మక్కలు వద్దే వద్దు..యాసంగి పంటల సాగుపై సీఎం కేసీఆర్ సమీక్ష

  • Published By: madhu ,Published On : October 11, 2020 / 09:12 AM IST
మక్కలు వద్దే వద్దు..యాసంగి పంటల సాగుపై సీఎం కేసీఆర్ సమీక్ష

cm kcr review : మక్కలు వద్దే వద్దు..దేశంలో అవసరానికి మించి..భారీగా మొక్కజొన్న నిల్వలున్నాయని, యాసంగిలో మక్కలు సాగు చేస్తే..తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని వ్యవసాయ రంగ నిపుణులు హెచ్చరించారు. యాసంగి పంటల సాగుపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహంచారు.



ఈ సందర్భంగా నిపుణులు, అధికారులు సలహాలు, సూచనలు అందచేశారు. మక్కల సాగును నిపుణులు, అధికారులు తీవ్రంగా వ్యతిరేకించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో దేశంలో మొక్కజొన్న పంటకు కనీస మద్దతు ధర లభించే పరిస్థితులు లేకుండా పోయాయని ఈ సమావేశంలో నిపుణులు, అధికారులు వెల్లడించారు.



ఎవరైనా ఎక్కడైనా పంటను అమ్ము కోవచ్చు, కొనుక్కోవచ్చు అనే విధానంతో కేంద్రం కొత్త వ్యవసాయ చట్టాలను తెచ్చిందని, దీనికి తోడుగా విదేశాల నుంచి వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతిపై సుంకాలను పెద్ద ఎత్తున తగ్గించిందని… ఇవి పేద రైతు పాలిట శాపంగా పరిణమించాయని నిపుణులు అభిప్రాయపడ్డారు.



అంతర్జాతీయ విపణిలో అవసరాలకుపోను.. 28 కోట్ల మెట్రిక్‌ టన్నుల మక్కల నిల్వలున్నాయని, దేశంలో ప్రస్తుతం 2.42 కోట్ల మెట్రిక్‌ టన్నుల మక్కలు మాత్రమే సాలీనా అవసరం ఉంటుందన్నారు. 3 కోట్ల 53 లక్షల మెట్రిక్‌ టన్నుల లభ్యత ఉందని, 1 కోటీ 11 లక్షల మెట్రిక్‌ టన్నుల నిల్వలు అదనంగా ఉన్నాయన్నారు.



దేశవ్యాప్తంగా మరో 2.04 కోట్ల ఎకరాల్లో సాగవుతున్న పంటల నుంచి దాదాపు 4 కోట్ల 10 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడులు త్వరలోనే మార్కెట్లోకి రానున్నాయని తెలియజేశారు. దీంతో ఈ సంవత్సరానికే కాకుండా వచ్చే సంవత్సరానికి కూడా సరిపడా మక్కల స్టాకు ఉంటుందని అధికారులు తేల్చిచెప్పారు.



విదేశాలనుంచి అదనంగా మరో 5 లక్షల మెట్రిక్‌ టన్నుల మొక్కజొన్నలను దిగుమతి చేసుకోవడానికి కేంద్రం నిర్ణయించడం పరిస్థితులను మరింత దిగజార్చిందన్నారు. మక్కల మీద విధించే 50 శాతం దిగుమతి సుంకాన్ని 35 శాతం తగ్గించి కేవలం 15 శాతం పన్నుతో విదేశాల నుంచి మొక్కజొన్నలను దిగుమతి చేసుకునేందుకు కేంద్రం అనుమతించిందన్నారు. తద్వారా దేశంలోని, రాష్ట్రంలోని మొక్కజొన్న పంటకు కనీస మద్దతు ధర లభించక రైతు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయే ప్రమాదముందన్నారు.