కంపు భరించలేకపోతున్నాం, మూసీలో ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్న వరద, ఇళ్లలోకి చేరిన మురికి నీరు

  • Published By: naveen ,Published On : October 14, 2020 / 12:36 PM IST
కంపు భరించలేకపోతున్నాం, మూసీలో ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్న వరద, ఇళ్లలోకి చేరిన మురికి నీరు

musi river: హైదరాబాద్‌లో మూసీ నదికి వరద పోటెత్తింది. ప్రమాదకరస్థాయిలో వరద నీరు ప్రవహిస్తోంది. మరోవైపు మూసీ నుంచి వరదనీరు కాలనీల వైపు ప్రవహిస్తోంది. మురికినీరంతా ఇళ్లల్లోకి చేరింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కంపును భరించలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారిపై రాకపోకలు బంద్:
హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారి మొత్తం ప్యాకప్ అయిపోయింది. హైవేపై తీవ్రస్థాయిలో వరదనీరు ప్రవహిస్తోంది. భారీగా పోటెత్తుతున్న వరదతో వాహనాలు ముందుకెళ్లలేని పరిస్థితి. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారిపై రాకపోకలు బంద్ అయ్యాయి. వరద ఉధృతికి పలుచోట్ల రహదారులు దెబ్బతిన్నాయి. శంషాబాద్‌ ఏరియా చాలా వరకు జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది.

భారీ వర్షాలకు హైదరాబాద్ నగరం అతలాకుతలమైంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. శంషాబాద్ గగన్‌పహాడ్ దగ్గర అప్పచెరువు తెగిపోవడంతో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే జాతీయ రహదారి పూర్తిగా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ఈ సమయంలో అక్కడ ప్రయాణిస్తున్న పలు కార్లు కూడా ధ్వంసమైనట్లు సమాచారం. ప్రజలు అధికారులకు సహకరించాలని, అప్రమత్తంగా ఉండాలని, ఇళ్ల నుంచి ఎవరూ బయటకురావద్దని సీపీ సజ్జనార్ కోరారు. ఎయిర్ పోర్టుకు, కర్నూలు వైపు వెళ్లే వారు ఓఆర్ఆర్ ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు.

చెరువుని తలపిస్తున్న దిల్ సుఖ్ నగర్, ఎటు చూసినా నీళ్లే:
దిల్‌షుఖ్‌నగర్‌లో ఎటు చూసినా వరద నీళ్లే. సరూర్‌నగర్‌ చెరువు పొంగి ప్రవహిస్తుండడంతో దిల్‌షుఖ్‌నగర్‌కు వరద పోటెత్తింది. దీంతో ఆ ప్రాంతమంతా చెరువును తలపిస్తోంది. సాయిబాబా టెంపుల్ ఎదురుగా భూమి కుంగిపోవడంతో అందులో ఆర్టీసీ బస్సు ఒరిగిపోయింది. దీంతో భారీగా ట్రాఫిక్ స్థంభించిపోయింది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మరోవైపు విజయవాడ నుంచి వస్తున్న బస్సులు, ఇతర వాహనాలు ఎల్బీనగర్‌కే పరిమితం చేశారు. వరద సహాయక చర్యలకు మాన్సూన్ ఎమర్జెన్సీ, డీఆర్‌ఎఫ్‌ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని అధికారులు విఙ్ఞప్తి చేస్తున్నాయి.