India vs Australia Test: సమరం షురూ.. నేటినుంచి భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ ..
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియాజట్ల మధ్య అసలు సిసలైన సమరం నేటి నుంచి ప్రారంభమవుతుంది. బోర్డర్ - గవాస్కర్ టెస్ట్ ట్రోఫీలో భాగంగా ఇరు జట్లు నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనున్నాయి. తొలి టెస్ట్ ఇవాళ ఉదయం 9.30 గంటల నుంచి నాగ్‌పూర్ వేదికగా ప్రారంభమవుతుంది.

India vs Australia Test: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య అసలు సిసలైన సమరం నేటి నుంచి ప్రారంభమవుతుంది. బోర్డర్ – గవాస్కర్ టెస్ట్ ట్రోఫీలో భాగంగా ఇరు జట్లు నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనున్నాయి. తొలి టెస్ట్ ఇవాళ ఉదయం 9.30 గంటల నుంచి నాగ్‌పూర్ వేదికగా ప్రారంభమవుతుంది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్, ఐసీసీ ర్యాంకింగ్స్ పరంగా ఈ సిరీస్ టీమిండియాకు చాలా కీలకం. ఈ సిరీస్‌కు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. గత కొన్నేళ్లుగా ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్ లో టీమిండియా ఆధిపత్యం చెలాయిస్తోంది. ఆస్ట్రేలియా జట్టు చివరి సారిగా 2014లో స్వదేశంలో భారత జట్టుపై టెస్టు సిరీస్ గెలుచుకుంది.
2018-19, 2020-21లో స్వదేశంలో జరిగిన రెండు సిరీస్‌లలో భారత్ చేతిలో ఆస్ట్రేలియా ఓటమిపాలైంది. ఈ సారి సిరీస్ ను కైవసం చేసుకొని ప్రతీకారం తీర్చుకొనేందుకు కంగారు జట్టు సిద్ధమైంది. భారత్ సిరీస్ విజయం యాషెస్ కన్నా ఎక్కువ అని ఇప్పటికే స్టీవ్ స్మిత్ చెప్పాడు. అయితే, ఓవరాల్ టెస్ట్ రికార్డులో భారత్ పై ఆస్ట్రేలియా జట్టుదే పైచేయిగా ఉంది. ఇరు జట్ల మధ్య మొత్తం 102 టెస్టు మ్యాచ్ లు జరగ్గా.. భారత జట్టు 30, ఆస్ట్రేలియా 43 మ్యాచ్ లలో విజయం సాధించాయి. 28 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.
నేడు జరిగే మ్యాచ్‌లో పిచ్ స్పిన్‌కు అనుకూలించనుంది. రెండు జట్ల స్పిన్నర్లే మ్యాచ్ గమనాన్ని నిర్దేశించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా మాజీలు పలువురు నాగ్‌పూర్ పిచ్‌ను భారత్ తమకు అనుకూలంగా మార్చుకుందని ఆరోపణలు గుప్పించారు. అయితే, ఆస్ట్రేలియాసైతం స్పిన్నర్లపైనే భారం వేయనుంది. టీమిండియా తరపున తొలి టెస్టుకు ముగ్గురు స్పిన్నర్లు బరిలోకి దిగే అవకాశం ఉంది. అశ్విన్, రవీంద్ర జడేజా తుది జట్టులో చోటుదక్కించుకోవటం ఖాయంగా కనిపిస్తున్నా.. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్‌లలో ఒకరు తుదిజట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. అయితే, స్పిన్ ను దీటుగా ఎదుర్కొనేందుకు కంగారు బ్యాటర్లు సిద్ధమయ్యారు. ఖవాజా, స్మిత్, లబుషేన్, వార్నర్ స్పిన్‌ను సమర్థవంతంగా ఎదుర్కోగల సత్తాఉన్న బ్యాటర్లు. ఇక ఆస్ట్రేలియా జట్టు ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. లైయన్ తో ఆస్టన్ అగర్ స్పిన్ బాధ్యతలు పంచుకొనే అవకాశం ఉంది. మొత్తానికి ఇరు జట్ల మధ్య నేడు ప్రారంభమయ్యే తొలి టెస్టు మ్యాచ్ క్రికెట్ ప్రేక్షకులకు కనులవిందు చేయటం ఖాయంగా కనిపిస్తోంది.
తుది జట్లు అంచనా …
టీమిండియా : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్/రాహుల్, పుజారా, కోహ్లి, జడేజా, శుభ్‌మన్ గిల్/సూర్యకుమార్, కేఎస్ భరత్, అశ్విన్, అక్షర్ పటేల్/కుల్‌దీప్, షమి, సిరాజ్
ఆస్ట్రేలియా : వార్నర్, ఖవాజా, లబుషేన్, స్మిత్, ట్రావిస్ హెడ్, హ్యాండ్స్ కాంబ్, కేరీ, కమిన్స్, అగర్, లైయర్, స్కాట్ జోలాండ్