దుబ్బాక ఉపఎన్నిక ఎఫెక్ట్, అన్ని పార్టీల్లో అసమ్మతి కుంపట్లు

  • Published By: naveen ,Published On : October 17, 2020 / 05:33 PM IST
దుబ్బాక ఉపఎన్నిక ఎఫెక్ట్, అన్ని పార్టీల్లో అసమ్మతి కుంపట్లు

dubbaka bypolls effect: దుబ్బాక ఉపఎన్నిక అన్ని పార్టీల్లో అసమ్మతి కుంపట్లు రాజేసింది. అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేయడంతో అసలు మేటర్‌ బయటపడింది. ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశించిన నేతలు తమకు టికెట్‌ ఖరారు కాకపోవడంతో అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఒకపక్క అభ్యర్థులు ప్రచారాన్ని ప్రారంభించి ముందుకెళ్తుంటే.. అసమ్మతి నేతలను చల్లార్చేందుకు పార్టీ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు తాము గతంలో ఉన్న పార్టీకి దూరం కాగా.. మరికొందరు ఉన్న పార్టీ నుంచి జంపై పోయేందుకు అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు.

సీటు ఆశించి భంగపడ్డ వారు కోపంతో రగిలిపోతున్నారు:
అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సుజాత కూడవెల్లి రామలింగేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరి టికెట్‌ సంపాదించిన చెరుకు శ్రీనివాస్‌రెడ్డి కూడా ప్రచారాన్ని ప్రారంభించారు. ఇక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఎప్పటి నుంచో ప్రచారంలో బిజీగా ఉన్నారు. కాకపోతే ఈ మూడు పార్టీల్లో కూడా అసమ్మతి గళాలు వినిపిస్తున్నాయి. సీటు ఆశించి భంగపడ్డ వీరు కోపంతో రగిలిపోతూ స్వపక్షాన్ని ఏకిపారేస్తున్నారు.

రఘునందన్‌రావుకు మరోసారి టికెట్‌ ఇవ్వడంపై ఆగ్రహం:
బీజేపీ తరఫున వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన రఘునందన్‌రావుకు మరోసారి టికెట్‌ ఇవ్వడంపై ఆ పార్టీలో సీనియర్‌ నేతలు బాహాటంగానే అసంతృప్తిని వ్యక్తం చేశారు. తమకు సీటు కేటాయించాలంటూ తోట కమలాకర్‌రెడ్డి, దారం గురవారెడ్డి అధిష్టానాన్ని కోరారు. చివరకు పార్టీ అధిష్టానం రఘునందన్ రావునే ఖరారు చేయడంతో గురవారెడ్డి గుర్రుగా ఉన్నా పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ, కమలాకర్‌రెడ్డి మాత్రం ప్రెస్‌ మీట్‌ పెట్టి రఘునందన్ రావు అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకిస్తూ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

సడెన్ గా రఘునందన్ కు ఎదురు తిరిగిన కుడిభుజం:
ఇరవై ఏళ్లుగా పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉంటూ పార్టీకి కమిటెడ్‌గా పని చేసిన కమలాకర్.. మొన్నటి ఎన్నికల వరకూ రఘునందన్‌రావుకు కుడిభుజంగా వ్యవహరించారు. సడన్‌గా ఇప్పుడు వ్యతిరేకంగా విమర్శలు గుప్పించడంతో బీజేపీకి తలనొప్పిగా మారిందంటున్నారు. బీజేపీకి, రఘునందన్‌రావుకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తానని కూడా కమలాకర్‌రెడ్డి శపథం చేశారు. ఆయన తీరును సీరియస్‌గా తీసుకున్న అధిష్టానం సస్పెండ్‌ చేసింది. ఈ ప్రభావం తప్పకుండా పార్టీపై పడుతుందని అంచనాలు వేస్తున్నారు. అదే జరిగితే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీకి మరోసారి నిరాశ తప్పదని అంటున్నారు.

రగిలిపోతున్న కాంగ్రెస్ నేతలు:
ఇక కాంగ్రెస్ పార్టీలోకి చెరుకు శ్రీనివాస్‌రెడ్డిని ఆహ్వానించి, మరీ సీటు కేటాయించడంపై గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మద్దుల నాగేశ్వరరెడ్డి మండిపడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి 26,500 పైచిలుకు ఓట్లు సాధించిన విషయాన్ని పార్టీ ఎట్లా విస్మరించిందని తన సన్నిహితుల దగ్గర నాగేశ్వర్‌రెడ్డి వాపోతున్నారు. అదే స్థాయిలో వెంకట నర్సింహారెడ్డి కూడా రగిలిపోతున్నారు. వీరిద్దరూ కూడా కాంగ్రెస్‌కు షాకిస్తారనే టాక్‌ వినిపిస్తోంది. త్వరలో వీరిద్దరూ కారెక్కనున్నట్లు సమాచారం.

చెరుకు వెళ్లిపోవడమే మంచిదైంది:
టీఆర్ఎస్‌కు చెరుకు శ్రీనివాస్‌రెడ్డి ఝలక్ ఇస్తే.. టీఆర్ఎస్‌ పార్టీ లైట్‌ తీసుకుందంటున్నారు. పార్టీలో ఉన్నప్పటికీ ఆయన వల్ల ఇబ్బందులే తప్ప.. ప్రయోజనం లేదని భావించారని చెబుతున్నారు. పార్టీలో కోవర్టులా వ్యవహరించారని కేడర్‌ అంటోంది. ఈ సందర్భంలో ఆయన బయటకు వెళ్లిపోవడమే మంచిదైందని చెబుతున్నారు. ఆయన తప్ప వేరే నేతలు, కేడర్‌ టీఆర్ఎస్ నుంచి బయటకెళ్ళే పరిస్థితి లేదంటున్నారు. మంత్రి హరీశ్‌రావు అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ప్రతిపక్ష పార్టీల్లోని అసమ్మతిని టీఆర్ఎస్‌కు అనుకూలంగా మార్చుకునే పనిలో నిమగ్నమైపోయారు. ఈ నేపథ్యంలో ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారింది.