కాంగ్రెస్ ఎమ్మెల్సీ టికెట్ కోసం 40మంది పోటీ, తనకే దక్కుతుందని చిన్నారెడ్డి ధీమా

chinna reddy: ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన జి.చిన్నారెడ్డి కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పని చేయడంతో పాటు పలుమార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. చాలా సీనియర్, సౌమ్యుడిగా పేరొందిన చిన్నారెడ్డి.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత సైలెంట్‌గా వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన వ్యక్తి ఒక్కసారిగా గాంధీ భవన్‌లో చక్కర్లు కొట్టడం మొదలుపెట్టారు. త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలవాలని ఉవ్విళ్లూరుతున్నారని అంటున్నారు.
ఈసారి కాంగ్రెస్ ఎమ్మెల్సీ టికెట్ కోసం పోటీ బాగా పెరిగిపోయింది. కరీంనగర్-నిజామాబాద్-మెదక్ పట్టభద్రుల స్థానం నుంచి టి.జీవన్‌రెడ్డి గెలుపొందడంతో.. కాంగ్రెస్ నేతలందరికీ ఆశలు చిగురించాయట. దీంతో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానం కోసం కాంగ్రెస్ తరఫున దాదాపు 40 మంది పోటీ పడుతున్నారని చెబుతున్నారు. ఈ స్థాయిలో ఒక్క టికెట్ కోసం పోటీ పడిన దాఖలాలు మునుపెన్నడూ లేవని అంటున్నారు. అయితే ఇంత మంది పోటీ పడుతున్నా తనకే టికెట్ దక్కుతుందని చిన్నారెడ్డి చెప్పుకుంటున్నారని టాక్.
మాణిక్కమ్ ఠాగూర్‌ను బాగా ప్రమోట్ చేసిన చిన్నారెడ్డి:
నలబై మంది పోటీ పడుతుంటే.. తనకే టిక్కెట్ దక్కుతుందని చిన్నారెడ్డి చెప్పుకోవడానికి ఒక రీజన్ చెబుతున్నారట. ఆయన గతంలో ఏఐసీసీ కార్యదర్శిగా.. తమిళనాడు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా పనిచేశారు. ఆ సందర్భంగా ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో సన్నిహిత సంబంధాలు నెరపడంతో పాటు.. మాణిక్కమ్ ఠాగూర్‌ను బాగా ప్రమోట్ చేశారని అంటున్నారు. సీన్ కట్ చేస్తే.. అదే ఠాగూర్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జ్‌గా వచ్చారు. సో పాత పరిచయాల నేపథ్యంలో ఠాగూర్ తనకే సపోర్ట్ చేస్తారని చిన్నారెడ్డి బలంగా నమ్ముతున్నారని చెబుతున్నారు. మొత్తం మీద చిన్నారెడ్డి అంచనాలు నిజమవుతాయా? లేదా తలకిందులవుతాయా అనేది తేలాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.