IT companiesలకు కరోన కష్టాలు..తడిసిమోపెడవుతున్న అద్దె ఖర్చులు

  • Published By: madhu ,Published On : July 15, 2020 / 09:32 AM IST
IT companiesలకు కరోన కష్టాలు..తడిసిమోపెడవుతున్న అద్దె ఖర్చులు

కరోనా ప్రాణాలు తీయడమే కాదు..అందర్నీ కష్టాలపాలు చేస్తోంది. దిక్కుమాలిన వైరస్ అంటూ శాపనార్థాలు పెడుతున్నారు. సామాన్యుడి నుంచి మొదలుకుని ప్రముఖులు ఆర్థికంగా కుదేలవుతున్నారు. ప్రధానంగా ఐటీ కంపెనీలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇవ్వడంతో పలు ఆఫీసులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఒక నెల కాదు..మూడు, నాలుగు నెలల నుంచి ఇదే పరిస్థితి ఉండడంతో..అద్దె ఖర్చులు భరించలేకపోతున్నాయి పలు కంపెనీలు. దీనికంటే తక్కువున్న భవంతుల్లోకి మారిపోతున్నారు.

ముందు మూడు, నాలుగు అంతస్థుల్లో ఉంటే..ఇప్పడు ఒకటి, రెండంతస్తుల్లో సరి పుచ్చుకుంటున్నారు. చైనా నుంచి వచ్చిన కరోన వైరస్ కారణంగా మార్చి నెలాఖరులో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఐటీ కంపెనీలు కొంతమంది ఉద్యోగులకు Work From Home అవకాశాన్ని కల్పించారు. లాక్ డౌన్ సడలింపులు ఇచ్చినా..వైరస్ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. చాల మంది వర్క్ ఫ్రమ్ హోమ్ కే మొగ్గు చూపుతున్నారు. ఉద్యోగులు కార్యాలయాలకు రాకపోతుండడంతో ఆఫీసులు ఖాళీగా ఉంటున్నాయి.

అద్దెలు మాత్రం చెల్లిస్తున్నారు. దీంతో పొదుపు సూత్రాలు పాటించాలని Software Company లు భావిస్తున్నాయి. వ్యాపారానికి భంగం వాటిల్లకుండా..ఇటు ఉద్యోగుల భద్రతకు నష్టం కలుగకుండా అధిక ఖర్చులు తగ్గించుకొనే పనిలో పడ్డాయి. నాలుగు ఫ్లోర్లు తీసుకున్న వారు రెండంతస్తులు చాలు అంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో 1500 వేల నుంచి 2 వేల వరకు ఐటీ కంపెనీలున్నాయి. దాదాపు 6 లక్షల మంది ఇక్కడ పనిచేస్తున్నారు. వీరిలో కొంతమందికి క్యాబ్ సర్వీసులు, ఇతరత్రా సౌకర్యాలు కల్పిస్తుంటాయి.

ప్రస్తుతం కరోనా కారణంగా..చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. దీంతో క్యాబ్ సర్వీసులు మూలకు పడ్డాయి. ఖర్చులు తగ్గించుకొనేందుకు కంపెనీలు మార్గాలు వెతుకుతున్నాయి. తక్కువ ఉన్న అద్దె గదుల్లోకి షిప్ట్ అవుతున్నారు. పెద్ద పెద్ద కంపెనీల పరిస్థితి అటు పెడితే..చిన్న కంపెనీలు మాత్రం తీవ్రంగా నష్టపోతున్నాయి. ప్రధానంగా స్టార్టప్ లకు కొంచెం కష్టకాలమని, పలు సంస్థలు కొన్ని మూతపడ్డాయని వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూడాల్సిందేనని, కిరాయిలు తగ్గించాలని కోరినా…యజమానులు అంగీకరించడం లేదంటున్నారు. తక్కువ విస్తీర్ణంలో సంస్థ కార్యకలాపాలు ప్రారంభించడం జరుగుతోందంటున్నారు.