Telangana: తెలంగాణలోని పలు జిల్లాల్లో చోరీలు, రోడ్డు ప్రమాదాల ఘటనల వివరాలు ..

బంజారాహిల్స్‌లోని ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. తల్లి మృతితో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు.

Telangana: తెలంగాణలోని పలు జిల్లాల్లో చోరీలు, రోడ్డు ప్రమాదాల ఘటనల వివరాలు ..

CRIME NEWS

Road Accident: తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విషాధ ఘటనలు చోటు చేసుకున్నాయి. పలు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు జరగ్గా.. పలు ప్రాంతాల్లో చోరీ ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆయా ప్రాంతాల్లో ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాటి వివరాలను పరిశీలిస్తే..

కేటీపీపీలో భారీ చోరీ..

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గణపురం మండలం చెల్పూర్ KTPPలో భారీ చోరీ జరిగింది. KTPP ఎలక్ట్రిక్ స్టోర్‌లో రూ. 70లక్షల విలువ చేసే కాపర్ వైరు‌తో పాటు విలువైన సామాగ్రి చోరీకి గురైంది. దీంతో అధికారులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మరోవైపు జెన్‌కో అధికారులు విచారణ నిమిత్తం అంతర్గత కమిటీని వేశారు. ఫుల్ సెక్యూరిటీ ఉండే జెన్‌కో నుంచి విలువైన సామాగ్రి మాయం కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై ఇప్పటికే జెన్‍‌కో అధికారులకు ఉన్నతాధికారులు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం.

చీటింగ్ కేసు నమోదు..

ఖమ్మం జిల్లా సత్తుపల్లి పోలీసు స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. సత్తుపల్లి మండలం కాకర్లపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళకు ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలో వ్యక్తిగత రుణం ఇస్తానని చెప్పి ఓ వ్యక్తి రూ.8 లక్షలు తీసుకుని మోసం చేశాడు. కొద్దిరోజులకు మోసపోయినట్లు గుర్తించి బాధితురాలు సత్తుపల్లి పోలీసులో సదరు వ్యక్తిపై ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు‌తో సత్తుపల్లి పోలీసులు చింతకాని మండలానికి చెందిన గుడిపాటి పవన్ కల్యాణ్‌పై చీటింగ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

రౌడీ షీటర్ హత్య కేసులో పురోగతి ..

నిజమాబాద్ జిల్లాలో రౌడీ షీటర్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసుకు సంబంధించి ఆరుగురిని అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. ఎడ‌పల్లి శివారులో ఈనెల 1న ప్రతీకారంతో అరిఫ్ డాన్‌ను ప్రత్యర్థులు హత్య చేసిన విషయం విధితమే. పథకం ప్రకారం.. ఆరిఫ్ వాహనాన్ని లారీ‌తో ఢీ‌కొట్టి, కత్తులతో 20చోట్ల గాయపరచి హత్య చేశారు. హత్యకు ఉపయోగించిన కత్తులు, లారీ బోధన్ రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టారు. రౌడీ షీటర్ షేక్ ఇబ్రహీం హత్యకు ప్రతీకారంగా ఆరిఫ్ హత్య జరిగిన ట్లు పోలీసులు భావిస్తున్నారు.

జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం..
జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జనగామ – హైదరాబాద్ – హనుమకొండ జాతీయ రహదారి పెంబర్తి వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ఇసుక లారీని వెనుక నుండి మరో ఇసుక లారీ ఢీ కొట్టింది. డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు.

పబ్‌పై కేసు నమోదు ..

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోష్‌నాష్ పబ్‌పై కేసు నమోదైంది. నిబంధనలకు విరుద్ధంగా పబ్ నడుస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సమయం ముగిసిన తరువాతకూడా పబ్ నిర్వహణ కొనసాగుతుండటంతో పబ్ మేనేజర్ బేసుదర బెహ్రా‌ను అదుపు‌లోకి తీసుకొని పోలీసులు కేసు నమోదు చేశారు.

రోడ్డు ప్రమాదం ..

ఖమ్మం జిల్లా సత్తుపల్లి సింగరేణి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా రెండు బైక్‌లు ఢీకొని ఐదుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. వీరిని సత్తుపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అయితే, వారిలో ముగ్గురి పరిస్థితి విషమించటంతో ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.

ఆలయంలో భక్తురాలు మృతి..

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయం‌లో గుండె పోటుతో భక్తురాలు మృతి చెందింది. మృతురాలు లక్ష్మీ స్వస్థలం కరీంనగర్ జిల్లా మనకొండూరు మండలం లింగపూర్ గ్రామం. వేములవాడ రాజన్నను దర్శించుకోవడానికి కుటుంబ సభ్యులతో వచ్చింది. ఉదయం దర్శనం కోసం క్యూలైన్‌లో వెళ్తుండగా క్యూలైన్ ముందే లక్ష్మీ కుప్పకూలింది. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే, అప్పటికే ఆమె మృతి చెందినట్లు గుర్తించారు.

బంజారాహిల్స్‌లో విషాదం ..

బంజారాహిల్స్‌లోని ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. తల్లి మృతితో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. బీజేఆర్ నగర్ రహదారిపై స్కూటీ‌పై వెళ్తున్న మహిళ సంధ్యను ట్రాలీ ఆటో ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన సంధ్యను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. ఏడాదిన్నర క్రితం సంధ్య భర్త విష్ణు ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా సంధ్య మృతి‌తో ముగ్గురు చిన్నారులు అనాథలయ్యారు.

రాజేంద్ర నగర్‌లో విషాదం ..

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో విషాదం చోటు చేసుకుంది. బండ్లగూడ వద్ద రాజేందర్ అనే వ్యక్తి బలవన్మరణంకు పాల్పడ్డాడు. చెట్టుకు తాడుతో ఉరి వేసుకొని బలవన్మరణం చెందాడు. కుటుంబ కలహాలే ఆత్మహత్య‌కు కారణమని పోలీసులు భావిస్తున్నారు. రాజేందర్ స్వస్థలం కర్ణాటక‌గా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న రాజేంద్ర నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, రాజేందర్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ప్లై ఓవర్ పై‌నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య .. 

బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. బాలానగర్ ఫ్లై ఓవర్ పై నుండి అశోక్ అనే వ్యక్తి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మద్యానికి బానిసై జీవితం‌పై విరక్తి చెందిన అశోక్.. మద్యం మత్తులో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. అశోక్ వెల్డింగ్ షాపులో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బావిలో పడి వ్యక్తి మృతి ..

అదిలాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఉట్నూర్ మండలం తాండ్రకి చెందిన రమేష్(17) మేకల కాపరి. ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.