IND vs SL : గెలిచినా టీమ్ఇండియా ఖాతాలో చెత్తరికార్డు.. ఓడినా చరిత్ర సృష్టించిన శ్రీలంక
ఆసియాకప్ (Asia Cup) 2023లో సూపర్-4 దశలో భాగంగా కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో మంగళవారం శ్రీలంక (Sri Lanka) జట్టుతో భారత్ తలపడింది.

Team India
India vs Sri Lanka : ఆసియాకప్ (Asia Cup) 2023లో సూపర్-4 దశలో భాగంగా కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో మంగళవారం శ్రీలంక (Sri Lanka) జట్టుతో భారత్ తలపడింది. ఈ మ్యాచ్‌లో భారత్ (Team India) 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా ఆసియా కప్ 2023లో ఫైనల్‌కు దూసుకువెళ్లింది. కాగా.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమ్ఇండియా బ్యాటింగ్ ఎంచుకుంది. 11 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసింది. దీంతో భారత్ ఈజీగా 320 పరుగులు చేస్తుందని అంతా భావించారు. అయితే.. శ్రీలంక స్పిన్నర్లు చెలరేగడంతో 213 పరుగులకే ఆలౌటైంది. అనంతరం భారత బౌలర్లు కూడా రాణించడంతో లంక 172 పరుగులకే పరిమితమైంది.
చెత్త రికార్డు..
ఈ మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించినప్పటికీ ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. టీమ్ఇండియా పది వికెట్లను సైతం లంక స్పిన్నర్లే పడగొట్టారు. 49 ఏళ్ల టీమ్ఇండియా వన్డే క్రికెట్ చరిత్రలో ఇలా అందరూ స్పిన్నర్లకే వికెట్లు సమర్పించుకోవడం ఇదే తొలిసారి. లంక బౌలర్లలో స్పిన్ ఆల్‌రౌండర్ దునిత్ వెల్లలాగె (40/5) టీమ్ఇండియా పతనాన్ని శాసించగా అసలంక (4/18), మహీశ్ తీక్షణ మిగిలిన వికెట్లను పడగొట్టారు.
చరిత్ర సృష్టించిన శ్రీలంక..
టీమ్ఇండియాను ఆలౌట్ చేయడం ద్వారా శ్రీలంక జట్టు చరిత్ర సృష్టించింది. వన్డేల్లో వరుసగా 14 మ్యాచుల్లో ప్రత్యర్థి జట్లను ఆలౌట్ చేసిన మొదటి జట్టుగా రికార్డులకు ఎక్కింది. అయితే.. భారత్ చేతిలో ఓడిపోవడంతో లంక వరుస విజయాలకు బ్రేక్ పడింది. లంక జట్టు వరుసగా 13 మ్యాచుల్లో గెలుపొందింది. ఇక శ్రీలంక జట్టు గురువారం పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచులో విజయం సాధించిన జట్టు ఆదివారం ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌తో ఢీ కొట్టనుంది. ఒకవేళ పాక్, శ్రీలంక మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయితే మాత్రం మెరుగైన నెట్ రన్‌రేట్ కలిగిన లంక ముందంజ వేయనుంది.
Virat Kohli : లుంగీ డ్యాన్స్ పాటకు విరాట్ కోహ్లీ స్టెప్పులు.. వీడియో వైరల్