అడిలైడ్ వన్డే : టీమిండియా టార్గెట్ 299

  • Published By: veegamteam ,Published On : January 15, 2019 / 07:14 AM IST
అడిలైడ్ వన్డే : టీమిండియా టార్గెట్ 299

అడిలైడ్ : నిర్ణయాత్మకమైన రెండో వన్డేలో ఆస్ట్రేలియా భారీ స్కోర్ చేసింది. టీమిండియా ముందు 299 పరుగుల టార్గెట్ ఉంచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 298 రన్స్ చేసింది. షాన్ మార్ష్ సెంచరీతో చెలరేగిపోయాడు. జట్టు భారీ స్కోర్ సాధించడంలో కీ రోల్ ప్లే చేశాడు. మార్ష్ 123 బంతుల్లో 133 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లు ఉన్నాయి. మ్యాక్స్‌వెల్ 48 రన్స్‌తో మెరిశాడు. భారత బౌలర్లలో భువీ 4 వికెట్లు, షమీ 3 వికెట్లు తీయగా జడేజా ఒక వికెట్ తీశాడు.

నిర్ణయాత్మకమైన రెండో వన్డేలో టాస్ గెల్చిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. 41 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. షమీ వేసిన ఎనిమిదో ఓవర్‌లో కారే(18) ధావన్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. అంతకుముందు ఓవర్‌లో కెప్టెన్‌ ఫించ్‌(6) భువనేశ్వర్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. షాన్ మార్స్ మాత్రం నిలకడగా బ్యాటింగ్ చేశాడు. సెంచరీతో జట్టుని ఆదుకున్నాడు. ఆస్ట్రేలియాపై టెస్ట్‌ సిరీస్‌ గెలిచిన ఉత్సాహంతో వన్డే సిరీస్‌కు బరిలోకి దిగిన భారత్‌కు తొలి మ్యాచ్‌లో అనూహ్య ఫలితం ఎదురైంది. భారత్‌తో పోలిస్తే అన్ని విభాగాల్లో అనుభవం తక్కువగా ఉన్న ఆసీస్‌ ముందు టీమ్ ఇండియా తలవంచింది. సిరీస్‌ కోల్పోకుండా ఉండాలంటే తప్పనిసరిగా ఈ మ్యాచ్‌లో కోహ్లి సేన గెలిచి తీరాలి.