ధోనీనే బెస్ట్ ఫినిషర్: మహేంద్రునిపై ఆసీస్ మాజీ కెప్టెన్ ప్రశంసలు

చివరి వరకు క్రీజులో ఉండి జట్టును విజయ తీరాలకు తీసుకెళ్లడంతో ధోనీకి ఎవరూ సాటిరారు. అతను క్రీజులో ఉన్నప్పుడు సమయాన్ని, బంతులను వృథా చేశాడని చాలా సార్లు భావించాను. అలా అనుకున్నప్పుడల్లా కొన్ని పవర్‌ఫుల్ షాట్లతో ఉత్కంఠతో కూడిన విజయాలను భారత్‌కు అందించాడు.

ధోనీనే బెస్ట్ ఫినిషర్: మహేంద్రునిపై ఆసీస్ మాజీ కెప్టెన్ ప్రశంసలు

చివరి వరకు క్రీజులో ఉండి జట్టును విజయ తీరాలకు తీసుకెళ్లడంతో ధోనీకి ఎవరూ సాటిరారు. అతను క్రీజులో ఉన్నప్పుడు సమయాన్ని, బంతులను వృథా చేశాడని చాలా సార్లు భావించాను. అలా అనుకున్నప్పుడల్లా కొన్ని పవర్‌ఫుల్ షాట్లతో ఉత్కంఠతో కూడిన విజయాలను భారత్‌కు అందించాడు.

‘ధోనీ ఫామ్ కోల్పోయాడు. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కూడా రిటైర్ అవడమే మంచిది’ అని చేసిన వ్యాఖ్యలన్నింటికీ ధీటుగా సమాధానమిచ్చాడు ఈ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. ఆసీస్ గడ్డపై చెలరేగి మూడు హాఫ్ సెంచరీల సాయంతో జట్టుకు కీలక స్కోరు అందించాడు. ఆస్ట్రేలియా పర్యటనలో ధోనీ చేసిన ప్రదర్శనకు గాను మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డును దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై భారత్ తొలి వన్డే సిరీస్‌ను చేజిక్కించుకోవడంతో ధోనీ కీలకపాత్ర పోషించి విమర్శకుల నోళ్లు మూయించాడు. 

37 ఏళ్ల యవసులోనూ వన్డేల్లో అద్భుతంగా రాణిస్తోన్న ఈ భారత మాజీ కెప్టెన్‌పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ సైతం ప్రశంసల్లో ముంచెత్తాడు. 50 ఓవర్ల విభాగంలో ఇప్పటికీ ప్రపంచంలో ధోనీనే అత్యుత్తమ ఫినిషర్ అని నొక్కి చెప్పారు. ఓపికతో ఎక్కువ సమయం పాటు క్రీజులో ఉండటానికి ప్రయత్నించే ధోనీ నిబద్ధతకు చాపెల్ సెల్యూట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫోకు రాసిన వ్యాసంలో చాపెల్ పేర్కొన్నారు. 

‘చివరి వరకు క్రీజులో ఉండి జట్టును విజయ తీరాలకు తీసుకెళ్లడంతో ధోనీకి ఎవరూ సాటిరారు. అతను క్రీజులో ఉన్నప్పుడు సమయాన్ని, బంతులను వృథా చేశాడని చాలా సార్లు భావించాను. అలా అనుకున్నప్పుడల్లా కొన్ని పవర్‌ఫుల్ షాట్లతో ఉత్కంఠతో కూడిన విజయాలను భారత్‌కు అందించాడు. విజయంతో ముగింపునివ్వడంలో ధోనికి ఎవరూ సాటిరారు. తీవ్ర ఒత్తిడి.. ఉత్కంఠభరిత సందర్భాల్లోనూ అతడి మెదడు చురుగ్గా పనిచేస్తుంది. మొదట్లో నెమ్మదిగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించినప్పటికీ ఆఖరిలో భారీ సిక్సర్లతో విరుచుకుపడి విజయాన్ని ధోనీ తనవైపు తిప్పేసుకుంటాడు’ అని వ్యాసంలో చాపెల్ పొందుపరిచారు. అలాగే మరో దిగ్గజమైన ఆస్ట్రేలియా మాజీ ఫినిషర్ మైఖేల్ బెవాన్‌తో ధోనీని పోల్చారు. ఆరో స్థానంలో వచ్చే బెనాన్‌ను ధోనీ ఎప్పుడో దాటేశాడని అభిప్రాయపడ్డారు. 

‘సాంకేతికంగా బెవాన్‌ కంటే ధోనినే ఉత్తమం. వన్డే క్రికెట్లో ధోనినే అత్యుత్తమ ఫినిషర్‌. బెవాన్ ఫోర్లతో మ్యాచ్‌లను ముగించేవాడు. కానీ ధోనీ సిక్సులతో ముగిస్తాడు. వికెట్ల మధ్య పరిగెత్తడంలో బెవాన్ కంటే ధోనీదే పైచేయి. 37 ఏళ్ల వయసులోనూ ధోనీ చాలా వేగంగా పరిగెడుతున్నాడు. గణాంకాల ప్రకారం చూస్తే ఏ పరిమిత ఓవర్ల ఫార్మాట్ అయినా బెవాన్‌పై ధోనీదే పైచేయి. ఇప్పటికీ వన్డేల్లో ధోనీనే బెస్ట్ ఫినిషర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు’ అని చాపెల్ తన వ్యాసంలో పేర్కొన్నారు.