బతుకమ్మ చీరల్లో నయా డిజైన్స్ : జకార్డ్‌, డాబీ బార్డర్‌, కొంగులకు బూటా డిజైన్లు

బతుకమ్మ చీరల్లో నయా డిజైన్స్ : జకార్డ్‌, డాబీ బార్డర్‌, కొంగులకు బూటా డిజైన్లు

New designs in Bathukamma sarees : సిరిసిల్ల జిల్లా వస్త్ర పరిశ్రమకు… బతుకమ్మ చీరలు బ్రాండ్‌ ఇమేజ్‌గా మారుతున్నాయి. ఆడపడుచుల అభిరుచికి తగ్గట్టుగా బతుకమ్మ చీరల ఉత్పత్తిలో ఆధునికతను జోడిస్తున్నారు. ఆడబిడ్డలకు నచ్చేలా ప్రతిఏటా చీరల డిజైన్స్‌ మారుస్తున్న ప్రభుత్వం… ఈసారి మరింత కొత్తగా తీసుకురాబోతుంది. బతుకమ్మ కానుకగా ఆడపడుచులకు చీరలను కానుకగా అందిస్తోన్న సాంప్రదాయన్ని కోనసాగిస్తుంది కెసిఆర్ సర్కార్. మంత్రి కెటిఆర్ చోరవతో సిరిసిల్లలోనే బతుకమ్మ చీరల ఉత్పత్తి జరుగుతోంది. నాణ్యతను పెంచుతూనే…ఆడపడుచుల అభిరుచికి తగ్గట్టుగా పసిడి వర్ణాల్లో పట్టు చీరల డిజైన్లతో చీరలను తీసుకొస్తున్నారు.

గత ఏడాది రూ. 317 కోట్లు :-
గతేడాది 317కోట్లతో బంగారు, వెండి జరీ అంచుల్లో కోటి బతుకమ్మ చీరలను ప్రభుత్వం తయారు చేయించి పంపిణీ చేసింది. 287 రంగుల్లో తయారైన చీరలు.. సిరిసిల్లకు బ్రాండ్‌ ఇమేజ్‌ను తెచ్చిపెట్టాయి. దీంతో ఈ ఏడాది బతుకమ్మ పండుగకు సరికొత్తగా చీరలను ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది పంపిణీ చేసే చీరల్లో మరింత కొత్తదనం ఉట్టిపడేలా అధికారులు ప్లాన్‌ చేస్తున్నారు. బతుకమ్మ చీరలకు జకార్డ్‌, డాబీ బార్డర్‌తో చీరలను అందంగా తయారు చేయిస్తున్నారు. కొత్త కొత్త రంగులతో ఉండే చీర కొంగులకు.. బూటా డిజైన్లు ఇవ్వనున్నారు.

చీరల్లో కొత్తదనం :-
ఆడపడుచులకు అందించే చీరల్లో కొత్తదనం కోసం జకార్డ్‌లను ఉపయోగించి బూటా, ఇతర డిజైన్లతో కోటి చీరలు ఉత్పత్తి చేయనున్నారు. కోటి చీరల్లో 90 లక్షల చీరలు 6.3 మీటర్ల పొడవుతో యువతులు, మహిళలు కట్టుకునే విధంగా తయారు చేయిస్తున్నారు. మరో 10 లక్షల చీరలు 9 మీటర్లతో వృద్ధుల కోసం ప్రత్యేకించి ప్రభుత్వం తయారు చేయిస్తోంది. 2017లో బతుకమ్మ కానుకగా చీరల పంపిణి కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో సంక్షోభాన్ని తొలగించే దిశగా ఏటా టిఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇస్తోంది.

ఇప్పటి వరకు రూ. 1033 కోట్లు ఖర్చు :-
గడిచిన నాలుగేళ్లలో ఇప్పటి వరకు బతుకమ్మ చీరలపై ప్రభుత్వం దాదాపు 1033 కోట్లు ఖర్చు చేసింది. సిరిసిల్లలో 129 మ్యాక్స్‌ సొసైటీలు, 196 ఎస్‌ఎస్‌ఐ యూనిట్ల ద్వారా 16 వేల మరమగ్గాలపై చీరల ఉత్పత్తి జరగుతుంది. ఇందులో 6 వేల మరమగ్గాలకు జకార్డ్‌ మిషన్లు బిగించి ఉండగా.. మిగతా వాటికి కూడా బిగించుకోవడానికి యాజమానులు సిద్ధమవుతున్నారు. జకార్డ్‌ యంత్రాలను బిగించుకుంటే ప్రభుత్వం రాయితీ కూడా ఇస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈసారి బతుకమ్మ చీరలు ఆడపడుచులు నచ్చి…మెచ్చె…కానుకగా ప్రభుత్వం తయారు చేయిస్తోంది. తెలంగాణ ఆడబిడ్డలు ప్రభుత్వం అందిస్తోన్న చీరను చూసి సంబర పడేలా తీర్చిదిద్దుతోంది.