ఎమ్మెల్సీ ఎన్నిక..మంత్రులకు బాధ్యతలు అప్పగించిన సీఎం కేసీఆర్

ఎమ్మెల్సీ ఎన్నిక..మంత్రులకు బాధ్యతలు అప్పగించిన సీఎం కేసీఆర్

MLC elections : తెలంగాణలో జరగనున్న రెండు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాలతో టీఆర్ఎస్ నాయకత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అధికార పార్టీకి చెక్ పెట్టాలని బీజేపీ వ్యూహరచన చేస్తుండటం.. మరోవైపు ఇతర విపక్షాలు, ఇండిపెండెంట్లు సైతం రంగంలో ఉండటంతో అధికార పార్టీ ఎన్నికలపై సీరియస్‌గా దృష్టి పెట్టింది.

మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపు బాధ్యతలను మంత్రులకు అప్పగించారు సీఎం కేసీఆర్‌. హైదరాబాద్‌ జిల్లాకు గంగుల కమలాకర్‌, రంగారెడ్డి జిల్లా ఇంఛార్జీగా హరీష్‌రావు, మహబూబ్‌నగర్‌ ఇంఛార్జీగా ప్రశాంత్‌రెడ్డిలను నియమించారు. ఇటు నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక బాధ్యతను సైతం పలువురు మంత్రులకు అప్పగించాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ ఎన్నికలను అత్యంత సీరియస్‌గా తీసుకోవాలని ఇంఛార్జీ నేతలకు సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. అభ్యర్థి ప్రచారానికి రాకపోయినా ఇంఛార్జీ మంత్రులే గెలుపు బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. ఈ విషయంలో ఎవరూ అలసత్వం వహించినా.. ఊరుకునేది లేదని సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవి గెలుపు ఖాయమని మంత్రి హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల సందర్భంగా రంగారెడ్జి జిల్లా ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఇతర పార్టీల నేతలు మాటలకే పరిమితమయ్యారని.. కానీ టీఆర్ఎస్ మాత్రం చేసి చూపించిందన్నారు. త్వరలో ఇబ్రహీంపట్నంలో కూడా తాగునీటి సరఫరా ప్రారంభిస్తామన్నారు. ఏకైక మహిళా అభ్యర్థిని అత్యధిక మెజారిటీ గెలిపించాలని హరీష్ విజ్ఞప్తి చేశారు.