేరిన ఆయన.. ఎన్నికల తర్వాత వైసీపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యేగా గుర్తిస్తూ ఏదో ఒక ప్రాధాన్యం కలిగిన పోస్టును ఇవ్వకపోతారా అని చూస్తున్నారు.

పదవుల కోసం నిరీక్షణ:
మరో మాజీ ఎమ్మేల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ కాంగ్రెస్‌లో ఉండగా జిల్లా రాజకీయాలను శాసించేవారు. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిన ఆయనకు వీఎంఆర్డీఏ చైర్మన్‌గా నియమించింది. అదీ కేవలం ఒక్క సంవత్సరమే. ఇటీవలే ఆయన పదవీకాలం ముగిసింది. దీంతో తన పదవీకాలాన్ని పొడిగిస్తారేమోనని ఆశగా చూస్తున్నారు. ఇలా చాలా మంది మాజీలు పదవుల కోసం నిరీక్షిస్తున్నారు. అధినేత జగన్ ఎప్పుడు కరుణిస్తారో… ఎప్పుడు వీరి నిరీక్షణ ఫలిస్తుందో? చూడాలి.