చెన్నై లెజెండ్స్.. ప్రాక్టీస్ మాములుగా లేదుగా..

చెన్నై లెజెండ్స్.. ప్రాక్టీస్ మాములుగా లేదుగా..

Chennai Super Kings

ఐపీఎల్ మరికొన్నిరోజుల్లో స్టార్ట్ అవుతోంది.. ఈ మ్యాచ్‌ల కోసం టీమ్‌లు అన్నీ విపరీతంగా కష్టపడుతున్నాయి. ఈ క్రమంలోనే ఐపీఎల్‌లో ధోనీ సారధ్యంలో విజయవంతమైన జట్టుగా పేరొందిన చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే) కూడా కష్టపడుతోంది. మూడుసార్లు చాంపియన్‌.. ఎనిమిది సార్లు ఫైనలిస్టైన చెన్నై గత సీజన్ 2020 సెప్టెంబర్‌లో యూఏఈలో జరిగిన మ్యాచ్‌లలో మాత్రం అనుకున్నంతగా రాణించలేదు. కనీసం ప్లే ఆఫ్‌లకు కూడా వెళ్లకుండా అభిమానులను నిరాశపరిచింది.

అయితే ఈ ఏడాది మాత్రం గట్టిగా రీబ్యాక్ అయ్యి టైటిల్ నెగ్గేందుకు తీవ్రంగా కష్టపడుతోంది. గతేడాది స్టార్ బ్యాట్స్‌మెన్ సురేష్ రైనా కూడా మ్యాచ్‌లకు దూరం అవ్వగా.. ఈ ఏడాది తిరిగి జట్టుకు అందుబాటులోకి వచ్చాడు. గత సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో 6 విజయాలు.. 8ఓటములతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలవడానికి ఒక కారణం ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన ఆటగాడిగా పేరు పోందిన సురేశ్‌ రైనా లేకపోవడం అని అప్పట్లో విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

ఇప్పుడు సురేశ్‌ రైనా తిరిగి జట్టుతో చేరడంతో చెన్నై మరోసారి బలంగా కనిపిస్తుంది. లేటెస్ట్‌గా చెన్నై లెజెండ్స్ ఎంఎస్‌ ధోని, రైనాలు కలిసి ప్రాక్టీస్‌ చేస్తున్న వీడియోని సీఎస్‌కే తన ట్విటర్‌లో షేర్‌ చేసింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా అవుతోంది. #Yellove అనే హ్యాష్ ట్యాగ్‌తో చెన్నై అభిమానులు తెగ రీట్వీట్ చేస్తున్నారు. ఈ సీజ‌న్‌కు సంబంధించి సీఎస్‌కే మొయిన్ అలీ, కృష్ణప్ప గౌత‌మ్ లాంటి ఆటగాళ్లు జట్టులో చేరగా.. ఆస్ట్రేలియా పేస్ బౌల‌ర్ జోష్ హజిల్‌వుడ్ మాత్రం ఐపీఎల్‌ 14వ సీజ‌న్‌కు దూరంగా ఉండాల‌ని నిర్ణయించుకున్నాడు. ఏప్రిల్ 10న ముంబై వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో సీఎస్‌కే తన తొలి మ్యాచ్ ఆడ‌నుంది.