Scott Styris : శుభ్‌మన్ గిల్‌ను వదులుకొని కేకేఆర్ పెద్ద తప్పుచేసింది.. అతను భారత్ జట్టుకు వెన్నెముకగా ఉంటాడు
తాజా ఐపీఎల్ సీజన్‌లో శుభ్‌మన్ గిల్ గుజరాత్ టైటాన్స్ జట్టు తరపున ఆడుతున్నాడు. ఈ సీజన్‌లో మొత్తం 16 మ్యాచ్‌లు ఆడిన ఈ యువ బ్యాటర్ మూడు సెంచరీలు, నాలుగు అర్థ సెంచరీలు చేశాడు.

Shubman Gill
Scott Styris – Shubman Gill: ఐపీఎల్ 2023 (IPL 2023) సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ ఆటగాడు శుభ్‌మన్ గిల్ అద్భుత ప్రదర్శన ఇస్తున్నాడు. వరుసగా సెంచరీలు చేస్తూ గుజరాత్ జట్టు ఫైనల్ కు చేరుకోవటంలో కీలక భూమిక పోషించాడు. గిల్ ఆటతీరుపై న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ స్కాట్ స్టైరిస్ ప్రశంసల వర్షం కురిపించారు. గిల్‌ను వదులుకోవడం కేకేఆర్ (KKR) ప్రాంచైజీ చేసిన అతిపెద్ద తప్పిదమని అన్నారు. ప్రస్తుతం ఐపీఎల్ టోర్నీలో గుజరాత్ జట్టుకే గిల్ స్టార్‌గా ఉండడు.. ముఖ్యంగా వచ్చే ప్రపంచ కప్ తర్వాత అతను భారత జట్టుకు వెన్నెముకగా ఉంటాడు అని స్టైరిస్ చెప్పారు.
గిల్ తన ఆటను చక్కగా నియంత్రిస్తున్నందున విరాట్ కోహ్లీ యువ వెర్షన్‌లా కనిపిస్తున్నాడని మాజీ క్రికెటర్ పేర్కొన్నాడు. కేకేఆర్ జట్టులో ఉన్నప్పుడునుంచి ప్రస్తుతం గుజరాత్ జట్టులో ఆడుతున్న గిల్ ఆటతీరును చూస్తున్నాం. అతను తన ఆటను చాలా మెరుగుపర్చుకున్నాడు. తొలుత అతను భయపడేవాడు. ఇప్పుడు అతను బాధ్యతగా బ్యాటింగ్ చేస్తూ బ్యాటింగ్ లైనప్ కు మూలస్థంభంగా ఉండటం సంతోషంగా ఉందని స్లైరిస్ అన్నారు.
2022 ఐపీఎల్ వేలానికి ముందు యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టులో ఆడాడు. తాజా ఐపీఎల్ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడుతున్నాడు. ఈ సీజన్ లో మొత్తం 16 మ్యాచ్ లు ఆడిన గిల్ మూడు సెంచరీలు, నాలుగు అర్థ సెంచరీలు చేశాడు. టోర్నీలో ఇప్పటి వరకు 78 ఫోర్లు, 33 సిక్సులు కొట్టడంతో పాటు 851 పరుగులతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా నిలిచాడు. శిఖర్ ధావన్, జోస్ బట్లర్, విరాట్ కోహ్లీ తరువాత ఒకే టోర్నీలో వరుసగా రెండు సెంచరీలు కొట్టిన నాలుగో బ్యాటర్‌గా గిల్ ఘనత సాధించాడు.