Bhadrakali Temple : దక్షిణ భారత స్వర్ణదేవాలయం…వరంగల్ భద్రకాళీ ఆలయం

భద్రకాళీ ఆలయాన్ని దక్షిణ భారతదేశపు స్వర్ణ దేవాలయంగా ప్రసిద్ధి గాంచింది. చాళుక్యుల కాలం నాటి నిర్మాణ శైలి సందర్శకులను అబ్బురపరుస్తుంది. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో ఆలయం బంగారు

Bhadrakali Temple : దక్షిణ భారత స్వర్ణదేవాలయం…వరంగల్ భద్రకాళీ ఆలయం

Badrakali Temple

Bhadrakali Temple : తెలంగాణా రాష్ట్రంలోని ప్రస్తుతం వరంగల్ గా పిలవబడుతున్న ఓరుగల్లుకు ఒక విశిష్టత ఉన్నది. 800 సంవత్సరాలకు పూర్వం ఏకచ్ఛత్రాధిపత్యంతో పరిపాలించిన కాకతీయ చక్రవర్తులకు ఇది రాజధాని. కాకతీయుల శాసనాలలోను, సమకాలీన సాహిత్యంలోను ఇది ‘ఏకశిలానగరంగా కీర్తి పొందింది. కాకతీయులు శివారాధులే అయినా వారు అందరు దేవతలనూ సమానంగా పూజించారు. ఈశ్వరుని ఆరాధించినట్లే అమ్మవారిని కూడా వివిధ రూపాలలో అర్చించారు. కాకతీయ శీల్చాలలో చాలచోట్ల సింహవాహినియైన దుర్గ, మహిషాసుర మర్దిని విగ్రహాలు కన్పిస్తాయి. కాకతీయులు శక్తిఆరాధకులనటంలో ఎలాంటి సందేహం లేదు. కాకతీయులు అరాధించిన దేవీశక్తులలో శ్రీ భద్రకాళీ అమ్మవారు ఒకరు.

ఓరుగల్లు ప్రజలకు ఇలువేల్పుగా నేటికి విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళీమాత దేవాలయము కాకతీయుల కాలం నాటికే ప్రాభవంలో ఉందన్న ఆధారాలు ఉన్నాయి. ప్రతాపరుద్ర చరిత్రలోను , సిద్దేశ్వర చరిత్రలోను ,భద్రకాళీ అమ్మవారి గురించి ప్రస్తావించబడింది. భద్రకాళీ ఆలయము క్రీ.శ.625లోనే నిర్మింపబడిందని స్థానికుల అభిప్రాయం. వేంగీ చాళుక్యుల పైన విజయం సాధించడానికి, పశ్చిమ చాళుక్య ప్రభువైన రెండవ పులకేశి ఈ ఆలయాన్ని నిర్మించి, అమ్మవారిని ఆరాధించినట్లు చెబుతారు. అందుకు ఆధారం అమ్మవారి విగ్రహం ఒక పెద్ద ఏకాండశిలమీద చెక్కబడి ఉండటమే. ఈ విధంగా ఏకాండ శిలలో విగ్రహం చెక్కడం చాళుక్య సంప్రదాయంలో కన్పిస్తుంది. భద్రకాళీ దేవాలయంలోని రెండు స్తంభశాసనాలను బట్టి ఈ దేవాలయం క్రీ.శ.10వ శతాబ్దంలో నిర్మింపబడి ఉంటుందని అంచనావేస్తున్నారు.

భద్రకాళీ ఆలయాన్ని దక్షిణ భారతదేశపు స్వర్ణ దేవాలయంగా ప్రసిద్ధి గాంచింది. చాళుక్యుల కాలం నాటి నిర్మాణ శైలి సందర్శకులను అబ్బురపరుస్తుంది. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో ఆలయం బంగారు వర్ణంలో మెరిసిపోతుంది. అందుకే భద్రకాళి ఆలయాన్ని దక్షిణ భారతదేశపు స్వర్ణ దేవాలయంగా పిలుస్తారు. ఈ ఆలయానికి పక్కన ఉండే భద్రకాళి సరస్సును భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. 1950 నాటికే శ్రీ అమ్మవారి శక్తులను గురించి రకరకాల కథలు ప్రచారంలో ఉండేవి. అమ్మవారి గుడిలో విగ్రహం క్రింద ధనరాశులు ఉంటాయనే సమ్మకంతో,అర్ధరాత్రివేళ త్రవ్వి ధనాన్ని దొంగిలించాలని ప్రయత్నించిన ఒక వ్యక్తి కొంత దూరం వెళ్ళగానే రక్తం కక్కుకొని చనిపోయినట్లు నేటికి స్ధానికంగా చెప్పుకుంటుంటారు.

భద్రకాళీ అమ్మవారి విగ్రహం దాదాపు 9 అడుగుల ఎత్తు 9 అడుగుల వెడల్పుతో కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తుంది. 8 చేతులతో కొలువైన భధ్రకాళీ కుడివైపు ఉన్న 4 చేతులతో ఖడ్గము, ఛురిక, జపమాల, డమరుకము ఎడమవైపు ఉన్న 4 చేతులతో ఘంట, త్రిశూలము, ఛిన్నమస్తకము, పానపాత్రలు ఉన్నాయి. అమ్మవారు పశ్చిమాభిముఖంగా ఉన్నది. ప్రతినిత్యము జరిగే ధూపదీపనైవేద్యాదులు కాక-ప్రతి సంవత్సరమూ ఆశ్వయుజ మాసంలో శరన్నవరాత్రులు, చైత్ర మానంలో వసంత రాత్రులు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఆషాడమాసంలో పౌర్ణమి నాడు అమ్మవారిని ‘శాకంభరి’గా అలంకరిస్తారు.

శనివారం రోజున వచ్చే శని త్రయోదశినాడు ఇక్కడ శనీశ్వర పూజ చేస్తారు. ఆరోజు ఉదయం ఐదు గంటలకు వినాయక పూజతో ప్రారంభమవుతుంది హోమం, జపం, తర్పణ తైలాభిషేకం, పూర్ణాహుతి హారతి వంటి పూజలు నిర్వహిస్తారు. ఈ పూజలలో పాల్గొనడానికి వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. వసంత పంచమి, నవరాత్రి మహోత్సవం, మూల నక్షత్రం రోజున సరస్వతి పూజ భద్రకాళీ ఆలయం ప్రత్యేకతో కూడుకున్న పూజ కార్యక్రమాలుగా చెప్పవచ్చు. అమ్మవారితో పాటు ఇక్కడ ఇతర దేవాలయాలు కూడా వున్నాయి. అవి శ్రీ లక్ష్మీ గణపతి, శనీశ్వరుడు మరియు శివుడు ఉన్నారు. ఇక్కడ రెండు వైష్ణవ ఆలయాలు ఉన్నాయి. ఈ వైష్ణవ ఆలయాలు ప్రస్తుతం శిథిలావస్థలో వున్నాయి. ఈ రెండు వైష్ణవ దేవాలయాలు కాకతీయ పాలకుల కాలంలో నిర్మించబడ్డాయి అని చెబుతారు.