లాయర్ వామన్‌ రావును 18 సార్లు కత్తులతో నరికారు…అనంతరం అతనిపై కారు ఎక్కించి చంపేశారు

లాయర్ వామన్‌ రావును 18 సార్లు కత్తులతో నరికారు…అనంతరం అతనిపై కారు ఎక్కించి చంపేశారు

Lawyer Vaman Rao couple Murder : ఎంత పగ, ఎంత కక్ష. వామన్ రావుపై ఎంత ద్వేషం. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 18 సార్లు కత్తులతో నరికి చంపారు. వామన్ రావు భూమిపై మిగిలి ఉండకూడదు.. మాకు అడ్డు రాకూడదనే లక్ష్యంతో అతనిపై విచక్షణ మరిచి దాడి చేశారు. ఉన్మాదంగా, ఫ్యాక్షనిస్టులు సైతం భయపడేలా కత్తులో విరుచుకుపడ్డారు. వామన్ రావు శరీరం నుంచి నెత్తురు చిమ్ముతున్నా కనికరం లేకుండా కసాయిల్లా ప్రవర్తించారు. కత్తులతో నరికినా కుంట శ్రీనివాస్ పగ చల్లారలేరలేదేమో.. మరింత క్రూరంగా రక్తం మడుగులో పడిపోయిన వామన్ రావుపై కారు ఎక్కించి పారిపోయారు. జనం చూస్తారన్న భయం లేదు, వాళ్లు పట్టుకుంటారన్న జంకు లేదు. తాము ఏదో హీరోలం అనేలా దర్జాగా కారు ఎక్కి వెళ్లిపోయారు.

చుట్టూ జనాలు చూస్తున్నా.. భయం లేకుండా నిమిషాల్లోనే వామన్ రావుపై నిందితులు ఎటాక్ చేశారు. దాడి జరుగుతున్న సమయంలో వెనుక రెండు బస్సుల నిండా జనం ఉన్నారు. అయినా ఒక్కరు కూడా స్పందించలేదు. బైకులపై వెళ్తున్న వారు అడ్డుకోకుండా.. ఏదో సినిమా చూస్తున్నట్లు నిలబడి చూశారు. కొంతమంది అయితే మనకెందుకులే అని అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయ్యో అని అనడమే తప్ప అక్కడ నిలబడి చూస్తున్న జనం అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. నోరెళ్లబెట్టి చూడటమే తప్ప.. ఆర్తనాదాలు చేస్తున్న వ్యక్తిని కాపాడేందుకు ఒక్కరు కూడా ముందుకు రాలేదు.

సినిమా షూటింగ్ జరుగుతందని అనుంటున్నారో? లేక సీరియస్ షూటింగ్ జరుగుతుందని అనుకున్నారో జనం మాత్రం వామన్ రావుపై దాడిని అడ్డుకోలేకపోయారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తిని ఏదో సెలబ్రిటీ అన్నట్లు ఫోటోలు తీశారు. హాస్పిటల్‌కు తరలించేది పోయి.. గుమికూడి చూశారు.

అసలు వామన్ రావు హత్య చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది?. చంపేంత పగ కుంట శ్రీనివాస్‌కు ఏముందంటే మాత్రం అనేక సమాధానాలు వినిపిస్తున్నాయి. మంథని మండలంలోని గుంజపడుగు గ్రామంలో కుంట శ్రీనివాస్ అక్రమాలకు వామన్ రావు అడ్డు పడుతుండటంతో.. అతను కోపం పెంచుకున్నట్లు తెలుస్తోంది. ప్రతి పనిలో తప్పులను ప్రశ్నిస్తుండంతో రగిలిపోయినట్లు తెలుస్తోంది. అదే మనసులో పెట్టుకుని అదును కోసం శ్రీనివాస్ ఎదురు చూశారు.

వామన్ రావు మంథని కోర్టుకు వచ్చి వెళ్తున్న సమయంలో మాటు వేసి దాడి చేశారు. పెద్దపల్లి వెళ్తున్న వామన్ రావు కారుకు.. తన కారును రాంగ్ రూటులో వచ్చి కారును అడ్డు పెట్టాడు శ్రీనివాస్. కారులో కూర్చున్న వామన్ రావును కిందకు దించేందుకు కారు అద్దాలను పగలకొట్టారు. అడ్డుపడుతుందేమోననే అనుమానంతో ఆయన భార్యపై దాడి చేశారు. ఆ తర్వాత వామన్ రావును కారు నుంచి కిందకు దించి కత్తులతో దాడి చేశారు.

మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో వామన్ రావుపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో వామన్ రావు తీవ్రంగా గాయపడి నడి రోడ్డుపై నెత్తుటి మడుగులో కొట్టుమిట్టాడు. తనకు సాయం చేయండి అంటూ కొన ఊపిరితో ప్రాధేయ పడ్డాడు. తనకు ఎవరైనా మంచినీళ్లు ఇవ్వడం అని, తనను ఆసుపత్రికి తరలించండి అంటూ వేడుకున్నాడు. అప్పటికే ఘటనా స్థలంలో కొంత మంది స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించే సమయంలో వామన్ రావు తుది శ్వాస విడిచాడు.

వామన్ రావ్. నాగమణి హత్య వెనుక కుంట శ్రీనివాస్ హస్తం ప్రధానంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాణాలు విడుస్తున్న సమయంలో కూడా తనపై దాడి చేసింది కుంట శ్రీనివాస్ అని వామన్ రావు చెప్పారు. అయితే వీరిద్దరి మధ్య గొడవకు గుంజపడుగ గ్రామంలోని ఓ భూ వివాదమే కారణమని తెలుస్తోంది. 21 గుంటల భూమిని అక్రమంగా ఆక్రమించారంటూ కొంత కాలంగా వామన్ రావు శ్రీనివాస్‌పై పోరాడుతున్నారు. గ్రామంలోని రామలయం కమిటీ ఏర్పాటుపైనా వామన్ రావు విభేదించారు. పాత కమిటీని రద్దు చేసి.. కొత్త కమిటీని కుంట శ్రీనివాస్ ఏర్పాటు చేశారు. పంచాయతీ సర్పంచ్, పాలక వర్గం అనుమతి లేకుండా ఎలా ఏర్పాటు చేస్తారంటూ వామన్ రావు ప్రశ్నించారు.

మరోవైపు మంథని మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత జడ్పీ ఛైర్మన్ పుట్టా మధుతో వామన్ రావుకు విబేధాలు ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో మధు ఆస్తుల విషయంలో కూడా వామన్ రావు పోరాటం చేస్తున్నారు. మంథనిలో సంచలనం రేపిన శీలం రంగయ్య లాకప్ డెత్ కేసును కూడా వామన్ రావు వాధిస్తున్నారు. ఈ విషయంలో పోలీసులతో పలుమార్లు వామన్ రావ్ వాగ్వాదం చేసినట్లు కూడా తెలుస్తోంది. దీంతో పాటు స్థానికంగా టీఆర్ఎస్ నేతలతో వామన్ రావుకు పలు విబేధాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రాణహాని ఉందని వామన్ రావు దంపతులు హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు.

గ్రామనికి సంబంధించిన గొడవల కారణంగా వామన్ రావుపై శ్రీనివాస్ దాడి చేశారని అతని తండ్రి తెలిపారు. శిఖం భూముల్లో ఆలయంలో పెద్దమ్మ గుడి కట్టారని, ఇళ్లు కట్టారని, రామాలయ స్వామి, గోపాలయ స్వామి ఆలయం విషయంలో పలుసార్లు ప్రశ్నించినందుకే దాడి చేరని చెప్పారు. పదేపదే అడ్డు వస్తున్నారనే అక్కసుతోనే కుట్రపూరితంగా దాడి చేశారని చెప్పారు.