అక్షయ ఫలదాయకం అక్షయ తృతీయ.. మే 7,2019

  • Published By: chvmurthy ,Published On : April 26, 2019 / 12:09 PM IST
అక్షయ ఫలదాయకం అక్షయ తృతీయ.. మే 7,2019

అక్షయ తృతీయ… వైశాఖ శుధ్ద తదియనే అక్షయ తృతీయ గా వ్యవహరిస్తారు. అక్షయ అంటే తరగనిది, క్షయం లేనిది అని అర్థం. మహాభారతంల్లో అక్షయపాత్ర పేరు ప్రస్తావనకు వస్తుంది. ఈ పాత్ర ఉన్నవారి ఇంటికి ఎంత‌మంది అతిథులు వచ్చినా కావాల్సినంత ఆహారాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. వైశాఖ మాసం శుక్లపక్ష తదియను అక్షయ తృతీయగా పురాణాలు పేర్కొన్నాయి. త్రేతాయుగం ప్రారంభం, మహాభారత రచన ఈ రోజునే మొదలైంది. సంపదలకు అధిపతి కుబేరుడు శివుడ్ని ప్రార్థించగా లక్ష్మీ అనుగ్రహాన్ని ఈనాడే ఇచ్చినట్టు శివపురాణం తెలుపుతుంది. అక్షయ తృతీయ పండగ మన హిందువుల్లోనే కాకుండా జైనులలో కూడా చెపుకోతగ్గ పెద్ద పండగ. 2019 వ సంవత్సరంలో మే 7 వ తేదీన అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారని పండితులు చెబుతున్నారు. ఈరోజు ఏ పని ప్రారంభించినా విజయం సిద్దిస్తుందని పండితుల మాట.

ఈ పర్వదినాన ప్రజలు కొత్త పని ఏది ప్రారంభించినా అద్భుత ఫలితాలు దక్కుతాయని విశ్వాసం. అందుకే కొందరు ప్రజలు ఈ రోజు  కొత్త ఆస్తులు, కొత్త వస్తువులు కొనుగోలు చెయ్యడం చేస్తారు. మహిళల్లో బంగారం కొంటె లక్ష్మీ దేవి తమతోనే ఉంటుందని నమ్మకం. అక్షయ తృతీయ నాడు ఎంతో కొంత బంగారం కొనేందుకు జనం ఎగబడతారు. ఈ రోజున బంగారాన్ని కొనుగోలు చేస్తే ఏడాది మొత్తం సంపద ఉంటుందన్న నమ్మకంతో బంగారాన్ని కొనుగోలు చేస్తారు. మహిళలకు  బంగారం పట్ల ఉన్న సహజ ఆసక్తిని గుర్తించిన బంగారం షాపులు ఆకర్షణీయమైన ప్రకటనలతో , అక్షయ తృతీయరోజు అర్ధరాత్రి దాకా వ్యాపార్ని కొనసాగిస్తాయి. అయితే పండితులు మాత్రం అప్పుచేసి అక్షయ తృతీయనాడు బంగారం కొనవద్దని సలహానిస్తున్నారు. అక్షయ తృతీయ నాడు చేసిన ఏ పుణ్య కార్యానికైనా సరే నశించిపోవడం అన్నమాట ఉండదు. 

అక్షయ తృతీయ విశిష్టతలు
*మన పురాణాలు, పండితులు చెబుతున్న అక్షయ తృతీయ విశిష్టతలు ఎన్నో ఉన్నాయి. వాటి వివరాలు క్లుప్తముగా…
*ఈ రోజే మహా విష్ణువు ఆరవ అవతారమైన పరశురాముని జననం.
*ఈ పవిత్ర దినానే త్రేతాయుగం ప్రారంభమైనదని పండితుల మాట.
*ఈరోజే సింహాచలం దివ్యక్షేత్రం లో సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం మరియు చందనోత్సవం ప్రారంభపు రోజు.
*ఆదిశంకరుల వారు ఓ పేద వృద్ద జంట లబ్ది కోసం సృష్టిలో తొలిసారి “కనకధారాస్థవం” స్తుతించిన రోజు.
*ఈ పవిత్ర దినానే, దివ్య క్షేత్రం “బద్రీనాథ్” ఆలయ ద్వారాలు 4 నెలల దర్శన విరామం తర్వాత, పునః దర్శనార్ధమై తెరుచుకోబడతాయి.
*ఏఏటికాఏడు ఒడిషా పూరి రథయాత్ర సంబరాల కొరకు నిర్మించే రథ నిర్మాణం ప్రారంబించే రోజు.
*గంగమ్మ భువి పై ఉద్భవించిన రోజు ఈ రోజే.
*అక్షయ తృతీయ నాడే వ్యాస మహర్షి “మహాభరతం” పవిత్ర గ్రంధాన్ని రచన ప్రారంబించిన రోజు.
*ఈ రోజే అమ్మ “అన్నపూర్ణ దేవి” అవతరించిన రోజు.
*అక్షయ తృతీయ పవిత్ర దినాన్నే కుబేరుడు శివానుగ్రహాన్ని పొంది మహలక్ష్మి ద్వారా అనంత సంపదను పొంది సంరక్షకుడిగా నియమింపబడ్డాడు.
*శ్రీకృష్ణుడు ద్రౌదపదిని దుశ్శాసునుడి నుండి కాపాడిన  రోజు 
*శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుడు తెచ్చిన అటుకులను ఆరగించి  అపార సంపదను అనుగ్రహించిన రోజు.
*సూర్యభగవానుడు అజ్ఞాతవాసంలో పాండవులకు “అక్షయపాత్ర”ను ఇచ్చినరోజు.
*బృందావనంలోని బంకే బిహరి ఆలయంలో శ్రీకృష్ణుని పాదాలను దర్శించుకొనే అవకాశం ఒక్క అక్షయ తృతీయ రోజునే దక్కుతుంది.