హైదరాబాద్ ను వీడని వాన..జలదిగ్భందనంలో 200 కాలనీలు

  • Published By: madhu ,Published On : October 21, 2020 / 07:04 AM IST
హైదరాబాద్ ను వీడని వాన..జలదిగ్భందనంలో 200 కాలనీలు

200-colonies-in-hyderabad-due-to-heavy-rains-and-floods : రాజధాని హైదరాబాద్‌ను వాన వదలడం లేదు. కొద్దిగా తెరిపినిచ్చి.. ఎండకాసిందన్న సంతోషం కాస్తయినా మిగలకుండా మాయదారి వాన మళ్లీ విరుచుకుపడుతోంది. మంగళవారం కూడా భాగ్యనగరంలో జోరువాన కురిసింది. దీంతో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. వరద నుంచి కాస్త తేరుకుంటున్న కాలనీల్లోకి మళ్లీ నీళ్లొచ్చాయి.



ఇప్పటికే వరదలో ఉన్న కాలనీలు మరింత మునిగాయి. మరో మూడు రోజులపాటు నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు… నగరవాసులను బెంబేలెత్తిస్తున్నాయి. ఇటీవలీ వర్ష బీభత్సానికి నీట మునిగిన సుమారు 200 కాలనీలు ఇంకా వరద నీటిలోనే నానుతున్నాయి.



వరద తగ్గుముఖం పట్టినా 100పైగా కాల నీలు ఇంకా పూర్తిస్థాయిలో తేరుకోలేదు. వరదకు రోడ్లు దెబ్బతిని గుంతలమయం అవగా, వీధులన్నీ బురదతో నిండిపోయాయి. వారమైనా విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించకపోవడంతో పలుకాలనీలు, బస్తీలు అంధకారంలోనే మగ్గుతున్నా యి. కాలనీల ముంపు బాధితులు గత వారం రోజుల నుంచి తిండి, మంచినీళ్ల కోసం తల్లడిల్లుతున్నారు.



తెలంగాణలో అత్యధికంగా వనపర్తి జిల్లా ఘన్‌పూర్‌లో వర్షపాతం నమోదైంది. ఇక్కడ 6.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఆ తర్వాత యాదాద్రి భువనగిరి జిల్లా గుండాలలో 5.5 సెంటీమీటర్ల వర్షం పడింది. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా కీసరలో 5 సెంటీమీటర్ల వర్షం, రంగారెడ్డి జిల్లా మంచాలలో 4.6 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక నారాయణపేట జిల్లా మాగనూర్‌లో 4.2 సెంటీమీటర్ల వర్షం కురింది.