అప్ప‌గించేశారు: తొలి సిరీస్‌లో చిత్తుగా ఓడిన భార‌త్‌

అప్ప‌గించేశారు: తొలి సిరీస్‌లో చిత్తుగా ఓడిన భార‌త్‌

టీమిండియాపై అద్భుతమైన ప్రదర్శన చేసిన ఆస్ట్రేలియా వరుసగా రెండు మ్యాచ్ లలోనూ గెలిచి సిరీస్ ను కైవసం చేసుకుంది. భారత్ విధించిన 191 పరుగుల లక్ష్యాన్ని ఇంకా రెండు బంతులు మిగిలి ఉండగానే సాధించి మ్యాచ్ విజయాన్ని నమోదు చేసుకుంది. మ్యాచ్ మొత్తంలో ఆసీస్ పరుగుల బాధ్యతను గ్లెన్ మ్యాక్స్ వెల్ భుజాన వేసుకుని జట్టును ముందుకు నడిపించాడు. భారత బౌలర్లకు చుక్కలు చూపిస్తూ బౌండరీలపై విరుచుకుపడ్డాడు. 

అలవోకగా సెంచరీ సాధించి (113; 55 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సులు)తో అజేయంగా నిలిచాడు. భారత బౌలర్లు ఎంతగా శ్రమించినా ఆసీస్ ను కట్టడి చేయలేకపోయారు. విజయ్ శంకర్ 2, సిద్ధార్థ్ కౌల్ 1 వికెట్లు తీయగలిగారు. 

అంతకుముందు ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలి టీ20 పరాజయాన్ని దృష్టిలో పెట్టుకుని భారత్ రెచ్చిపోయింది. టాస్ ఓడి బ్యాటింగ్ తీసుకున్న భారత్.. ఆరంభం నుంచి దూకుడైన ఇన్నింగ్స్ కొనసాగించింది. టైగా ముగించాలనే తపనతో బ్యాట్స్‌మెన్ తడాఖా చూపించారు. ఆస్ట్రేలియాకు 191 పరుగుల టార్గెట్ నిర్ధేశించారు. 

రాహుల్‌కు బాగా కలిసొచ్చిన టీ20 ఫార్మాట్‌లో దూసుకుపోయాడు. ఓపెనర్లు కేఎల్ రాహుల్(47; 26 బంతుల్లో 3ఫోర్లు, 4 సిక్సులు), ధావన్(14) శుభారంభాన్ని ఇచ్చారు. 7.1 ఓవర్ల వద్ద రాహుల్ అవుటవడంతో విరాట్ కోహ్లీ బరిలోకి దిగాడు. ఆ కాసేపటికే ధావన్ 9.2ఓవర్ల వద్ద అవుటవడంతో రిషబ్ పంత్(1) వచ్చి కేవలం ఒక్క పరుగుతో సరిపెట్టుకున్నాడు. 

ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతను భుజానికేసుకున్న కోహ్లీ(72), ఎంఎస్ ధోనీతో కలిసి రెచ్చిపోయాడు. 29 బంతుల్లోనే వేగవంతంగా హాఫ్ సెంచరీ చేసి అజేయంగా నిలిచాడు. కోహ్లీకి చక్కని భాగస్వామ్యం అందించిన ధోనీ (40; 23బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులు ) క్రితం మ్యాచ్‌లా కాకుండా దూకుడైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. చివరిగా బ్యాటింగ్‌కు దిగిన కార్తీక్(8) 3 బంతుల్లో 2 ఫోర్లు బాదాడు.