కప్పు కొట్టేశారు: లంకపై ఘన విజయం

కప్పు కొట్టేశారు: లంకపై ఘన విజయం

భారత్ సిరీస్ కొట్టేసింది. పర్యాటక జట్టుపై రెండో మ్యాచ్ లోనూ భారీ విజయం  సాధించి కప్పు దక్కించుకుంది. తొలి మ్యాచ్ వర్షార్పణం కాగా మిగిలిన రెండు మ్యాచ్ లలో విజయకేతనం ఎగరేసింది. రెండో మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో.. మూడో మ్యాచ్‌లో 78పరుగుల తేడాతో పైచేయి సాధించింది. పూణె వేదికగా జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన కోహ్లీసేన నిర్ణీత 20 ఓవర్లలో 201/6 చేసింది. చేధనకు దిగిన లంక 15.5 ఓవర్లలోనే ఆలౌట్‌గా ముగించి 123పరుగులకే వెనుదిరిగింది. 

202 పరుగుల లక్ష్య చేధనకు దిగిన లంకకు శుభారంభం లభించలేదు. జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో తొలి ఓవర్లోనే గుణతిలక (1) ఔటయ్యాడు. ఈ స్థితిలో ఐదు పరుగులకే లంక తొలి వికెట్‌ను కోల్పోవాల్సి వచ్చింది. ఈ వికెట్‌తో బుమ్రా ఖాతాలో 53 వికెట్లు వచ్చి చేరాయి. షార్ట్ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా ఘనత దక్కించుకున్నాడు. ఆ తర్వాతి ఓవర్లోనే ఆవిష్క ఫెర్నాండో (9) కూడా పెవిలియన్‌కు చేరడంతో లంక కష్టాల్లో కూరుకుపోయింది. 

కాసేపటికే ఫెర్నాండో (2) రనౌట్.. కుశాల్ పెరీరా (7)న సైనా ఔట్ చేయడంతో పవర్‌ ప్లే ముగిసేసరికి లంక 35/4తో నిలిచింది. ఈ దశలో వెటరన్ మాథ్యూస్ (31)తో కలిసి ధనంజయ డిసిల్వా జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. భారత బౌలర్లను వీరిద్దరూ సమర్థంగా ఎదుర్కొని వీరిద్దరూ 68 పరుగులు జోడించారు.

మాథ్యూస్ వెనుదిరిగిన తర్వాత మిగిలిన ప్లేయర్లు వరుస విరామాల్లో వెనుదిరిగారు. ఓ వైపు 31 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ధనంజయ ఒంటరి పోరాటం చేసినా ఫలితం దక్కలేదు. భారత బౌలర్లలో నవదీప్ సైనీ 3, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్ చెరో 2వికెట్లు తీయగా, బుమ్రా ఒక్క వికెట్ మాత్రమే తీయగలిగాడు.