పెన్షన్ కోసం వెళ్లిన వారిలో 92మందికి కరోనా

  • Published By: naveen ,Published On : August 26, 2020 / 09:08 AM IST
పెన్షన్ కోసం వెళ్లిన వారిలో 92మందికి కరోనా

వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలోని పెద్దదగడలో కరోనా వైరస్ కలకలం రేపింది. పెన్షన్ కోసం వెళ్లిన వృద్దులు, వికలాంగులు కరోనా బారిన పడ్డారు. ఏకంగా 92 మందికి వైరస్ సోకింది. 1,400 మంది జనాభా ఉన్న పెద్దదగడ గ్రామంలో 100కు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో ఊరు ఊరంతా కంటెయిన్ మెంట్ జోన్ గా మారిపోయింది. పెద్దదగడ ఇప్పుడు కరోనా హాట్ స్పాట్ గా మారింది. కాగా, వైరస్ బారిన పడిన వారి వల్ల కుటుంబసభ్యులు ఎఫెక్ట్ అవుతారేమోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

పెన్షన్ పంపిణీ చేసిన వ్యక్తికి కొవిడ్:
ఆగస్టు నెల మొదటి వారంలో వృద్ధులు, వికలాంగులకు పోస్టాఫీస్‌ ఉద్యోగి పెన్షన్లు పంపిణీ చేశాడు. ఈ మధ్య ఉద్యోగికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో పెన్షన్ల కోసం క్యూలో నిల్చున్న వారంతా టెస్టులు చేయించుకోగా, వారిలో 92మందికి కొవిడ్ నిర్ధారణ అయ్యింది. పెన్షన్ల పంపిణీ సమయంలో అందరూ లైన్‌లో నిల్చోవటంతో వైరస్ సోకిందని అనుమానిస్తున్నారు. కాగా, ఉద్యోగి వల్ల వృద్ధులకు వైరస్ వచ్చిందా.. వీరి నుండి ఉద్యోగికి సోకిందా అనేది తెలియటం లేదు. ఆగస్టు 20న కరోనా లక్షణాలు చాలామందిలో కనిపించడంతో వీపనగండ్ల ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు. దీంతో కరోనా విషయం వెలుగుచూసింది. 1400 మంది జానాభా ఉన్న ఆ గ్రామంలో ఇప్పుడు కరోనా కేసుల సంఖ్య 102కు చేరింది.

ఇళ్లలోనే ఉంచి చికిత్స:
గ్రామంలో 100 మందికిపైగా కరోనా బారిన పడటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. అందరినీ ఇళ్లలోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. జిల్లా యంత్రాంగం మంగళవారం(ఆగస్టు 25,2020) గ్రామంలో ప్రత్యేక క్యాంప్ నిర్వహించింది. గ్రామాన్ని కంటెయిన్ మెంట్ జోన్ గా ప్రకటించి రాకపోకలపై ఆంక్షలు విధించారు అధికారులు. పెన్షన్ పంపిణీ సమయంలోనే కరోనా వ్యాప్తి చెందినట్లు అనుమానిస్తున్నామని జిల్లా వైద్యాధికారి చెప్పారు. ఎవరి పరిస్థితి ప్రమాదకరంగా లేదని, ఒకవేళ సీరియస్ అయితే మహబూబ్ నగర్ లోని ఐసోలేషన్ సెంటర్ కు తరలిస్తామని చెప్పారు.

తెలంగాణలో కరోనా విజృంభణ, కొత్తగా 2వేల 579 కేసులు:
తెలంగాణ కరోనా కలకలం కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2వేల 579 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య లక్ష 8వేల 670కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం(ఆగస్టు 25,2020) ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. ఒక్కరోజే కరోనాతో 9 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 770 కి చేరింది. ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 84వేల 163కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 23వేల 737కి చేరింది. ఇప్పటివరకు తెలంగాణలో 10లక్షల 21వేల 054 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. తెలంగాణలో కొత్తగా 52వేల 933 టెస్టులు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 17వేల 226 కేసుల్లో ప్రజలు ఇళ్లలోనే ఉంటూ కరోనా ట్రీట్‌మెంట్ పొందుతున్నారు.

తెలంగాణలో ఇద్దరికి రెండోసారి కరోనా పాజిటివ్:
ఒకసారి కరోనా వస్తే మళ్లీ రాదనే భ్రమల నుంచి బయటపడాలంటున్నారు డాక్టర్లు. ఎందుకంటే ఒకసారి వైరస్ సోకిన ఇద్దరికి మరోసారి కరోనా పాజిటివ్ వచ్చిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోనే చోటు చేసుకుంది. రాష్ట్రంలో ఇప్పటికే లక్షకు పైగా కేసులు నమోదు కాగా అందులో ఇద్దరికి రెండోసారి కరోనా వైరస్ సోకినట్టు గుర్తించారు. దీంతో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. అయితే మొదటిసారి వచ్చినప్పుడు ఉన్నంత ప్రభావం రెండవసారి వచ్చినప్పుడు లేదని వారు వెల్లడించారు.


https://10tv.in/telangana-man-tested-covid-postive-second-time/
యాంటీబాడీలు ఎక్కువగా ఉత్పత్తి కాని వారిలో రెండోసారి కరోనా:
అయినప్పటికీ రెండోసారి కూడా కరోనా సోకే అవకాశం ఉన్నందున ఇప్పటివరకు ఈ వైరస్ సోకని వారితో పాటు కోలుకున్న వారు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కరోనా వ్యాధి నుంచి కోలుకున్నప్పటికీ ఎవరిలో అయితే యాంటీబాడీలు ఎక్కువగా ఉత్పత్తి కావడం లేదో అలాంటి వారికి మళ్లీ వచ్చే అవకాశముందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. ప్రభుత్వం అన్నిరకాల సదుపాయాలను కల్పించేందుకు సిద్ధంగా ఉందన్నారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.