తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త చిచ్చు..రెండు ఎమ్మెల్సీ స్థానాలకు 62 మంది పోటీ

తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త చిచ్చు..రెండు ఎమ్మెల్సీ స్థానాలకు 62 మంది పోటీ

Graduate MLC Election Fight in Congress : తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త చిచ్చు వచ్చి పడింది. ఈ చిచ్చు ఇప్పుడు నేతలను కలవరపాటుకు గురి చేస్తోందట. ఈ కొత్త సమస్య చినికిచినికి చివరకు ఎటు దారి తీస్తుందనేది కాంగ్రెస్ వర్గాలలో ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ ఏంటి..? కొత్తగా చిక్కులు రావడమేంటి.. ఇంతకీ కొత్త సమస్య ఏంటి..? కాంగ్రెస్ పార్టీలో.. అందులోనూ తెలంగాణ కాంగ్రెస్‌లో ఒకరిపై మరొకరికి గిట్టకపోవడం కామన్. పార్టీ వేదికల మీదే ఒకరిపైఒకరు బహిరంగ విమర్శలు చేసుకున్న సందర్భాలు బోలెడున్నాయి. ఒకరినొకరు దెబ్బ తీయడానికి కుట్రలు, కుతంత్రాలు వెరీ కామన్. ఇన్ని కామన్ సమస్యల మధ్య ఒక అంశం మాత్రం కాంగ్రెస్‌ను తీవ్ర కలవరపాటుకు గురి చేస్తోందట. అదేమంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక ఇంకా ఇప్పటికీ ఓ యుద్ధాన్ని తలపిస్తోంది.

ఈసారి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలో నిలిచేందుకు చాలామంది నేతలు క్యూ కట్టారు. రెండు స్థానాల నుంచి ఏకంగా 62 మంది పోటీ పడ్డారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల మధ్య మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ స్థానం నుంచి మాజీమంత్రి చిన్నా రెడ్డి, వరంగల్ – నల్లగొండ – ఖమ్మం స్థానం నుంచి మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌కు అవకాశం కల్పించారు. ఈ రెండు స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ శ్రేణుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహబూబ్‌నగర్ స్థానం నుంచి చివరి దాకా ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి గుర్రుగా ఉన్నారట. చిన్నారెడ్డికి మద్ధతు గా నిర్వహిస్తున్న.. సభలు, సమావేశాల్లో ఎక్కడ కూడా పాల్గొనడం లేదట. ఇదే స్థానం టిక్కెట్ ఆశించిన అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ వంటి నేతలు కూడా ఎక్కడా ప్రచారంలో పాల్గొనడం లేదనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది.

ఇక వరంగల్ – నల్లగొండ – ఖమ్మం స్థానం విషయంలో కూడా కాంగ్రెస్‌లో పొత్తు కుదరడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. జనరల్ స్థానం నుంచి ఒక ఎస్టీకి అవకాశం కల్పించామని చెబుతున్నా.. మరోవైపు అసంతృప్తి గళం కూడా వినిపిస్తోంది. కాంగ్రెస్ నిజంగా ఒక ఎస్టీకి ఇవ్వదలిస్తే.. గ్రాడ్యుయేట్ ఉన్న అభ్యర్థులు చాలామంది ఉన్నా వారిని పక్కన పెట్టి.. నాన్ గ్రాడ్యుయేట్ అభ్యర్థిని బరిలో నిలపడంలో మతలబేంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చివరి వరకు పోటీ పడిన బెల్లయ్య నాయక్ డాక్టరేట్ కలిగిన వ్యక్తి.. అతనికి ఇవ్వకుండా గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్ లేని వ్యక్తి రాములు నాయక్ ఎంపికపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. అంతేకాదు.. రాములు నాయక్‌కు ప్రచారం చేసేది లేదంటూ.. మానవతారాయ్ వంటి నేతలు దూరంగా ఉంటున్నారట.

ఇంకా అసలు విషయం ఏంటంటే.. చిన్నారెడ్డికి క్యాంపెయినింగ్‌ను ఎంపీ రేవంత్‌రెడ్డి పూర్తిగా తన భుజాలపై వేసుకోవడంతో.. మిగతా నేతలు ఇటువైపు కన్నెత్తి చూడటం లేదట. ఆఖరికి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కూడా ఇప్పటి వరకు మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ స్థానాలకు సంబంధించిన ఏ ఒక్క మీటింగ్‌లో పాల్గొనలేదనే చర్చ జరుగుతోంది. పీసీసీ చీఫ్ ఉత్తమ్.. కాన్సన్‌ట్రేషన్‌ అంతా రాములు నాయక్ మీదనే పెట్టారట. ఇక తటస్థంగా ఉండే నేతలు అటు ఇటూ పోకుండా సైలెంట్‌గా ఉండిపోతున్నారనే రట. మొత్తం మీద టీ.కాంగ్రెస్‌తో ఈ కొత్త చిచ్చు కలవరపాటుకు గురి చేస్తోందట. అత్త మీద కోపం దుత్త మీద అన్నట్లు.. నేతల మధ్య చిచ్చు.. అభ్యర్థులపై అన్నట్లుగా మారిందట. ఫైనల్‌గా ఈ కొత్త చిచ్చు చివరకు ఎటు దారి తీస్తుందనేది కాంగ్రెస్ వర్గాలలో హాట్ టాఫిక్‌గా మారింది.