కుక్కతోకే కాదు.. కంగారుల తోక వంకరే

కుక్కతోకే కాదు.. కంగారుల తోక వంకరే

Mohammed Siraj : ఆసిస్‌ క్రికెట్‌ అభిమానుల తీరు మారడం లేదు. టీమిండియా పేస్‌ బౌలర్‌ సిరాజ్‌పై మరోసారి జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారు. సిరాజ్‌ను పురుగుతో పోల్చుతూ ఆనందం పొందారు. దీనిపై టీమిండియా.. ఫిర్యాదు చేసింది. కుక్కతోకే కాదు.. కంగారుల తోక వంకరే అని మరోసారి తేలింది. ఇప్పటికే భారత ఆటగాళ్లపై జాతి విపక్ష వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా క్రికెట్‌ అభిమానులు మరోసారి నోరు పారేసుకున్నారు. బ్రిస్బేన్‌ వేదికగా.. గబ్బా స్టేడియంలో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌పై కొందరు ఆస్ట్రేలియా ప్రేక్షకులు మరోసారి జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారు. సిరాజ్‌ను పురుగుతో పోల్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని టీమిండియా మేనేజ్‌మెంట్‌ క్రికెట్‌ ఆస్ట్రేలియాతో పాటు ఐసీసీ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం.

సిడ్నీ టెస్టులోనూ బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న సిరాజ్‌, బుమ్రాపై ఆస్ట్రేలియా ప్రేక్షకులు జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారు. దానిపై ఇప్పటికే టీమిండియా మేనేజ్‌మెంట్‌ క్రికెట్‌ ఆస్ట్రేలియా దృష్టికి తీసుకెళ్లగా.. చర్యలు తీసుకున్నామని తెలిపింది. కామెంట్‌ చేసిన వారిని గుర్తించి స్టేడియం నుంచి బయటకు గెంటేశామని సీఏ తెలిపింది. వారిని పోలీసులకు అప్పగిస్తామని కూడా హామి ఇచ్చింది. వారం గడవక ముందే మళ్లీ అదే తరహా ఉదంతం వెలుగు చూడటంతో టీమిండియా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది.

ఇక నాలుగో టెస్ట్‌ తొలిరోజు ఆట ముగిసే సమయానికి అతిథ్య జట్టు మెరుగైన స్థానంలో నిలిచింది. ఐదు వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసింది. ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌ ఒక్క పరుగు, మార్కస్‌ హ్యారిస్‌ ఐదు పరుగులకే ఔట్‌ అయినా.. లబూషేన్‌ సెంచరీ చేశాడు. 204 బంతుల్లో 108 పరుగులు సాధించాడు. లబుషేన్‌కు స్టీవ్‌ స్మిత్‌, మాథ్యూ వేడ్‌ మంచి తోడ్పాటు అందించారు. స్టీవ్‌ స్మిత్‌ 36 పరుగులు చేయగా.. మాథ్యూ వేడ్‌ 45 పరుగులతో రాణించాడు. ప్రస్తుతం కామెరూన్‌ గ్రీన్‌ 28 పరుగులతో.., కెప్టెన్‌ పైన్‌ 38 పరుగులతో క్రీజులో ఉన్నారు. అరంగేట్ర బౌలర్‌ నటరాజన్‌ 2, శార్దూల్‌ ఠాకూర్‌, వాషింగ్టన్‌ సుందర్‌, సిరాజ్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.