Munugodu TRS Politics : మునుగోడు టీఆర్ఎస్ లో ముసలం..అసమ్మతి నేతలను బుజ్జగిస్తున్న మంత్రి జగదీశ్ రెడ్డి

మునుగోడు ఉప ఎన్నికల జరుగనున్న క్రమంలో మునుగోడు టీఆర్ఎస్ లో ముసలం పుట్టింది.టికెట్ కేటాయింపులో లుకలుకలు మొదలయ్యాయి. నేతల్లో అసమ్మతి మొదలైంది. దీంతో మంత్రి జగదీశ్ రెడ్డి నేతలను బుజ్జగించే పనిలో పడ్డారు.

Munugodu TRS Politics : మునుగోడు టీఆర్ఎస్ లో ముసలం..అసమ్మతి నేతలను బుజ్జగిస్తున్న మంత్రి జగదీశ్ రెడ్డి

Munugodu TRS Politics

Munugodu TRS Politics : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో సెగ రేపినప్పటినుంచి మునుగోడు రాజకీయాలు వేడెక్కాయి. పార్టీకి..ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయటంతో కాంగ్రెస్ లో రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ డిసైడ్ అయిపోయింది. ఉప ఎన్నిక ఖాయం అయిపోయింది. ఈక్రమంలో మునుగోడు టికెట్ కోసం అన్ని పార్టీలు కసరత్తులు మొదలుపెట్టాయి. టాకెట్ కోసం ఆయా పార్టీల నేతలు యత్నాలు చేస్తున్నారు. దీంట్లో భాగంగానే టీఆర్ఎస్ లో కూడా టికెట్ కోసం యత్నాలు కొనసాగుతున్న క్రమంలో మునుగోడు గులాబీ గూటిలో లుకలుకలు మొదలయ్యాయి.

ఉప ఎన్నిక ఖాయం అయిన క్రమంలో తప్పకుండా గెలవాలని టీఆర్ఎస్ భావిస్తోంది. మునుగోడులో గెలుపు మూడు పార్టీలకు చాలా కీలకంగా మారిన తరుణంలో సరైన అభ్యర్థిని నిలబెట్టి గెలవాలని టీఆర్ఎస్,కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఈక్రమంలో మునుగోడు టీఆర్ఎస్ లో ముసలం పుట్టింది. మునుగోడు మాజీ ఎమ్మెల్యే,నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్ చార్జి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇవ్వొద్దని ఆ నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు సీఎం కేసీఆర్ కు లేఖ రాయలని నిర్ణయించారు. ఈ క్రమంలో అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు మంత్రి జగదీశ్ రెడ్డి మునుగోడులో మకాం వేశారు. మునుగోడు నేతలతో సమావేశమయ్యారు. అసమ్మతి నేతలకు సర్ధిచెబుతున్నారు. కానీ కూసుకుంట్లకు మంత్రి జగదీశ్ రెడ్డి మద్దతు ఉందని స్థానికంగా ఉన్న సమస్యలను..ముఖ్యంగా కూసుకుంట్లతో తమకు ఉన్న ఇబ్బందులకు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని దాని కోసం సీఎం కేసీఆర్ కు లేఖ రాయాలని అసమ్మతి నేతలు నిర్ణయించారు.

కూసుకుంట్ల అభ్యర్థిత్వాన్ని పార్టీ పరిశీలించవద్దని స్థానిక నేతలు కోరుతున్నారు. ఈ అంశం మునుగోడు రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోంది. కూసుకుంట్ల ఎమ్మెల్యేగా పని చేసినన్నాళ్లూ సొంత పార్టీ ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా వ్యవహరించారని ఆరోపిస్తున్నారు. తమ మాట వినని వారిపై కూసుకుంట్ల పోలీసు కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని అసమ్మతి నేతలు వాపోతున్నారు. లోకల్ బాడీ నేతల కూసుకుంట్ల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. అలాంటి వ్యక్తికి పార్టీ టికెట్ ఇస్తే తాము మరో దారి చూసుకుంటామని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఒక వేళ కూసుకుంట్లను పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తే పెద్ద సంఖ్యలో ప్రజా ప్రతినిధులు, నాయకులు బీజేపీ లేదా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దంగా ఉన్నారనే సమాచారాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లగా గత నాలుగు రోజులుగా స్థానిక నేతలతో మంత్రి కేటీఆర్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

కాగా, రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళుతుండటంతో మునుగోడు బైపోల్ కు అన్ని పార్టీలు గట్టి ప్రయత్నమే చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీ ఎవరిని బరిలోకి దింపబోతోందనే ఉత్కంఠ సర్వత్రా ఉంది. గెలుపు గుర్రం కోసం అన్వేషిస్తున్న టీఆర్ఎస్ పార్టీ.. సామాజిక, ఆర్థిక పరంగా పలువురి పేర్లను పరిశీలిస్తోంది. జరుగుతున్న ప్రచారం ప్రకారం మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, శాసన మండలి స్పీకర్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్, నల్గొండ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డి పేర్లు టీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటికే గుత్తా సుఖేందర్ రెడ్డి తనకు పోటీ చేసే ఆసక్తి లేదని ప్రకటించారు.

పీకే టీమ్ తో పాటు పలు ఏజెన్సీల ద్వారా అధినేత కేసీఆర్ సర్వేలు నిర్వహించే గెలుపు అవకాశాలు పుష్కలంగా ఉన్న అభ్యర్థి కోసం కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది. సర్వేల రిపోర్టులు ఎలా ఉన్నా సొంత పార్టీ ప్రజాప్రతినిధుల నుండి కూసుకుంట్ల అభ్యర్థిత్వానికి వ్యతిరేకత రావడంతో కేసీఆర్, కేటీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఉత్కంఠగా మారింది.