Doctor became Farmer: వృత్తి రీత్యా డాక్టర్.. ప్రజల కోసం ఫార్మర్

హనుమకొండ జిల్లాలోని భీమదేవరపల్లి మండలం ములుకనూరు గ్రామానికి చెందిన సుధాకర్ 20 ఏళ్లుగా డాక్టర్ గా సేవలందిస్తున్నారు.

10TV Telugu News

Doctor became Farmer: చదివింది.. చేసేది.. డాక్టర్ వృత్తే అయినా రైతుగా మారాడు. అనారోగ్య సమస్యలకు అసలు మూలం రసాయన ఎరువులు వాడే వ్యవసాయమే అని తెలుసుకుని వరితో పాటు మొదలైన పంటలు సాగు చేస్తున్నారు. వ్యాధులకు చికిత్స చేస్తూనే… అసలు వ్యాధులు రాకుండా ఉండాలంటే చేయాల్సిన పని గురించి చెప్తున్నారు డాక్టర్ తిప్పని సుధాకర్.

హనుమకొండ జిల్లాలోని భీమదేవరపల్లి మండలం ములుకనూరు గ్రామానికి చెందిన సుధాకర్ 20 ఏళ్లుగా డాక్టర్ గా సేవలందిస్తున్నారు. ఎంబీబీఎస్‌ తర్వాత, ములుకనూరులో నర్సింగ్‌ హోమ్‌ ప్రారంభించారు. రోగులకు వైద్యం అందించడంతో పాటు ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తుంటారు. వ్యవసాయంలో మోతాదుకు మించి రసాయన మందులు వాడటమే కారణమని తెలుసుకున్నారు. ‘సేంద్రియ వ్యవసాయం’తోనే ఈ సమస్యను నివారించగలమని నమ్మి స్వయంగా రైతు అవతారమెత్తారు.

ఎల్కతుర్తి మండలం ఇందిరానగర్‌లో పదెకరాల భూమిని కొనుగోలు చేసి, సేంద్రియ సాగును ప్రారంభించారు. వరి, కూరగాయలతోపాటు పండ్లతోటల పెంపకాన్నీ చేపట్టారు. టమాట, బెండ, గోరుచిక్కుడు, మిర్చి, పెసర, కంది, వేరుశెనగ తదితర పంటలను పండిస్తున్నారు. సీతాఫలం, మామిడి, రేగు, పొప్పడి, జామ, నిమ్మ, దానిమ్మ మొక్కలను సైతం రసాయన మందులు లేకుండా పండిస్తున్నారు. ఇందుకోసం మూడు ఆవులు, రెండు బర్రెలను పెంచుతూ.. వ్యవసాయ క్షేత్రంలోనే సేంద్రియ ఎరువులను తయారు చేసుకొంటున్నారు.

…………………………….: ఎన్నేళ్లుగానో ఎదురుచూస్తున్న కల ఫలించింది

వడ్లను ఇక్కడే బియ్యంగా మార్చి.. మార్కెట్‌కు తరలిస్తున్నారు. బియ్యాన్ని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై నివాసానికీ సరఫరా చేస్తున్నారు. ఫామ్‌లోనే వేరుశెనగ నుంచి నూనె తీసే యంత్రాన్నీ ఏర్పాటు చేశారు. తన ఉత్పత్తులను తానే ప్రాసెసింగ్‌ చేసి మార్కెటింగ్‌ చేస్తున్నారు.

‘ఆరోగ్యంగా బతికేందుకు ప్రకృతి అన్నీ ఇచ్చింది. దానికి విరుద్ధంగా వెళ్తూ కష్టాలను కొని తెచ్చుకుంటున్నాం. ముందుతరాల జీవన విధానానికి చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ఆధునిక వ్యవసాయం పేరుతో విచ్చలవిడిగా రసాయన మందులు వాడటం వల్లే రోగాలు వస్తున్నాయి. సేంద్రియ ఉత్పత్తులు తింటే వ్యాధుల తాకిడి తక్కువ. ప్రభుత్వ సాయం, సబ్సిడీలతోపాటు స్వతహాగా అందరూ కష్టపడాలి. ఇష్టంగా చేస్తే వ్యవసాయంలో మెరుగైన ఫలితం కనిపిస్తుంది’ అంటున్నారు డాక్టర్‌ సుధాకర్‌.

×