తెలంగాణలో పీఆర్సీ రగడ.. వివాదాస్పదంగా త్రిసభ్య కమిటి నివేదిక

తెలంగాణలో పీఆర్సీ రగడ.. వివాదాస్పదంగా త్రిసభ్య కమిటి నివేదిక

controversial on The report given by the Committee on PRC  : తెలంగాణలో పీఆర్సీ రగడ మొదలైంది. పీఆర్సీపై నియమించిన కమిటీ ఇచ్చిన నివేదిక వివాదాస్పదంగా మారింది. ఏడున్నర శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలంటూ కమిటీ చేసిన సిఫార్సుపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. ఫిట్‌మెంట్‌పై త్వరలోనే సీఎం కేసీఆర్‌ను కలుస్తామని.. అక్కడే తేల్చుకుంటామంటున్నాయి ఉద్యోగ సంఘాలు.

తెలంగాణ మొదటి పీఆర్సీ కమిటీ రిపోర్ట్‌ వివాదాస్పదమైంది. బిశ్వాల్‌ కమిటీ ఇచ్చిన నివేదిక, సిఫార్సులపై ఉద్యోగ సంఘాల్లో ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. పీఆర్సీపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన బిశ్వాల్‌ కమిటీ డిసెంబర్‌ 31న ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. 31 నెలలపాటు అధ్యయనం చేసిన బిశ్వాల్‌ కమిటీ.. ఉద్యోగులకు 7.5శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వవచ్చని ప్రభుత్వానికి రికమండ్‌ చేసింది. ఈ సిఫార్సే ఇప్పుడు వివాదానికి ఆజ్యం పోసింది.

పీఆర్సీ కమిటీ నివేదిక ముందే లీక్‌ అయ్యింది. ఉద్యోగులకు ఈదఫా 7.5శాతం ఫిట్‌మెంట్‌ మాత్రమే ఇవ్వాలని కమిటీ సిఫార్సు చేసినట్టు తెలుసుకున్న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు బీఆర్కే భవన్‌ ముందు ఆందోళనకు దిగారు. పీఆర్సీ నివేదిక ప్రతులను దహనం చేశారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్‌ చేశారు. మరోవైపు పీఆర్సీ రిపోర్ట్‌ లీక్‌ అవ్వడంపై ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది. అంతేకాదు.. విచారణకు ఆదేశించింది.

సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ టీఎన్జీవో, టీజీవో ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాలకు పీఆర్సీ నివేదికను అందజేశారు. త్రిసభ్య కమిటీ, బిశ్వాల్‌ నివేదికపై ఉద్యోగ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. కరోనా , ఆర్థికమాంద్యం ఉన్న నేపథ్యంలో 10వ పీఆర్సీ సందర్భంగా ఇచ్చినట్టుగానే ఈ సారి కూడా ఫిట్‌మెంట్‌ను ఇవ్వాలని కోరారు. సీఎం కేసీఆర్‌కు ఇదే ప్రతిపాదన పంపాలని విన్నవించారు. కనీస వేతనం 24వేలకు పెంచాలని కోరారు. హెచ్‌ఆర్‌ఏ తగ్గించడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.

పీఆర్సీ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని టీఎన్జీవో నేతలు తేల్చి చెప్పారు. తాము 63శాతం ఫిట్‌మెంట్‌ అడుగుతుంటే… పీఆర్సీ కమిటీ మాత్రం 7.5శాతం సిఫార్సు చేయడమేంటని మండిపడ్డారు. కష్టపడి పనిచేస్తున్నామని.. 63శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని సీఎస్‌ సోమేష్‌ కుమార్‌ను కోరారు. త్వరలోనే సీఎంను కలిసి తమ డిమాండ్స్‌ వినిపిస్తామన్నారు.

పీఆర్సీ కమిటీ ఏ సిఫార్సులు చేసినా.. అంతిమంగా నిర్ణయం తీసుకునేది సీఎం కేసీఆరేనన్నారు. తాము కేసీఆర్‌ వద్దే తేల్చుకుంటామని స్పష్టం చేశారు. మంత్రులు, ముఖ్యమంత్రిని కలసి ఆమోదయోగ్యమైన పీఆర్సీని సాధిస్తామని అన్నారు. మరో రెండు రోజులపాటు త్రిసభ్య కమిటీ ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను సేకరించాలని నిర్ణయించింది. మరికొన్ని సంఘాలతో భేటీ అయ్యి.. వారి అభిప్రాయాలు తీసుకోనుంది.