అన్ లాక్ 4.0 : హైదరాబాద్ లో మెట్రో..సమయం, పూర్తి వివరాలు

  • Published By: madhu ,Published On : September 4, 2020 / 05:34 AM IST
అన్ లాక్ 4.0 : హైదరాబాద్ లో మెట్రో..సమయం, పూర్తి వివరాలు

కరోనా కారణంగా షెడ్లకే పరిమితమైన Metro రైళ్లు హైదరాబాద్ లో పట్టాలెక్కబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం పరుగులు తీయబోతున్నాయి. హైదరాబాద్ మెట్రో విభాగం పలు దశల్లో రైళ్లను తిప్పనున్నారు.



సెప్టెంబర్ 07వ తేదీ నుంచి మెట్రో రైళ్లు తిరిగి ప్రారంభిస్తున్నట్లు, అయితే..అన్ని ప్రాంతాల్లో తిప్పడం జరగదని అధికారులు వెల్లడించారు. దశల వారీగా రైళ్లను ప్రారంభించడం జరుగుతుందన్నారు. కంటోన్మెంట్ జోన్లలో (గాంధీ ఆసుపత్రి, భరత్ నగర్, మూసాపేట, ముషీరాబాద్, యూసఫ్ గూడ స్టేషన్లు) రైళ్లు తిరగవని మరోసారి స్పష్టం చేశారు.

రైలుకు రైలుకు మధ్య గడువు 5 నిమిషాలు ఉంటుందని, ప్రయాణీకులు తప్పనిసరిగా ఫేస్ మాస్క్ లు ధరించాల్సిందేనన్నారు. సోషల్ డిస్టెన్స్ పాటించాలన్నారు. కరోనా లక్షణాలు లేని వారిని మాత్రమే రైళ్లలోకి అనుమతించడం జరుగుతుందని, స్మార్ట్ కార్డు, నగదరు రహిత విధానంతో టికెట్లు కోనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు.



తొలి దశ, సెప్టెంబర్ 07 : మియాపూర్ – ఎల్బీనగర్ (కారిడార్ – 01) ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే.

రెండో దశ, సెప్టెంబర్ 08 : నాగోల్ – రాయదుర్గం (కారిడార్ – 03) ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే.



మూడో దశ, సెప్టెంబర్ 09 : కారిడార్ 01, కారిడార్ 02, కారిడార్ 03లలో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు