ఎస్‌ఆర్ఎస్పీ కాల్వలో కారు పడిన ఘటన.. ముగ్గురు మృతి, డ్రైవర్ క్షేమం

ఎస్‌ఆర్ఎస్పీ కాల్వలో కారు పడిన ఘటన.. ముగ్గురు మృతి, డ్రైవర్ క్షేమం

car crash in SRSP canal : వరంగల్ జిల్లా ఎస్‌ఆర్ఎస్పీ కాల్వలో కారు పడిన ఘటనలో మృతుల సంఖ్య మూడుకు పెరిగింది. మరొకరు ప్రాణాలతో బయటపడ్డారు. ఉదయం ఎస్‌ఆర్ఎస్పీ కాలువలోకి కారు దూసుకుపోయింది. వరంగల్ నుంచి తొర్రూరు వెళ్తుండగా… పర్వతగిరి మండలం కొంకపాక శివారులో ఎస్‌ఆర్‌ఎస్పీ కాల్వలోకి కారు వేగంగా దూసుకెళ్లింది.

కాల్వ లోతు ఎక్కువగా ఉండటంతో… కారులో ఉన్న వారు త్వరగా బయటకు రాలేక పోయారు. కారు దాదాపు మునిగిపోయిన దశలో.. ముగ్గురు బయటపడ్డారు. ఒకరు కారు ముందు సీటులోనే ఉండిపోయారు. కాల్వ లోతు ఎక్కువగా ఉండడం, పట్టుకునేందుకు ఆధారం లేకపోవడంతో.. అందరూ చూస్తుండగానే నీటిలో మునిగిపోయారు.

డ్రైవర్‌కు ఈత రావడంతో పాటు.. స్థానికులు దగ్గర్లోనే ఉండటంతో… డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డారు. తాళ్ల సహాయంతో అతన్ని రక్షించారు. కారు గ్లాస్ పగులగొట్టుకుని డ్రైవర్ ఈదుకుంటూ.. బయటకు వచ్చాడు. అటుగా పొలం పనులకు వెళ్తున్న గిరిజనులు చూసి హుటాహుటిన నీటిలోకి దూకారు. ఈలోగా ఈదుకుంటూ కొంత దూరం వచ్చిన డ్రైవర్‌ను వాళ్లు కాపాడారు. మళ్లీ నీటిలోకి వెళ్లేలోగా ఇద్దరు మృతి చెందారు.

వినాయక ట్రేడర్స్ శ్రీధర్ నేతృత్వంలో ఫర్టిలైజర్ ప్రమోషన్ కోసం వంకపాక, పర్వతగిరి ప్రాంతాల్లో ప్రమోషన్ కోసం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఉపాధ్యాయురాలు రేణుక లిఫ్ట్ అడిగి కారులో వెళ్లింది. రేణుక..వరంగల్ రంగసాయిపేటకు చెందిన ఉపాధ్యాయురాలు.

ఎస్‌ఆర్‌ఎస్పీ కాల్వలో నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో పాటు..మహిళా టీచర్‌ రేణుకకు ఈత రాకపోవడంతో… కాల్వలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన మరో ఇద్దరిలో ఒకరు వినాయట్రేడర్స్ ఓనర్ శ్రీధర్ గా గుర్తించారు. రెండు మృతదేహాలను స్థానికులు కనుగొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల్లో ఇద్దరు గుంటూరుపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగులుగా గుర్తించారు.