GHMC ఎన్నికలు ఓటర్ల జాబితా: చెక్ చేసుకోండి, పేరు లేని వారికి మరో అవకాశం

  • Published By: madhu ,Published On : November 14, 2020 / 06:51 AM IST
GHMC ఎన్నికలు ఓటర్ల జాబితా: చెక్ చేసుకోండి, పేరు లేని వారికి మరో అవకాశం

GHMC Election Voter List : గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఎన్నికల ప్రక్రియ వేగవంతమైంది. ఓటర్ల జాబితా కూడా వచ్చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ గ్రేటర్‌ హైదరాబాద్‌లో వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితాను కూడా ప్రకటించేసింది. నగరంలోని 30 సర్కిల్‌ కార్యాలయాలు, రెవెన్యూ ఆఫీస్‌లు, వార్డు కార్యాలయాల్లో ఓటర్ల జాబితాను సంబంధిత డిప్యూటీ కమిషనర్లు ప్రకటించారు. అంతేకాదు..ఈ జాబితాను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ వెబ్‌సైట్‌లోనూ ఉంచారు.

150 డివిజన్లు : – 
రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన ప్రకారం… GHMC లోని 150 డివిజన్లలో మొత్తం 74 లక్షల 4వేల 17మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 38 లక్షల 56 వేల 617మంది పురుష ఓటర్లుకాగా.. 35 లక్షల 46 వేల 731మంది మహిళ ఓటర్లు. మరో 669మంది ఇతర ఓటర్లు ఉన్నారు. మైలార్‌దేవులపల్లి వార్డు పరిధిలో అత్యధికంగా 79వేల 290 మంది ఓటర్లు ఉండగా.. అతి తక్కువగా రామచంద్రాపురం వార్డులో 27వేల 831మంది ఓటర్లు ఉన్నారు.
గ్రేటర్‌లో పోలింగ్‌ కేంద్రాలు కూడా ఫైనలైజ్‌ అయ్యాయి. 150 డివిజన్లకు మొత్తంగా 9వేల 248 పోలింగ్‌ కేంద్రాలను అధికారులు ఫైనల్‌ చేశారు.
కూకట్‌పల్లి సర్కిల్‌ పరిధిలో అత్యధికంగా 465 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. చందానర్‌ సర్కిల్‌ పరిధిలోని హఫీజ్‌పేట డివిజన్‌లో అత్యధికంగా 97 పోలింగ్‌ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. అతి తక్కువగా రామచంద్రాపురం డివిజన్‌లలో కేవలం 33 పోలింగ్‌ కేంద్రాలే ఉన్నాయి.

ఓటు నమోదుకు మరో అవకాశం : – 
రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన ఓటర్ల జాబితాలో ఓటు లేని వాళ్లకి… తమ ఓటు నమోదు చేసుకోవడానికి మరో అవకాశం కూడా ఇచ్చింది. ఓటర్ల జాబితాలో పేరులేని వారు ఫారం-6 ద్వారా సంబంధిత అసెంబ్లీ ఎలక్టోరల్ అధికారి దగ్గర దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేంత వరకు ఇందుకోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్నికల అధికారి తెలిపారు. పోలింగ్ స్టేషన్ల ముసాయిదా జాబితాపైన అభ్యంతరాలు, సలహాలు, సూచన్లను ఈ నెల 17 తేదీలోగా సమర్పించాల్సి ఉంటుంది. ఈ క్లెయిమ్‌లను పరిశీలించిన తర్వాత ఈనెల 21న సంబంధిత రిటర్నింగ్ అధికారులు తుది పోలింగ్ స్టేషన్ల జాబితా ప్రకటించనున్నారు.

రాజకీయ పార్టీల గెలుపు వ్యూహాలు : – 
మరోవైపు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు, వారిని బలపరిచే వ్యక్తుల అర్హతలను తెలియజేస్తూ రాష్ర్ట ఎన్నికల కమిషనర్ పార్థసారధి ప్రకటనను విడుదల చేశారు. బల్దియా ఎన్నికలలో బలపరిచే వ్యక్తి అభ్యర్థి పోటీ చేస్తున్న వార్డులో రిజిస్టర్ కాబడిన ఓటరై ఉండాలి. పోటీ చేస్తున్న అభ్యర్థి జీహెచ్ఎంసీ పరిధిలోని ఏదైనా వార్డునందు రిజిస్టర్ కాబడిన ఓటరుగా ఉండాలి. ఒక అభ్యర్థి ఒకటికంటే ఎక్కువ వార్డుల్లో నామినేషన్ దాఖలు చేయవచ్చు. కానీ అంతిమంగా ఒక్క వార్డులో మాత్రమే పోటీ చేయవలసి ఉంటుంది. మిగిలిన వార్డులలో అభ్యర్థిత్వాన్ని నిర్ణీత గడువులోగా ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. బల్దియా ఎన్నికల ప్రక్రియ వేగవంతం కావడంతో..రాజకీయ పార్టీలు గెలుపు వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రధాన పార్టీలు అభ్యర్థులపై ఫోకస్ పెట్టాయి.