ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతి సురేఖని సన్మానించిన సీఎం జగన్

  • Published By: chvmurthy ,Published On : December 31, 2019 / 08:00 AM IST
ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతి సురేఖని సన్మానించిన సీఎం జగన్

అర్జున అవార్డు గ్రహీత, బ్యాంకాక్ లో జరిగిన వరల్డ్ ఆర్చరీ చాంపియన్‌ షిప్‌లో స్వర్ణం సాధించిన విజయవాడకు చెందిన వెన్నం జ్యోతిసురేఖను సీఎం జగన్ మోహన్ రెడ్డి మంగళవారం అభినందించారు. ఇటీవల జరిగిన 21వ ఆసియన్ ఆర్చరీ పోటీల్లో సాధించిన పతకాలను ఆమె ముఖ్యమంత్రికి చూపించారు. సీఎం జగన్ ఆమెను శాలువాతో సత్కరించారు. విలువిద్యలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటి వరకు ఆమె సుమారు 80 పతకాలు సాధించి ఆంధ్రప్రదేశ్ పేరును నిలబెట్టింది. 

జ్యోతి తన నాలుగు ఏళ్ల  వయసులోనే తన ఈత విన్యాసాలతో లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పేరు నమోదు చేసుకున్నది. 5 కి.మీ. దూరంలో కృష్ణానదిని మూడు గంటల ఇరవై నిమిషాల ఎనిమిది సెకండ్లలో ఈది, “పిట్ట కొంచెం కూత ఘనం” అనిపించుకున్నది. తరువాత ఈమె విలువిద్యపై గురిపెట్టింది. కొద్దికాలంలోనే ఆ క్రీడపై తనదైన ముద్రవేసింది. 13 సంవత్సరాల వయసులో తొలిసారిగా అంతర్జాతీయ వేదికపై మెరిసిన జ్యోతి, ఇక వెనుదిరిగి చూడలేదు. 

2009 లో టైజునాలో మెక్సికన్ గ్రాండ్ టోర్నీలో, అండర్-19 విభాగంలో ఒలింపిక్ రౌండ్లో స్వర్ణ పతకం గెల్చుకున్నది. అదే వేదికపై మరో మూడు రజత పతకాలనూ మరియూ ఒక కాంస్య పతకాన్నీ గూడా స్వంతం చేసుకుని తన ప్రతిభ ప్రదర్శించింది. 2011 లో టెహరానులో జరిగిన ఆసియా ఆర్చెరీ ఛాంపియనుషిప్పు పోటీలలో మహిళా కాంపౌండ్ టీం సభ్యురాలిగా కాంస్య పతకం గెల్చుకున్నది.

2013 లో చైనాలోని “వుక్సి” వేదికగా సాగిన ప్రపంచ యూత్ ఆర్చెరీ ఛాంపియనుషిప్పు పోటీలలో కాంపౌండ్ జూనియర్ ఉమన్ మరియూ కాంపౌండ్ మిక్సెడ్ డబుల్స్ విభాగాలలో కాంస్య పతకాలు సాధించింది. తాజాగా ఈమె 2014 సెప్టెంబరులో, దక్షిణ కొరియాలోని ఇంచియాన్ లో జరుగుచున్న ఆసియా క్రీడలలో భారత ఆర్చెరీ మహిళా జట్టు సభ్యురాలిగా కాంస్య పతకం స్వంతం చేసుకున్నది. తన ఎనిమిదేళ్ల కెరీర్‌లో జ్యోతి సురేఖ సాధించిన అంతర్జాతీయ పతకాల సంఖ్య సుమారు 80.