డబుల్ సెంచరీతో సచిన్, సెహ్వాగ్‌ల సరసన రోహిత్ శర్మ

డబుల్ సెంచరీతో సచిన్, సెహ్వాగ్‌ల సరసన రోహిత్ శర్మ

టీమిండియా ఓపెనర్ రోహిత్‌ శర్మ మరో రికార్డు కొట్టేశాడు. వన్డేల్లోనే కాదు టెస్టుల్లోనూ డబుల్ సెంచరీ సాధించి రికార్డులకెక్కాడు. ఈ ఘనత  సాధించిన మూడో భారత ప్లేయర్‌గా నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన నాల్గో క్రికెటర్‌గా గుర్తింపు దక్కించుకున్నాడు. శనివారం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టు రెండో రోజు మ్యాచ్‌లో 249 బంతుల్లో 28 ఫోర్లు, 4 సిక్సర్లతో డబుల్‌ సెంచరీ మార్కును చేరుకున్నాడు. 

సిక్స్‌తోనే సెంచరీ పూర్తి చేసిన రోహిత్‌.. డబుల్‌ సెంచరీని కూడా సిక్స్‌తోనే ముగించాడు. లంచ్‌ విరామం తర్వాత ఎన్‌గిడి బౌలింగ్‌లో సిక్స్‌ కొట్టి డబుల్‌ సెంచరీ సాధించిన రోహిత్ కాసేపటికే అవుట్ గా వెనుదిరిగాడు. దక్షిణాఫ్రికాపై ఒకే సిరీస్‌లో 500 పరుగులకు పైగా సాధించిన ఐదో భారత ఓపెనర్‌గా రోహిత్‌ నిలిచాడు. వినోద్‌ మాంకడే, కుందేరేన్‌, సునీల్‌ గవాస్కర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌లు ఈ జాబితాలో ఉన్నారు. 

సఫారీలతో తొలి టెస్టులో రోహిత్‌ రెండు భారీ శతకాలు సాధించిన సంగతి తెలిసిందే. రహానెతో కలిసి నాల్గో వికెట్‌కు 267పరుగులు చేసిన రోహిత్ రబాడ బౌలింగ్ లో ఎంగిడికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.