వరదలతో హైదరాబాద్ ఆగమాగం, లీడర్స్ పై ప్రజల ఆగ్రహం

  • Published By: madhu ,Published On : October 16, 2020 / 06:38 AM IST
వరదలతో  హైదరాబాద్ ఆగమాగం, లీడర్స్ పై ప్రజల ఆగ్రహం

Hyderabad floods, public outrage over political leaders : వర్షాలు, వరదలతో హైదరాబాద్ నగరం అస్తవ్యస్తమైంది. ఇళ్లల్లోకి నీళ్లు చేరడంతో.. జనాల కష్టాలు రెట్టింపయ్యాయి. ఆ కోపాన్ని పరామర్శించేందుకు వెళ్లిన నేతలపై ప్రదర్శిస్తున్నారు బాధితులు. మా గల్లీల్లోకి ఇప్పుడెందుకొచ్చారంటూ నిలదీసారు. మరోవైపు.. కాంగ్రెస్, బీజేపీ నేతలు వరద ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని పరిశీలించారు.



తీవ్ర ఇబ్బందుల్లో ప్రజలు :-
వర్షాలతో హైదరాబాద్ ఆగమాగమైంది. వరుసగా కురిసిన వర్షాలు.. వరదలతో పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. కాలనీలు కాలనీలు నీట మునిగాయి. అపార్ట్‌మెంట్ సెల్లార్లలో నీళ్లు నిల్చిపోయాయి. దీంతో… ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో బాధిత ప్రాంతాల్లో పర్యటనలకు వెళ్తున్న నేతలకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి.

ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేకు చేదు అనుభవం :-
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి రైతుల నుండి చేదు అనుభవం ఎదురైంది. తాజాగా కురుస్తున్న వర్షాలతో గ్రామంలోని చెరువు నిండడంతో పూజలు చేయాలి.. వర్షం కారణంగా పంట నష్టపోయిన రైతులను పరామర్శించాలి అనుకొని మేడిపల్లి గ్రామానికి వెళ్ళిన ఎమ్మెల్యే కిషన్ రెడ్డికి పరాభవం ఎదురైంది. ఫార్మాసిటీలో భూములు కోల్పోయిన బాధలో ఉన్న రైతులు మంచిరెడ్డి పర్యటన నేపథ్యంలో ఆగ్రహంతో ఊగిపోయారు.



రైతులపై లాఠీఛార్జీ :-
ఆయన కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు, గ్రామస్తులకు తీవ్ర వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. రాజీనామా చేయాలంటూ ఎమ్మెల్యే పైకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు, రైతులకు మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి అదుపుతప్పేలా ఉండడంతో.. పోలీసులు రైతులపై లాఠీ చార్జ్ చేశారు.

ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డిపై ఆగ్రహం :-
భారీ వర్షాలతో హైదరాబాద్ లోని కాలనీలు ఆగం కాగా.. అధికార పార్టీ నేతలు వరద బాధితుల పర్యటనకు వెళ్తుండగా.. అడుగడుగునా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డిపై తిరగబడ్డారు. భారీ వర్షాలకు ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి నియోజకవర్గం ఉప్పల్ లోని పలు కాలనీలు నీట మునిగాయి. దీంతో నష్టం జరిగిన కాలనీల పర్యటనకు పడవపై వెళ్లిన ఎమ్మెల్యేపై కాలనీ వాసులు సీరియస్ అయ్యారు. భారీ వర్షాలకు ఇండ్లు కూలాయని.. ఇంట్లో విలువైన వస్తువులు కొట్టుకుపోయాయని.. తమకు న్యాయం జరగకపోతే ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి పేరు రాసి చనిపోతామంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.



పలు ప్రాంతాల్లో పర్యటించిన కిషన్ రెడ్డి :-
డ్రైనేజీ సిస్టం బాగోలేకపోవడం వల్లే వరదలు సంభవించాయన్నారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ప్రతి వేసవిలో డ్రైనేజీ పూడిక తీస్తామని చెబుతున్నా.. ఆపని సరిగా చేయకపోవడమే ఈ వరదలకు కారణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై తాను విమర్శలు చేయదల్చుకోలేదని చెప్పిన కిషన్‌రెడ్డి పలు ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని పరిశీలించారు.

కాంగ్రెస్ నేతల పర్యటన :-
ఇటు కాంగ్రెస్ నేతలు కూడా వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. ఎమ్మెస్‌ మక్తాలో టీపీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి వరద పరిస్థితిని పరిశీలించారు. స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మూడు రోజుల నుంచి నీళ్లలో నానుతున్నా అధికారులెవరూ పట్టించుకోవడం లేదని బాధితులు చెప్పడంతో ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.



ఆదుకోవాలంటున్న బాధితులు :-
లీడర్లు వస్తున్నారు.. వెళ్తున్నారు తప్ప.. ఎలాంటి న్యాయం చేయడంలేదంటున్నారు బాధితులు. తక్షణమే తమకు ఇండ్లు కట్టించి, నష్టపరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించాలని కోరుతున్నారు వరద బాధితులు. తినడానికి తిండిలేక.. ఉండటానికి ఇళ్లు లేకా చిన్న పిల్లలతో నానా అవస్ధలు పడుతున్నామని వరద బాధితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.