పద్మ అవార్డులు: దేశోన్నత పురస్కారాలు అందుకున్న క్రీడాకారులు

క్రీడా ప్రపంచంలో దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసిన భారత క్రీడాకారులను కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలతో గౌరవించింది.

  • Published By: venkaiahnaidu ,Published On : January 26, 2019 / 04:59 AM IST
పద్మ అవార్డులు: దేశోన్నత పురస్కారాలు అందుకున్న క్రీడాకారులు

క్రీడా ప్రపంచంలో దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసిన భారత క్రీడాకారులను కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలతో గౌరవించింది.

క్రీడా ప్రపంచంలో దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసిన భారత క్రీడాకారులను కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలతో గౌరవించింది. భారత దేశం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తూ సగర్వంగా జరుపుకునే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముందుగానే దేశోన్నత పురస్కారాలైన పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ మేర శుక్రవారం సాయంత్రమే పలు విభాగాల్లోని వ్యక్తులకు అవార్డులను ప్రకటించగా మొత్తం 112 మందిని ఈ అవార్డులు వరించాయి. క్రీడా విభాగం నుంచి తొమ్మిది మంది ఈ అరుదైన గౌరవం దక్కించుకోగా అందులో పర్వతారోహిణి బచేంద్రి పాల్‌కు పద్మ భూషణ్ అవార్డు దక్కింది. మిగిలిన ఏడుగురు పద్మశ్రీని అందుకోనున్నారు. 

బచేంద్రీ పాల్‌కు ‘పద్మ భూషణ్‌’
మౌంట్‌ ఎవరెస్ట్‌ను అధిరోహించిన తొలి భారతీయ మహిళ బచేంద్రీ పాల్‌కు ‘పద్మ భూషణ్‌’ లభించింది. ఉత్తరాఖండ్‌కు చెందిన 64 ఏళ్ల బచేంద్రీ పాల్‌ 1984లో మౌంట్‌ ఎవరెస్ట్‌ను అధిరోహించారు. 

ఫుట్‌‍బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రి:
భారత ఫుట్‌బాల్ ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో ప్రజ్వరిల్లేలా చేస్తున్న ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రికి పద్మ శ్రీ అవార్డు అందనుంది. ఇటీవలే ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ రికార్డు బద్దలు కొట్టిన ఛెత్రి 67 అంతర్జాతీయ గోల్స్ చేసి అరుదైన ఘనత సాధించాడు. అంతేకాకుండా భారత్ తరపున అత్యధికంగా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి బైచుంగ్ భూటియా రికార్డును సమం చేశాడు. 

భజరంగ్ పూనియా:
2018వ సంవత్సరంలో ఐదు పతకాలు అందుకున్న భజరంగ్ పూనియా రెజ్లింగ్‌లో దూసుకుపోతున్నాడు. కామెన్వెల్త్, ఆసియా గేమ్స్‌లో స్వర్ణం, ప్రపంచ ఛాంపియన్ షిప్‌లో రజితం సొంతం చేసుకున్నాడు. దాంతో పాటు ఈ ఏడాదిలో అతని కెరీర్‌లోనే అత్యుత్తమంగా ప్రపంచ నెం.1 ర్యాంకును సైతం చేరుకున్నాడు.

 

ట్రిపుల్‌ ఒలింపియన్‌ శరత్ కమల్:
టేబుల్ టెన్నిస్ విభాగంలో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్న ఆచంట శరత్ కమల్‌ను పద్మ శ్రీ వరించనుంది. ‘ట్రిపుల్‌ ఒలింపియన్‌’ టేబుల్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ ఆచంట శరత్‌ కమల్‌ కామన్వెల్త్ గేమ్స్ 2018లో స్వర్ణ, రజిత, కాంస్యాలను సొంతం చేసుకున్నాడు. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు తొలిసారి పతకాలను అందించిన ఘనతను పొందాడు. 

అంచెలంచెలుగా ఎదిగిన హారిక:
స్పెయిన్‌లో 2000వ సంవత్సరంలో జరిగిన ప్రపంచ యూత్‌ చాంపియన్‌షిప్‌లో అండర్‌–10 బాలికల విభాగంలో రజతం గెలిచి వెలుగులోకి వచ్చింది. హారిక తల్లిదండ్రులు రమేశ్, స్వర్ణల ప్రోత్సాహంతో మెరుగైన శిక్షణ తీసుకుంది. కోచ్‌ ఎన్‌వీఎస్‌ రామరాజు శిక్షణలో మరిన్ని మెలకువలు నేర్చుకుంది. అనంతరం ప్రపంచ యూత్‌ చాంపియన్‌షిప్‌లో అండర్‌–12 విభాగంలో రజిత, కాంస్యాలు సాధించింది. 2006లో ప్రపంచ యూత్‌ చాంపియన్‌షిప్‌లో అండర్‌–18 విభాగంలో స్వర్ణం, 2008 ప్రపంచ జూనియర్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం, ఆసియా మహిళా చాంపియన్‌గా 2009లో, కామన్వెల్త్‌ చాంపియన్‌గా 2010లో నిలిచింది. 

2011లో గ్రాండ్‌మాస్టర్‌ (జీఎం) హోదా పొందిన ఆమె వరుసగా మూడు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో (2012, 2015, 2017) కాంస్య పతకాలను కూడా దక్కించుకుంది. 28 ఏళ్ల హారిక ప్రస్తుతం స్పెయిన్‌లో జరుగుతున్న జిబ్రాల్టర్‌ అంతర్జాతీయ టోర్నమెంట్‌లో పాల్గొననుంది. 

 

పద్మ శ్రీ గౌతం గంభీర్:
2018లో సంచలనమైన నిర్ణయాన్ని ప్రకటిస్తూ అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు గౌతం గంభీర్. అతను దేశానికి అందించిన సేవలకు గౌరవ సంకేతకంగా పద్మ శ్రీ అవార్డును ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 4218 పరుగులు పూర్తి చేసిన గంభీర్.. టీమిండియా తరపున 58 టెస్టులు, 147వన్డేలు, 37టీ20లు ఆడి 10324 పరుగులు చేశాడు.