రీజనల్ రింగ్ రోడ్‌ నిర్మాణానికి మరో ముందడుగు

తెలంగాణ రీజనల్ రింగ్ రోడ్‌ నిర్మాణానికి మరో ముందడుగు పడింది. ఇంతవరకు ప్రకటనలకే పరిమితమైన ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టు త్వరలోనే పట్టాలెక్కబోతోంది. కేంద్ర ప్రభుత్వం క్షేత్రస్థాయి సర్వేకి రంగం సిద్ధం చేసింది.

రీజనల్ రింగ్ రోడ్‌ నిర్మాణానికి మరో ముందడుగు

Regional Ring Road construction : తెలంగాణ రీజనల్ రింగ్ రోడ్‌ నిర్మాణానికి మరో ముందడుగు పడింది. ఇంతవరకు ప్రకటనలకే పరిమితమైన ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టు త్వరలోనే పట్టాలెక్కబోతోంది. కేంద్ర ప్రభుత్వం క్షేత్రస్థాయి సర్వేకి రంగం సిద్ధం చేసింది. బెంగళూరుకు చెందిన కన్సల్టేన్సీకి సర్వే పనులను చేపట్టనుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న రీజినల్ రింగ్ రోడ్‌ ప్రాజెక్ట్‌కి ఎట్టకేలకు మోక్షం లభించింది. ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టు కార్యరూపం దాల్చబోతోంది. ఈ రహదారికి కేంద్రం అధికారికంగా అనుమతి మంజూరు చేయబోతోంది. క్షేత్రస్థాయి సర్వేకి రంగం సిద్ధం చేస్తోంది. బెంగళూరుకు చెందిన ఫీడ్‌ బ్యాక్‌ బిజినెస్‌ కన్సల్టింగ్‌ సర్వీస్‌ తర్వలో సర్వే చేపట్టనుంది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ రీజినల్ రింగ్ రోడ్డుకు కావాల్సిన భూసేకరణ కసరత్తు ప్రారంభించబోతోంది.

రీజినల్ రింగ్ రోడ్‌ నిర్మాణానికి సంబంధించి జాతీయ రహదారుల విభాగం గతంలో కేంద్రానికి ప్రాథమిక అలైన్‌మెంట్‌ను సమర్పించింది. గూగుల్‌ మ్యాప్‌ ఆధారంగా ఏయే ప్రాంతాల నుంచి ఈ రోడ్ నిర్మాణం జరగనుందో ప్లాన్‌ రూపొందించింది. అప్పట్లోనే దానికి అక్షాంశ, రేఖాంశాలను ఫిక్స్‌ చేసింది. ఇప్పుడు ఆ రూట్‌లో భాగంగా ఏయే సర్వే నంబర్‌ భూముల నుంచి రోడ్‌ నిర్మాణం జరగనుందో క్షేత్రస్థాయిలో పర్యటించి మార్కింగ్‌ చేయనుంది.

అలైన్‌మెంట్‌లో 100 మీటర్ల వెడల్పులో భూ సేకరణ జరుగుతుంది. ఈ మొత్తం కసరత్తుకు సుమారు నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. 2013 చట్టం ప్రకారం భూసేకరణ జరుగనుంది. తొలి దశలో 158 కిలో మీటర్ల రోడ్‌ నిర్మాణానికి సంబంధించి దాదాపు 4 వేల 350 ఎకరాలు సేకరించాల్సి ఉంది. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులను క్రాస్‌ చేసే ప్రాంతాల్లో ప్రత్యేకంగా నిర్మించే క్లోవర్‌ లీవ్‌ ఇంటర్‌చేంజ్‌ జంక్షన్ల కోసం అదనంగా భూసేకరణ జరుగుతుంది.

తొలి దశ రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం సంగారెడ్డి సమీపంలోని పెద్దాపూర్ నుంచి శివంపేట, లింగోజీగూడ, తూప్రాన్, గజ్వేల్, జగదేవ్‌పూర్, ప్రజ్ఞాపూర్, ఎర్రవల్లి, మల్కాపూర్, రాయగిరి, ఎర్రబెల్లి, సంగెం, చౌటుప్పల్‌ వరకు సాగుతుంది. జగదేవ్‌పూర్‌-భువనగిరి మధ్య రెండు మార్గాలకు రూపకల్పన జరిగింది. భువనగిరి-ఆలేరు మధ్య జాతీయ రహదారిని దాటేలా ఓ మార్గం నిర్మాణం జరుగుతుంది. తుర్కపల్లి మీదుగా మరో రోడ్డు ప్రతిపాదన ఉంది.

ఇప్పుడు తుర్కపల్లి మీదుగా ప్రతిపాదించిన మార్గాన్ని ఖరారు చేసినట్లు తెలిస్తోంది. పీర్లపల్లి, తిరుమలాపురం, వాసాలమర్రి, తుర్కపల్లి మీదుగా ఉన్న ప్రస్తుత మార్గానికి చేరువగా ఈ రోడ్డు నిర్మాణం జరుగుతుంది. మరో వైపు రెండో దశలో ఆమన్‌గల్‌ నుంచి కంది వరకు 181.8 కి.మీ మేర నిర్మించాలని ప్రతిపాదించింది. సెకండ్‌ ఫేజ్‌కు త్వరలో అనుమతులు మంజూరు చేసే అవకాశం ఉంది. రీజనల్‌ రింగ్‌ రోడ్‌ను మూడు సంవత్సరాల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.