Hyderabad : బాబోయ్.. పక్కకు ఒరిగిన నిర్మాణంలో ఉన్న నాలుగంతస్తుల భవనం, భయాందోళనలో జనం
ఆ ప్రాంతంవైపు ఎవరూ రాకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు బహదూర్ పుర పోలీసులు. Hyderabad - Building To Collapse

Hyderabad - Building To Collapse
Hyderabad – Building To Collapse : హైదరాబాద్ బహదూర్ పుర హౌసింగ్ బోర్డు కాలనీలో నిర్మాణంలో ఉన్న నాలుగంతస్తుల భవనం పక్కకు ఒరిగింది. దీంతో ఎప్పుడే ఏం జరుగుతుందోనని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. దీనిపై సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని భవనాన్ని పరిశీలించారు. ముందు జాగ్రత్తగా ఆ భవనం చుట్టు పక్కల నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయించారు.
ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ఈ భవనాన్ని అక్రమంగా నిర్మిస్తున్నారని బల్దియా అధికారులు చెబుతున్నారు. రెండు అంతస్తులకు అనుమతి తీసుకుని నాలుగంతస్తులు నిర్మిస్తున్నట్లు చెప్పారు. చుట్టుపక్కల భవనాలకు ఎలాంటి నష్టం జరక్కుండా కూల్చివేత ప్రక్రియ జరుగుతుందని అధికారులు చెప్పారు. ఈ క్రమంలోనే ఆ ప్రాంతంవైపు ఎవరూ రాకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు బహదూర్ పుర పోలీసులు.
నిర్మాణంలో ఉన్న భవనం పక్కకు ఒరగడంతో దాన్ని చుట్టుపక్కల ఇళ్లల్లో ఉన్న వారు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడేం జరుగుతుందోనని కంగారు పడుతున్నారు. ఆ భవనం కూలి పక్క భవనాలపై ఎలాంటి ఎఫెక్ట్ చూసిస్తుందోనని వారంతా భయం భయంగా ఉన్నారు.(Hyderabad)
పక్కకు ఒరిగిన నిర్మాణంలో ఉన్న భవనం ప్రమాదకరంగా మారింది. దాంతో ఆ బిల్డింగ్ ను కూల్చివేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. గతంలో డెక్కన్ మాల్ ను కూల్చిన మాలిక్ ట్రేడింగ్ డెమాలిష్ అండ్ కంపెనీకే ఈ బిల్డింగ్ ను కూడా కూల్చే బాధ్యత అప్పగించారు. ఈ భవనం సెల్లార్ ప్లస్ నాలుగు ఫ్లోర్లుగా నిర్మిస్తున్నారు. నిజానికి కేవలం రెండు అంతస్తుల వరకే నిర్మాణానికి వారికి పర్మిషన్ ఉంది. కానీ, నిబంధనలకు విరుద్ధంగా అదనంగా రెండు అంతస్తులు నిర్మించారు. నిర్మాణంలో లోపం కారణంగా ఆ భవనం ఒక పక్కకు ఒరిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ నిర్మాణాన్ని ఇలానే వదిలేస్తే ప్రమాదకరంగా మారొచ్చని, పక్కనే ఉన్న భవనాలపై కుప్పకూలే డేంజర్ ఉందని, అందుకే ఒరిగిన భవనాన్ని కూల్చేయాలని అధికారులు నిర్ణయించారు.
నెల రోజులు క్రితమే ఈ భవనానికి సంబంధించి అధికారులకు ఫిర్యాదులు అందాయి. అయితే, ఎలాగో అలా బిల్డింగ్ ను కాపాడుకునే ప్రయత్నం చేశారు. కానీ, ప్రయోజనం లేకపోయింది. ఒక్కసారిగా భనవం ఒరిగిపోయింది. జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం అయ్యారు. అక్కడ డీఆర్ఎఫ్ సిబ్బందిని నియమించారు. ఎవరినీ ఆ బిల్డింగ్ దగ్గరికి రానివ్వకుండా చూసుకుంటున్నారు. రాత్రి 10 గంటల తర్వాత ఆ బిల్డింగ్ ను కూల్చేందుకు వాహనం చేరుకోనుందని సమాచారం. డెక్కన్ మాల్ ను కూల్చిన భారీ యంత్రంతోనే ఈ భవనాన్ని కూడా కూల్చాలని నిర్ణయించారు.
Also Read..Madanlal : మహిళతో మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ సన్నిహితంగా ఉన్న ఫొటోలు వైరల్
ఈ భవనం కూల్చేందుకు 27లక్షలు ఖర్చు కానుంది. ఆ ఖర్చంతా కూడా భవన యజమానే భరించాల్సి ఉంటుంది. ఇప్పటికే కూల్చివేత పనులు చేసే కంపెనీకి 7లక్షలు చెల్లించినట్లు తెలుస్తోంది. పని ప్రారంభమైన తర్వాత మరో 15లక్షలు, పని పూర్తయ్యాక ఇంకో 5లక్షలు డెమాలిషన్ కంపెనీకి పూర్తిగా చెల్లించాలని భవన యజమానికి అధికారులు ఆదేశాలు ఇచ్చారు. ఈ భవనాన్ని పూర్తిగా కూల్చేందుకు 24 నుంచి 48 గంటల వరకు సమయం పట్టే అవకాశం ఉంది. పక్కకు ఒరిగిన భవనం పక్కనే ఇళ్లు ఉండటం, అక్కడ రోడ్డు చాలా చిన్నగా ఉండటం కారణంగా భవనం కూల్చివేత పనులు ఆలస్యం కానున్నాయి.