Hyderabad IT Employees: హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులకు షాకిచ్చిన పోలీసులు.. అనుమతి లేకుండా అలాచేస్తే కఠిన చర్యలు..
చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఐటీ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. అయామ్ విత్ సీబీఎన్ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళనలో పాల్గొన్నారు.

Hyderabad IT Employees
Hyderabad IT Employees Protest: ఏపీ స్కిల్ డవలప్‌మెంట్ కేసులో సీఐడీ అధికారులు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును అరెస్టు (Chandrababu Arrest) చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఏపీ ప్రభుత్వం కుట్రలో భాగంగానే చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపించారంటూ టీడీపీ శ్రేణులు ఏపీ వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. అక్రమంగా అరెస్టు చేసిన చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గత రెండు రోజులుగా రోజుకో కార్యక్రమాన్ని టీడీపీ శ్రేణులు చేపడుతూ తమ నిరసన తెలుపుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ లోని మాదాపూర్ లో రెండు రోజులుగా ఐటీ ఉద్యోగులు ఆందోళనకు దిగారు.
చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఐటీ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. అయామ్ విత్ సీబీఎన్ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళనలో పాల్గొన్నారు. అయితే, శుక్రవారం సైతం ఆందోళనకు దిగిన ఐటీ ఉద్యోగులకు హైదరాబాద్ పోలీసులు షాకిచ్చారు. హైదరాబాద్‌లోని పలువురు ఐటీ ఉద్యోగులు చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ చేపడుతున్న ఆందోళనపై పోలీసులు ఆంక్షలు విధించారు. మాదాపూర్, గచ్చిబౌలి, మణికొండ, నానక్ రాంగూడ, తదితర ప్రాంతాల్లో ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు.
కొందరు ఐటీ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు ఎలాంటి ముందస్తు పోలీసు అనుమతి లేదని మాదాపూర్ పోలీసులు తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ఆందోళన చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్డుపైకివచ్చి ఆందోళన చేయడం ద్వారా వాహనదారులు, సామాన్య ప్రజలకు ఆటంకం ఏర్పడుతుందని.. అనుమతి లేకుండా ఎలాంటి ఆందోళన చేపట్టొదని పోలీసులు సూచించారు. ఆందోళన చేసే ఐటీ ఉద్యోగుల కంపెనీలకు నోటీసులు పంపిస్తామని మాదాపూర్ పోలీసులు తెలిపారు. కాగా, పోలీసుల ఆంక్షలను చంద్రబాబు మద్దతుదారులు విమర్శిస్తున్నారు. తాము ఎవరినీ ఇబ్బంది పెట్టకుండానే ఆందోళనలు చేస్తున్నామని చెబుతున్నారు.